ఆర్‌ఈసీఎస్‌లో ఇష్టారాజ్యం

ABN , First Publish Date - 2022-07-03T06:37:14+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకే ఇంకా జూన్‌ నెల జీతాలు అందలేదు.

ఆర్‌ఈసీఎస్‌లో ఇష్టారాజ్యం

జీతాల కోసం అంటూ రూ.1.67 కోట్లు విత్‌డ్రా

ఈపీడీసీఎల్‌లో విలీనం నుంచి మినహాయింపుపై ఎటువంటి ఉత్తర్వులు రాకుండానే అధికారుల సొంత పెత్తనం

పట్టించుకోని ఈపీడీసీఎల్‌


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకే ఇంకా జూన్‌ నెల జీతాలు అందలేదు. ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. అనకాపల్లి గ్రామీణ విద్యుత్‌ సహకార సంస్థ (ఆర్‌ఈసీఎస్‌) ఉద్యోగులకు మాత్రం ఒకటో తేదీనే అందిపోయాయి. మొత్తం 489 మంది ఉద్యోగులకు రూ.1.67 కోట్లకు చెక్‌లు రాసి, వారి ఖాతాల్లో డబ్బులు వేసేశారు. విచిత్రం ఏమిటంటే...అది సహకార సంస్థ. దానికి మేనేజింగ్‌ డైరెక్టర్‌ను ప్రభుత్వం గుర్తించలేదు. సంస్థను విలీనం చేసుకున్న ఈపీడీసీఎల్‌ ఎనిమిది నెలల పాటు ఆయనకు జీతం కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం విలీనం నుంచి మినహాయింపు ఇస్తుందని చెప్పి నెల రోజులుగా ఆర్‌ఈసీఎస్‌ అధికారులు సొంతంగా ఆర్థిక వ్యవహారాలు చక్కబెడుతున్నారు. జూన్‌లో సుమారు రూ.9.75 కోట్లు బిల్లుల రూపంలో వినియోగదారుల వద్ద నుంచి వసూలు చేశారు. అవన్నీ ఆర్‌ఈసీఎస్‌ బ్యాంకు ఖాతాల్లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రానందున వాటిని వినియోగించుకునే అవకాశం, అధికారం లేదు. కానీ ఆ సంస్థ పెద్దలు అప్పటివరకు ఆగకుండా జీతాల కోసం అంటూ బ్యాంకు ఖాతాల నుంచి రూ.1.67 కోట్లు విత్‌డ్రా చేశారు. ప్రాజెక్టు ఇంజనీర్‌కు రూ.1.6 లక్షలు, ఆరుగురు డీపీఈలు ఉండగా వారికి ఒక్కొక్కరికి రూ.1.3 లక్షలు, పదమూడు మంది ఏపీఈలు ఉండగా ఒక్కొక్కరికి రూ.1.05 లక్షలు, పదహారు మంది జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్లకు ఒక్కొక్కరికి రూ.90 వేలు, 32 మంది లైన్‌మెన్‌ ఉండగా ఒక్కొక్కరికి రూ.54 వేలు, ఆఫీసులో పనిచేసే నలుగురు అటెండర్లకు ఒక్కొక్కరికి రూ.60 వేలు, డ్రైవర్లకు రూ.48 వేలు, 229 మంది కాంట్రాక్ట్‌ పర్మనెంట్‌ వర్కర్లకు ఒక్కొక్కరికి రూ.25 వేలు, టెంపరరీ ఉద్యోగులు 143 మంది కాగా ఒక్కొక్కరికి రూ.15 వేలు...ఇలా 489 మందికి రూ.1,67,34,000 జీతాలు ఇచ్చేశారు. ఇంకా నిర్వహణ ఖర్చు, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల పేరుతో మరికొంత డ్రా చేశారు. ఇదీ అనకాపల్లి ఆర్‌ఈసీఎస్‌లో జరుగుతున్న బాగోతం. జూన్‌లో వసూలు చేసిన రూ.9.75 కోట్లలో ఇంకా ఎంత మిగిల్చారో తెలియదు. ఇటు చూస్తే వారికి అమాత్యుల అండదండలు వున్నాయని ఈపీడీసీఎల్‌ పట్టించుకోవడం మానేసింది. చర్యలు తీసుకోలేదని విశాఖపట్నం సర్కిల్‌ అధికారుల్లో కొందరిని బదిలీ చేసేశారు. మరి ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదనేది అనేక అనుమానాలకు తావిస్తోంది. ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి కూడా చోద్యం చూస్తోంది.  


2 గంటలకు సస్పెన్షన్‌...4 గంటలకు రద్దు

అనకాపల్లి ఆర్‌ఈసీఎస్‌లో శనివారం మరో విచిత్రం చోటుచేసుకుంది. కొత్తూరు సెక్షన్‌లో అసిస్టెంట్‌ ఇంజనీర్‌కు, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.శ్రీనివాసరావుకు కొంతకాలంగా పొసగడం లేదు. దాంతో ఏఈ ఫిర్యాదు మేరకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామకృష్ణరాజు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు సదరు లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సరిగ్గా విధులు నిర్వహించనందున, ప్రజోపయోగాన్ని దృష్టిలో ఉంచుకొని సస్పెండ్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు. దీనిపై విచారణ కూడా చేస్తామని అందులో పేర్కొన్నారు. ఉత్తర్వు తీసుకున్న సదరు ఉద్యోగి తనకు తెలిసిన రాజకీయ పెద్దలతో ఫోన్‌ చేయుంచడంతో...సాయంత్రం నాలుగు గంటలకు సదరు ఉద్యోగికి ఫోన్‌ చేసి, సస్పెన్షన్‌ ఉత్తర్వులు చించివేయాలని, జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోవాలని చెప్పారు. తాము కూడా కంప్యూటర్‌ నుంచి ఆ వివరాలు తొలగిస్తున్నామని పేర్కొన్నారు. 

ఇదిలావుండగా, సెక్షన్‌ కార్యాలయాల నుంచి బిల్లుల వసూళ్ల వివరాలు బయటకు వెళుతున్నాయని చెప్పి, అక్కడ పనిచేసే కంప్యూటర్‌ ఆపరేటర్లను సోమవారం నుంచి బిల్లుల వసూళ్లకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. అయితే వారు తాము ముందు నుంచి కంప్యూటర్‌ ఆపరేటర్లుగానే ఉంటున్నామని, అనుమానాలతో తమను వేధించవద్దని, అక్కడే కొనసాగుతామని స్పష్టంచేశారు.  

Updated Date - 2022-07-03T06:37:14+05:30 IST