భగ్గుమన్న మిర్చి రైతు

ABN , First Publish Date - 2022-01-25T05:36:47+05:30 IST

మిర్చి రైతులు కన్నెర్ర చే యడంతో వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెటట్‌ సోమవారం రణరంగంగా మారింది. కష్టపడి పంట పండించి మార్కెట్‌కు తీసుకువస్తే వ్యాపారులు ధర తగ్గిం చి కొనుగోలుచేస్తున్నారంటూ రైతులు విధ్వంసానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.

భగ్గుమన్న మిర్చి రైతు
మిర్చి యార్డు నుంచి నినాదాలు చేసుకుంటు మార్కెట్‌ ప్రధాన కార్యాలయానికి వెళ్తున్న రైతులు,కార్యాలయంలోని ఫర్నిచర్‌ ధ్వంసం చేసిన రైతులు, ధ్వంసమైన డీసీఎం అద్దాలు, దాడికి వెళ్తున్న రైతులు

రణరంగంగా మారిన వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌
తేజ రకం మిర్చికి తక్కువ ధర పలకడంతో ఆగ్రహం
వ్యాపారులు, అధికారుల తీరుపై నిరసన
ఫర్నిచర్‌, డీసీఎం వాహన అద్దాల ధ్వంసం
ప్రధాన గేటు వద్ద బైఠాయింపు.. మోహరించిన పోలీసులు
చర్చలు జరిపిన మార్కెట్‌ పాలకవర్గం, అధికారులు
మార్కెట్‌కు రెండు రోజుల సెలవులు ప్రకటించిన కమిటీ


వరంగల్‌ టౌన్‌, జనవరి 24: మిర్చి రైతులు కన్నెర్ర చే యడంతో వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెటట్‌ సోమవారం రణరంగంగా మారింది. కష్టపడి పంట పండించి మార్కెట్‌కు తీసుకువస్తే వ్యాపారులు ధర తగ్గిం చి కొనుగోలుచేస్తున్నారంటూ రైతులు విధ్వంసానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. అటు పోలీసులు.. ఇటు మార్కె ట్‌ పాలకవర్గం, అధికారులు కలిసి రైతులు, వ్యాపారులతో చర్చలు జరపడంతో సమస్య సద్దుమణిగింది. ఆందోళనతో మార్కెట్‌ రోజంతా అట్టుడికింది. వివరాల్లోకి వెళితే..

వరంగల్‌ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు సో మవారం సుమారు 20వేల బస్తాల మిర్చి అమ్మకానికి వచ్చింది. వ్యాపారులు తేజ రకం మిర్చి క్వింటాకు గరిష్ట ధర రూ.17,200,  కనిష్ట ధర రూ.13,500గా నిర్ణయించారు. అయితే గరిష్ట ధర అయిన రూ.17,200 ఒకటి రెండు లాట్లకు మాత్రమే దక్కుతూ... మిగతా లాట్లకు రూ.13,000 నుంచి రూ.14000 ధర పలుకుతుండడంతో రైతులు ఒక్కసారిగా ఆవేశానికి లోనయ్యారు. ఇంత తక్కు వ ధర పెడుతున్నారెందుకని వ్యాపారులను ప్రశ్నించారు. ‘మీరు తెచ్చిన మిర్చి నాణ్యతను బట్టి ఇంతకంటే ఎక్కువ రాదు..’ అని వ్యాపారులు  సమాధానమివ్వడంతో  రైతు లు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ క్రమంలోపెద్ద ఎత్తున రైతులు మిర్చి యార్డు కార్యాలయానికి వచ్చి అధికారుల తో వాగ్వాదానికి దిగారు. ఇదే సమయంలో కొందరు కా ర్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అక్కడి నుంచి బయలుదేరి ప్రధాన కార్యాలయం వద్దకు చేరి ఆం దోళన చేశారు. అక్కడి నుంచి మార్కెట్‌ ప్రధాన ద్వారం వద్ద గల రైతు విగ్రహం ముందు కూర్చుని ధర్నా చేశారు.

సమాచారం అందుకున్న ఇంతేజార్‌గంజ్‌ సీఐ మల్లేశం, మిల్స్‌కాలనీ సీఐ శ్రీనివాస్‌.. బలగాలతో చేరుకుని అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం పోలీసులు, అధికారులు, మార్కెట్‌ చైర్‌పర్సన్‌, పాలకవర్గ సభ్యులు కలిసి  రైతులతో మాట్లాడి వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేశారు.  అయితే మధ్యా హ్నం బీజేపీ నాయకులు మార్కెట్‌కు వచ్చి  రైతులకు మద్దతు తెలపడంతో మళ్లీ రైతులు ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలుమార్లు రైతులు కార్యాలయం గేట్ల వద్ద ఆందోళనకు దిగారు. మిర్చి యార్డులో రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో వారికి నచ్చజెప్పేందుకు మార్కెట్‌ కార్యదర్శి రాహుల్‌ యత్నించగా వాగ్వాదానికి దిగారు. రైతులు కర్రలు పట్టుకుని కనిపించిన వాటిని పగులగొట్టారు.

రైతులు, వ్యాపారులతో సమావేశం
మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ దిడ్డి భాగ్యలక్ష్మి, కార్యదర్శి రాహుల్‌, పాలకవర్గ సభ్యులు, పోలీసు అధికారులు కలిసి  మిర్చి రైతులు, చాంబర్‌ ప్రతినిధులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించి మిర్చి ధరలపై సమీక్షించారు.  వ్యాపారులు కావాలనే మిర్చి ధరలు తగ్గించారని రైతులు ఆరోపించారు. మిర్చి నాణ్యతను బట్టే ధరలు నిర్ణయిస్తారని వ్యాపారులు చెప్పారు. ఇదిలా ఉంటే మధ్యేమార్గంగా ధర తగ్గిందని చెబుతున్న రైతుల మిర్చిని అడ్తిదారులు మరోమారు ఖరీదుదారులను తీసుకెళ్లి చూపించి సరైన ధరలు నిర్ణయించాలని సూచించారు.

బీజేపీ నాయకుల మద్దతు
మార్కెట్లో మిర్చి రైతులు ఆందోళన గురించి తెలుసుకున్న బీజేపీ కిసాన్‌ సెల్‌ నాయకుడు తిరుపతిరెడ్డి, నగర నాయకులు కుసుమ సతీష్‌, సముద్రాల పరమేశ్వర్‌, బాకం హరిశంకర్‌, రఘుణారెడ్డి, మార్టిన్‌ లూథర్‌, గడల కుమార్‌, ఎల్లంశెట్టి వీరస్వామి తదితరులు మార్కెట్‌కు చేరుకుని మద్దతు తెలిపారు.

ఫర్నిచర్‌ ధ్వంసం
ధర తగ్గిందని రైతులు ఆవేశంతో మిర్చి యార్డులోని కార్యాలయంలో టేబుళ్లు, కుర్చీలు, కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న డీసీఎం వ్యాన్‌లో లోడైన మిర్చి బస్తాలను కిందపడేశారు. అంతటితో ఆగకుండా డీసీఎం అద్దాలను పగలగొట్టారు.  ప్రధాన కార్యాలయం గేటును పడగొట్టేందుకు యత్నించారు.

రెండు రోజులు సెలవులు
రైతుల ఆందోళనతో  మార్కెట్‌ కమిటీ మంగళవారం, బుధవారం మార్కెట్‌కు సెలవు ప్రకటించింది. సోమవారం మార్కెట్లో మిర్చి రైతులు ఆందోళన నేపథ్యంలో మిగిలిన మిర్చిని మంగళవారం కొనుగోలు చేసేందుకు నిర్ణయించగా, బుధవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సెలువు ప్రకటించారు. గురువారం నుంచి యథావిధిగా క్రయవిక్రయాలు కొనసాగుతాయని కమిటీ పేర్కొంది.

ఆర్డీవో రాక
మిర్చి రైతులు ఆందోళన తెలుసుకున్న కలెక్టర్‌ గోపి.. ఆర్డీవో మహేందర్‌జీని మార్కెట్‌కు పంపించారు. ఆయన మార్కెట్‌కు చేరుకుని చాంబర్‌ ప్రతినిధులు, వ్యాపారులతో మాట్లాడారు. రైతులకు న్యాయం చేసేలా ధరలు ఇవ్వాలని సూచించారు.  అవసరమైతే రాత్రిపూట లైటింగ్‌ ఏర్పాటు చేసైనా ధరలు నిర్ణయించి కాంటాలు పూర్తి చేసి రైతులను పంపించేందుకు సహకరించాలని చాంబర్‌ ప్రతినిధులను, వ్యాపారులను కోరారు.

రైతులకు నష్టం జరగొద్దు..
అధికారులను ఆదేశించిన మంత్రి ఎర్రబెల్లి

హనుమకొండ టౌన్‌, జనవరి 24: వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌లో సోమవారం మిర్చి రైతులు చేసిన ఆం దోళనపై పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందించారు. వరంగల్‌ కలెక్టర్‌ గోపి, మార్కెట్‌ చైర్మన్‌ దిడ్డి భాగ్యలక్ష్మి, మార్కెట్‌ కార్యదర్శి, చాంబర్‌ ప్రతినిధులతో మంత్రి మాట్లాడారు. రైతులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారని, రైతులను ఎవరు మోసం చేసినా ఉపేక్షించేది లేదన్నారు. రైతులు నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులకు మద్దతు ధర వచ్చేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు గిట్టుబాటు ధర వచ్చే వరకు మార్కెట్‌లోని శీతల గిడ్డంగుల్లో భద్రపరుచుకోవాలని సూచించారు.  గిడ్డంగుల్లో భద్రపరుచుకున్న రైతుల ఉత్పత్తులపై వడ్డీలేని రుణం పొందవచ్చన్నారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కలెక్టర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశించారు.

నాణ్యతను బట్టి ధర నిర్ణయం
- బి.రవీందర్‌ రెడ్డి, వరంగల్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు

మార్కెట్లో వ్యాపారం చేసే ప్రతీ వ్యాపారి... క్వింటాకు ఓ వంద రూపాయల లాభంపై వ్యాపారం చేస్తారు. అంతే తప్ప వేలకు వేలు తగ్గించడం, పెంచడం ఉండదు. ఇటీవల కాలంలో వరుసగా వర్షాలు పడడంతో మిర్చి నాణ్యత పడిపోయింది. నాణ్యత లేనప్పుడు ఆటోమెటిక్‌ ధర పడిపోతుంది. నాణ్యత లేకుండా ఎక్స్‌పోర్టు చేయడం కష్టం. ఎక్స్‌పోర్టు చేయకుండా ఇక్కడే సరుకు అమ్ముడుపోయేది కాదు. ధర తగ్గిందని అంటున్న రైతుల బస్తాలను మంగళవారం అడ్తిదారులు ఖరీదుదారులకు చూపించి అమ్మించేలా చర్యలు తీసుకోవాలి.

కోల్డ్‌స్టోరేజీలో పెట్టుకోండి...
- దిడ్డి బాగ్యలక్ష్మి, వరంగల్‌ మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌

రైతులు ఎవరూ ఇబ్బంది పడాల్సిన పని లేదు. ధర నచ్చకపోతే మిర్చి బస్తాలను కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసుకుని రైతుబంధు పథ కం ద్వారా సరుకు విలువలో 70శాతం రు ణం తీసుకోవచ్చు. రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.

Updated Date - 2022-01-25T05:36:47+05:30 IST