ltrScrptTheme3

రెడ్ మూవీ రివ్యూ

Jan 14 2021 @ 14:18PM

సమర్పణ:  కృష్ణ పోతినేని

బ్యానర్: శ్రీ స్రవంతి మూవీస్

నటీనటులు: రామ్ పోతినేని, మాళవికా శర్మ, అమృతా అయ్యర్, నివేదా పేతురాజ్, సంపత్, సోనియా అగర్వాల్, సత్య తదితరులు

సంగీతం: మణిశర్మ

సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి

ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాశ్

ఎడిటర్: జునైద్

స్టంట్స్: పీటర్ హెయిన్స్

నిర్మాత: స్రవంతి రవికిశోర్

దర్శకత్వం: కిషోర్ తిరుమల


లవర్‌బోయ్ ఇమేజ్‌ ఉన్న హీరో రామ్‌ ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మాస్‌కు బాగా కనెక్ట్‌ అయ్యాడు. రామ్‌ నెక్ట్స్‌ ఎలాంటి సినిమా చేస్తాడోనని అందరూ అనుకుంటున్న తరుణంలో రెడ్ అనే సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమాను‌ చేస్తున్నట్లు ప్రకటించారు. తమిళ చిత్రం 'తడం'కు రీమేక్‌గా రామ్‌ 'రెడ్‌' సినిమాను అనౌన్స్‌ చేయగానే.. మాస్‌కు కనెక్ట్‌ అయ్యే సమయంలో రామ్‌ మాస్‌ సబ్జెక్టే ఎంచుకోవచ్చు కదా.. అని కొంద‌రూ అనుకున్నారు. కానీ రామ్ మాత్రం నా రూటే సపరేటు అనుకుంటూ 'రెడ్‌' సినిమాను ట్రాక్‌ ఎక్కించేశాడు. తమిళంలో సూపర్‌హిట్‌ అయిన సినిమా 'తడం' ఈ రీమేక్‌ సినిమాను తెరకెక్కించడం అంటే చిన్న విషయం అయితే కాదు.. కచ్చితంగా కంపేరిజన్స్‌ చూస్తారు. ఫ్యాన్స్‌లో ఓ అంచనాలుంటాయి. మరి రామ్‌ 'రెడ్‌స‌తో త‌న‌పై ఉన్న అంచనాలను అందుకున్నాడా?  మరో సక్సెస్‌ అందుకుంటాడా?  లేదా?  అనే విషయాలు తెలియాలంటే కథలోకి వెళదాం... 


కథ: 


సిద్ధార్థ్‌(రామ్‌ పోతినేని) ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి ఎండీ. తన ఆఫీసుకు పక్కనుండే సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలో పనిచేసే అమ్మాయి మహిమ(మాళవికా శర్మ)ను చూసి ప్రేమిస్తాడు. ఆమె కూడా తన ప్రేమను ఒప్పుకునేలా చేస్తాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ కావాలని అనుకుంటారు. మరో వైపు ఆదిత్య(రామ్‌ పోతినేని) పెద్దగా చదువుకోడు. కానీ ఐదారు భాషల్లో చక్కగా మాట్లాడుతాడు. అయితే మోసాలు చేస్తూ బతుకుతుంటాడు. ఇద్దరి జీవితాలు భిన్నంగా వెళుతుంటాయి. అయితే అనుకోకుండా ఆకాశ్‌ అనే యువకుడిని ఒకరు హత్య చేస్తారు. దొరికిన ఫొటో ఆధారంగా పోలీసులు హ‌త్య చేసింది సిద్ధార్థ్ అని నిర్ధారణకు వచ్చి అరెస్ట్‌ చేస్తారు. పాత పగను మనసులో పెట్టుకున్న సీఐ(సంపత్‌) మాత్రం ఒకవేళ సిద్ధార్థ్‌ తప్పు చేయకపోయినా, అతన్ని కేసులో ఇరికించి శిక్ష పడేలా చేయాలని అనుకుంటాడు. అదే సమయంలో ఆదిత్యను పోలీసులు అరెస్ట్‌ చేస్తారు.


ఇద్దరూ ఒకేలా ఉండటంతో ఎవరు హత్య చేశారో పోలీసులకు అర్థం కాదు. ఇద్దరి బ్యాగ్రౌండ్స్‌ను పోలీసులు చెక్‌ చేస్తారు. కేసు పురోగ‌తిలోనూ అనుమానించే అంశాలేవీ దొరకవు. దాంతో ఇద్దరినీ కోర్టు నిర్దోషులుగా కోర్టు వదిలేస్తుంది. అయితే కేసుని డీల్‌ చేసిన ఎస్సై యామిని(నివేదా పేతురాజ్‌)కి అసలు హంతకుడు ఎవరా? అనేది స‌స్పెన్స్‌గానే అలాగే ఉండిపోతుంది. అదే సమయంలో ఆమెకు అనుకోని నిజం ఒకటి తెలుస్తుంది. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోతుంది. ఇంత‌కీ యామినికి తెలిసిన నిజ‌మేంటి? మ‌రి ఆకాశ్‌ను చంపింది ఎవరు?  సిద్ధార్థ్‌, ఆదిత్య మధ్య సంబంధం ఏంటి?  నిజం తెలిసిన యామిని ఎందుకు ఏమీ చేయలేపోతుంది?  అనే విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. 


సమీక్ష: 


ఓ పక్కా మాస్‌ కమర్షియల్‌తో బ్లాక్‌బస్టర్‌ కొట్టిన రామ్..వెంట‌నే మరో మాస్‌ సినిమా చేయకుండా సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చేయడానికి రెడీ అవడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే ఈ సినిమాను చేయ‌డం ద్వారా మూస ఫార్ములాకు తాను వ్యతిరేకంగా అని తను చెప్పకనే చెప్పేశాడు రామ్‌. అలాగే రోల్స్ ప‌రంగా చూస్తే ఆదిత్య ఏమో మాస్‌గా ఉంటాడు.. సిద్ధార్థ్‌ ఏమో క్లాస్‌గా ఉంటాడు. కెరీర్‌లో తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన రామ్‌ ఆదిత్య, సిద్ధార్థ్‌ పాత్రల్లో చక్కటి వేరియేషన్‌ చూపిస్తూ నటించాడు. ఇక సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌ ఉన్నారు.


కథంతా మాళవికా శర్మ పాయింట్‌ను బేస్‌ చేసుకుని రన్‌ అవుతుంది. కానీ ఆమె పాత్ర పరిమితంగా ఉంటుంది. ఇక అమృతా అయ్యర్‌ పాత్ర కూడా చిన్నదే అయినప్పటికీ గాయత్రి పాత్రలో ఒదిగిపోయింది. సిన్సియర్‌ ఎస్సై యామినిగా నివేదా పేతురాజ్‌ మంచి రోల్‌లో నటించింది. సంపత్‌, పోసాని కృష్ణమురళి, సోనియా అగర్వాల్‌ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతికంగా చూస్తే దర్శకుడు కిషోర్‌ తిరుమల సినిమాను చక్కగా హ్యాండిల్‌ చేశాడు. తమిళ మాతృకను తెలుగులోకి రీమేక్ చేసినప్పటికీ సంభాషణల విషయంలో తన పెన్‌ పవర్‌ను చూపించాడు. 'నాకు నీ అబద్దం వినిపించింది. నీ అవసరం కనిపించింది' అని అమృతా అయ్యర్‌.. రామ్‌తో చెప్పే డైలాగ్‌.. అలాగే రామ్‌ 'రామాయణం మగవాడికి బదులు ఆడది రాసుంటే అనుమానించే విషయానికి ముందే ఆపేసుండేది. అప్పటి నుండి అనుమానం అనేది ఉండేది కాదేమో' అని అమృతా అయ్యర్‌తో చెప్పే డైలాగ్‌తో పాటు సందర్భానుచితం మంచి డైలాగ్స్‌ రాశాడు కిషోర్‌. 


అలాగే రామ్‌, కిషోర్‌ తిరుమల కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా ఇది. గత రెండు చిత్రాలకు భిన్నంగా రామ్‌ను చూపించే ప్రయత్నం చేశాడు కిషోర్‌ తిరుమల. ఈ ప్రయత్నంలో తను సక్సెస్‌ అయ్యాడనిపిస్తుంది. ఇక సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అంశాలకు కీలకంగా ఉండే బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ విషయంలో మణిశర్మ, తన పనితనంతో సన్నివేశాలను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లాడు. సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ బావుంది. పాటల విషయానికి వస్తే హెబ్బాపటేల్‌ ఐటెమ్‌ సాంగ్‌ మాస్‌ను ఆకట్టుకుంటుంది. ఇక నువ్వే నువ్వే సాంగ్‌ పిల్ల తెమ్మరలా అనిపిస్తుంది. సన్నివేశాలను కూడా కిషోర్‌ తిరుమల కొన్నింటిని యాడ్‌ చేసుకుని తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా చేశాడు. ఉదాహరణకు వెన్నెలకిషోర్‌ ట్రాక్‌ ఉదాహరణగా చెప్పొచ్చు. 


చివరగా... రెడ్‌.. ఎంగేజింగ్‌ థ్రిల్లర్‌

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.