రూ.1.5 కోట్ల ఎర్రచందనం స్వాధీనం

ABN , First Publish Date - 2022-09-28T08:10:25+05:30 IST

ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు.

రూ.1.5 కోట్ల ఎర్రచందనం స్వాధీనం
స్మగ్లర్ల వివరాలు తెలియజేస్తున్న పోలీసులు

ఏడుగురు స్మగ్లర్ల అరెస్టు

నాలుగు కార్లు, ద్విచక్ర వాహనం సీజ్‌


ఎర్రావారిపాలెం, సెప్టెంబరు 27: ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.5కోట్ల విలువైన 15 ఎర్రచందనం దుంగలు, నాలుగు కార్లు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. భాకరాపేట సీఐ తులసీరామ్‌, ఎర్రావారిపాలెం ఎస్‌ఐ వెంకటేశ్వర్లు మంగళవారం సాయంత్రం మీడియాకు వివరాలను తెలిపారు. ఎర్రావారిపాలెం మండల పరిధిలోని బొంతకనుము వద్ద స్మగ్లర్లు ఎర్రచందనాన్ని వాహనాల్లో తరలిస్తున్నారని సమాచారం అందింది. ఉదయం తొమ్మిది గంటలకు ఆ ప్రాంతంలో నిఘా ఉంచారు. రెండు కార్లు వేగంగా వస్తుండగా గమనించి.. వెంబడించారు. వాహనాలను ఆపి, తనిఖీ చేయగా.. ఏడు ఎర్రచందనం దుంగలు కనిపించడంతో స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాల్లోని ముగ్గురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయానికి బోడేవాండ్లపల్లె సమీపం సాయికాడ గుట్ట వద్ద మరో రెండు కార్లలో ఎనిమిది ఎర్రచందనం దుంగలను  తరలిస్తుండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాల్లోని ముగ్గురు స్మగ్లర్లను, పైలట్‌గా వ్యవహరించిన ఓ ద్విచక్ర వాహనదారుడిని అదుపులోకి తీసుకున్నారు. ద్విచక్ర వాహనాన్నీ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న 15 ఎర్రచందనం దుంగల విలువ రూ.1.5 కోట్లు ఉంటుందన్నారు. పట్టుబడిన స్మగ్లర్లలో.. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం మేళ్లచెరువుకు చెందిన రామచంద్ర, కృష్ణమూర్తి, వేపులబైలుకు చెందిన వడ్ల హరిబాబు, జనార్దన్‌, లోకనాథంతోపాటు తిరుపతి జిల్లాకు చెందిన వరుణ్‌, దయానంద నాయుడు ఉన్నారు. ఈ దాడుల్లో హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రతాప్‌, సూర్యకుమార్‌రావు, చరణ్‌, రవికుమార్‌, సిద్ధారెడ్డి, గుర్రప్ప, నరేష్‌ ఆచారి, శోభ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  సీఐ, ఎస్‌ఐలను ఎస్పీ పరమేశ్వరరెడ్డి అభినందించారు. 

Updated Date - 2022-09-28T08:10:25+05:30 IST