రూ.20 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత

ABN , First Publish Date - 2021-07-27T06:28:57+05:30 IST

పదహారో నంబరు జాతీయ రహదారిపై ఓ ట్రక్కులో అక్రమంగా కడప నుంచి విజయవాడకు తరలిస్తున్న 20 లక్షల రూపాయలు విలువైన 24 ఎర్రచందనం దుంగలను బొల్లాపల్లి టోల్‌ప్లాజా సమీపంలో ఆదివారం రాత్రి పట్టుకున్నట్లు ఇంకొల్లు సీఐ పి.సుబ్బారావు తెలిపారు.

రూ.20 లక్షల విలువైన ఎర్రచందనం పట్టివేత
వివరాలను వెల్లడిస్తున్న ఇంకొల్లు సీఐ పి. సుబ్బారావు, ఎస్‌ఐ చౌడయ్య, సిబ్బంది

వాహనాల తనిఖీలో పట్టుబడిన వైనం

మార్టూరు, జూలై 26: పదహారో నంబరు జాతీయ రహదారిపై ఓ ట్రక్కులో అక్రమంగా కడప నుంచి విజయవాడకు తరలిస్తున్న 20 లక్షల రూపాయలు విలువైన 24 ఎర్రచందనం దుంగలను బొల్లాపల్లి టోల్‌ప్లాజా సమీపంలో ఆదివారం రాత్రి పట్టుకున్నట్లు ఇంకొల్లు సీఐ పి.సుబ్బారావు తెలిపారు. సోమవారం స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. కడప జిల్లా మైదుకూరు గ్రామానికి చెందిన సంగటిపల్లి జయరాముడు ట్రాక్టరు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. చెడువ్యసనాలకు అలవాటుపడిన అతను ఎర్రచందనం అక్రమ రవాణాదారులతో పరిచయాలు పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో బద్వేలు ప్రాంతంలోని మరికొంత మంది ఎర్రచందనం రవాణాదారులతో జయరాముడుకు సంబంధాలు ఏర్పడ్డాయి. దాంతో ఓ ట్రక్కులో 24 దుంగలను, వాటిపైన ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు మామిడికాయల బస్తాలను వేసుకొని విజయవాడ వెళుతున్నాడు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో మండలంలోని బొల్లాపల్లి టోల్‌ ప్లాజా సమీపంలో ఆంజనేయ బ్రిక్స్‌ వద్ద ఎస్పీ మలికా గర్గ్‌ ఆదేశాల మేరకు సీఐ సుబ్బారావు, ఎస్‌ఐ చౌడయ్యలు సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తుండగా ట్రక్కులోని ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. అనంతరం అతనిని అరెస్టు చేసి వాహనాన్ని, 8 వేలు రూపాయల విలువైన సెల్‌ ఫోన్‌ను స్వాఽధీనం చేసుకొన్నారు. దుంగలను స్టేషన్‌కు తరలించారని ఆయన తెలిపారు.  ఇంకా ఈ కేసులో మరి కొంతమంది వ్యక్తుల ప్రమేయం ఉందని, వారి కోసం ప్రత్యేక బృందాలు ఇతర ప్రాంతాలకు వెళ్లాయని సీఐ తెలిపారు. 


Updated Date - 2021-07-27T06:28:57+05:30 IST