చక్కెర తగ్గించి, ఇథనాల్ ఉత్పత్తి పెంచాలి!

ABN , First Publish Date - 2022-04-07T06:59:27+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో చక్కెర పరిశ్రమ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటూంది. దశాబ్దాల క్రితం స్థాపించబడిన పెద్ద చక్కెర ఫ్యాక్టరీలు కూడా కొన్ని మూతబడ్డాయి. మొత్తం 30 ఫ్యాక్టరీలకుగానూ పది ఫ్యాక్టరీలే నడుస్తున్నాయి...

చక్కెర తగ్గించి, ఇథనాల్ ఉత్పత్తి పెంచాలి!

ఆంధ్రప్రదేశ్‌లో చక్కెర పరిశ్రమ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటూంది. దశాబ్దాల క్రితం స్థాపించబడిన పెద్ద చక్కెర ఫ్యాక్టరీలు కూడా కొన్ని మూతబడ్డాయి. మొత్తం 30 ఫ్యాక్టరీలకుగానూ పది ఫ్యాక్టరీలే నడుస్తున్నాయి. తాండవ, ఏటికొప్పాక, బొబ్బిలి మున్నగు సహకార చక్కెర ఫ్యాక్టరీలతోపాటు చల్లపల్లి, కొవ్వూరు, మయూర మున్నగు ప్రైవేట్‌ ఫ్యాక్టరీలు మూతబడ్డాయి. గతంలో చక్కెర రంగంలో ప్రముఖ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ నేడు చాలా దిగువ స్థాయికి చేరుకుంది. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసినపుడు మన రాష్ట్రంలో చెఱకు సాగు ఖర్చు అత్యధికంగా ఉండటం దీనికి ఒక కారణమైతే,  రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం, చక్కెర ఫ్యాక్టరీ యాజమాన్యాల నిష్క్రియాపరత్వం మరికొన్ని కారణాలు. నిజానికి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం చక్కెర రంగం పట్ల కొంత సానుకూల వైఖరి కనబరుస్తోంది. చెరకు రసం నుంచి నేరుగా ఇథనాల్‌ ఉత్పత్తి చేయటానికి కేంద్రప్రభుత్వం, ఆర్థిక సహాయ సంస్థలు, బ్యాంకులు ప్రోత్సకాలను అందిస్తున్నాయి. వీటిని సక్రమంగా వినియోగించుకోగలిగితే మన రాష్ట్రంలో మూతపడిన చక్కెర ఫ్యాక్టరీలు తిరిగి పనిచేస్తాయి. రైతుల బకాయిలు చెల్లించడంతోపాటు చెఱకుసాగు గిట్టుబాటయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. 


మనదేశ ఆర్థిక రంగంలో చక్కెర పరిశ్రమకు ప్రముఖ పాత్ర ఉంది. 365రోజులు పుష్కలంగా సూర్యరశ్మి, సారవంతమైన భూమి, నీటి వనరుల లభ్యత, కష్టించి పనిచేసే రైతాంగం... ఇలా చెఱకు సాగుకు అత్యంత అనుకూలత ఉంది. ఈ రంగం 5 కోట్ల చెఱకు రైతు కుటుంబాలకు, 5 లక్షల మంది కార్మికులకు నేరుగా జీవనోపాధిని కలిగిస్తోంది. ఇంతేగాక చెఱకు రవాణా, పంచదార రిటైల్‌ అమ్మకాల వలన పరోక్షంగా కొన్ని లక్షలమందికి ప్రయోజనం చేకూరుతూంది. 732 చక్కెర ఫ్యాక్టరీలతో సాలుకు 339లక్షల టన్నుల పంచదారను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. పంచదార, ఆల్కహాల్‌, స్వీట్లు మున్నగు మొత్తం ఉత్పత్తుల విలువ దాదాపు రూ.80వేల కోట్లు ఉంటుందని అంచనా.


2017లో 4.2 శాతంగా ఉన్న పెట్రోలులో ఇథనాల్‌ కలిపే ప్రక్రియ 2022 నాటికి 10శాతానికి, 2025 నాటికి 20శాతానికి చేరాలని కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకొంది. చక్కెర జ్యూస్‌ నుంచి నేరుగా ఇథనాల్‌ తయారీకి ప్రాధాన్యతను ఇస్తుంది. ఆవిధంగా ఉత్పత్తి చేయటానికి అవసరమైన మెషినరీ స్థాపనకు ప్రోత్సాహకాలను, తక్కువ వడ్డీతో ఋణపరపతిని ఇచ్చేందుకు నిర్ణయాలు తీసుకొంది. ఈ పద్ధతిని అనుసరించడం వల్ల చక్కెర ధరల్లోను, మిగుల్లోను హెచ్చుతగ్గులు లేకుండా సాఫీగా చెఱకు సాగు, పంచదార–ఇథనాల్‌ ఉత్పత్తి బ్రెజిల్‌లో వలే జరిగిపోయే అవకాశం కలుగుతుంది.


ప్రస్తుతం మన రాష్ట్రంలో బొబ్బిలితో సహా పలు సహకార చక్కెర ఫ్యాక్టరీలు చెఱకు సరఫరా చేసిన రైతులకు బకాయిలు చెల్లించటం లేదు. వాస్తవంగా షుగర్‌ కేన్‌ కంట్రోల్‌ ఆర్డరు ప్రకారం ఫ్యాక్టరీకి రైతు సప్లయి చేసిన 15 రోజుల్లోగా పైకం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, సంవత్సరాలు గడిచిపోతున్నా రైతుల బకాయిలు కొనసాగుతూనే వున్నాయి. జనవరి 3, 2014న చెఱకు రైతుల బకాయిలు చెల్లించటానికి చక్కెర ఫ్యాక్టరీలకు వర్కింగ్‌ క్యాపిటల్‌కు అదనంగా కొంత ఆర్థిక సహాయాన్ని వడ్డీలేకుండా అందించాలని కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పథకం కింద కేంద్రం రూ.6,485 కోట్లను ఫ్యాక్టరీలకు అందించింది. ఈ మొత్తం పైన ఐదేళ్లకు అయ్యే వడ్డీని కేంద్రం షుగర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ నుంచి తనే భరిస్తుంది. ఈ పథకంతోపాటు, లోగడ చెఱకు బకాయిలను తీర్చడంతోపాటు, ప్రస్తుత సీజన్‌లో సాఫీగా చెఱకు ధరను రైతులకు అందించేందుకు తక్కువ వడ్డీతో ఋణాలను కూడా అందిస్తుంది. ఈ పథకం కింద ఖర్చు చేసిన దానికి ఒక సంవత్సరంపాటు వడ్డీని కేంద్రం భరిస్తుంది.


ఇప్పటివరకు చక్కెర ఫ్యాక్టరీలు పంచదారతోపాటు ఇథనాల్‌ను, ఆల్కహాల్‌ను తయారుచేస్తూ ఉన్నాయి. అందువల్లనే పంచదార ఉత్పత్తి, మిగులు–తరుగు మరియు చెఱకు ధరల్లో హెచ్చుతగ్గులు తరచుగా జరుగుతున్నాయి. అలాకాకుండా నేరుగా చెఱకు జ్యూస్‌ నుంచి ఇథనాల్‌ను తయారుచేసే ప్రక్రియ వేగవంతమైనపుడు ఈ సమస్య ఎదురవ్వదు. విదేశాల నుంచి పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులపైన పెట్టే ఖర్చు తగ్గుతుంది. ఫ్యాక్టరీలకు లాభం చేకూరుతూ, చెఱకు రైతులకు సకాలంలో చెల్లింపులు జరుగుతాయి.


మన దేశంలో సగటున వార్షికంగా 260 లక్షల టన్నుల పంచదార అవసరం ఉంది. దాదాపు 300లక్షల టన్నులపైన పంచదార ఉత్పత్తి అవుతున్నది. కావున బ్రెజిల్‌లో వలే పంచదార ఉత్పత్తిని తగ్గిస్తూ ఇథనాల్‌ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని, సహకార చక్కెర ఫ్యాక్టరీలు, ప్రైవేట్‌ షుగర్‌ ఫ్యాక్టరీల యాజమాన్యాలతో చర్చించాలి. ఋణ సదుపాయాన్ని ఉపయోగించుకొని చెఱకు రైతుల బకాయిలు చెల్లించాలి.  జ్యూస్‌ నుంచి నేరుగా ఇథనాల్‌ ఉత్పత్తి చేసే ప్రక్రియ చేపట్టి, ఫ్యాక్టరీలను లాభాల బాట పట్టించేందుకు ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఉత్తరప్రదేశ్‌లో చెఱకు జ్యూస్‌ నుంచి నేరుగా ఇథనాల్‌ తయారుచేసే ప్రక్రియను ఫ్యాక్టరీలు పెద్దయెత్తున చేపట్టాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని చక్కెర ఫ్యాక్టరీలు చాలావరకు పనిచేస్తూ రైతులకు మేలు చేకూరుస్తున్నాయి. మన రాష్ట్రంలో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉండటం దురదృష్టకరం. చెఱకు రైతులు, రైతు సంఘాలు ప్రభుత్వం పైన ఫ్యాక్టరీల యాజమాన్యాలపైన ఈ మేరకు ఒత్తిడి తీసుకురావాలి. 

వడ్డే శోభనాద్రీశ్వరరావు

Updated Date - 2022-04-07T06:59:27+05:30 IST