తగ్గనున్న విద్యుత్‌ భారం

ABN , First Publish Date - 2020-09-23T06:16:52+05:30 IST

పంచాయతీలకు గుదిబండగా మారిన విద్యుత్‌ బిల్లుల భారం తగ్గించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు

తగ్గనున్న విద్యుత్‌ భారం

అవసరం లేని చోట తాగునీటి విద్యుత్‌ మోటార్ల తొలగింపు

కలెక్టర్‌ ఆదేశంతో జిల్లాలో 1,326 పబ్లిక్‌ మోటార్ల గుర్తింపు

పంచాయతీలకు ప్రతి నెలా రూ.45 లక్షల ఆదా


(ఆంధ్రజ్యోతి, జగిత్యాల): పంచాయతీలకు గుదిబండగా మారిన విద్యుత్‌ బిల్లుల భారం తగ్గించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్‌ రవి ఆదేశాలతో పంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తాగునీటి బోర్ల మోట్లార్లను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిషన్‌ భగీరథ తాగునీరు అందుబాటులోకి రావడంతో బోరుబావులకు అమర్చిన విద్యుత్‌ మోటార్లు చాలా గ్రామాల్లో వృథాగా మారాయి. ఇప్పటి వరకు వాటి విద్యుత్‌ బిల్లులను పంచాయతీలు చెల్లిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు వాటి విద్యుత్‌ కనెక్షన్‌లు తీసివేయడమా, కాలనీవాసుల పేరుతో మార్చడమా అనేది అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. 

 

ఏడు మండలాల్లో గుర్తింపు

జిల్లాలోని ఏడు మండలాలు ఇబ్రహీంపట్నం, కథలాపూర్‌, కోరుట్ల, మల్లాపూర్‌, మేడిపల్లి, మెట్‌పల్లి, రాయికల్‌లో 1,370 చోట్ల బోరు వేసి గ్రామ పంచాయతీల నుంచి విద్యుత్‌ సౌకర్యం కల్పించినట్లు అధికారులు గుర్తించారు. ఆయా కాలనీలోని 20 నుంచి 30 గృహాలకు పైపులైన్‌ వేసి వీలున్న చోట చిన్న ట్యాంక్‌ కట్టి చాలాకాలంగా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఒక్కో విద్యుత్‌ మీటర్‌కు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు విద్యుత్‌ బిల్లు వస్తుండేది. జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షలు పంచాయతీలు ప్రతి నెలా విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తుండేవి. మిషన్‌ భగీరథ పథకంతో ప్రతి ఇంటికీ తాగునీటి పైపులైన్‌ వేశారు. గ్రామాల్లో కొత్త ట్యాంకులు నిర్మించారు. ఇబ్రహీంపట్నం మండలం డబ్బాలో పెద్ద ట్యాంక్‌ నిర్మించి అక్కడి నుంచి వాటర్‌ను బల్క్‌గా గ్రామాలకు తరలించి కొద్ది మాసాలుగా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో కూడా పైపులైన్‌ వేసి మిషన్‌ భగీరథ పథకం ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.


దీంతో విద్యుత్‌ బోరు బావులను పలుచోట్ల ప్రజలు ప్రైవేటు అవసరాలకు ఉపయోగిస్తున్నారు.  దీంతో పంచాయతీలు అనవసరంగా విద్యుత్‌ బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. దీంతో పాటు విద్యుత్‌ వృథాగా ఖర్చవుతోంది. దీన్ని గుర్తించిన కలెక్టర్‌ రవి జిల్లాలో ఎన్ని బోర్లు ఉన్నాయో గుర్తించాలని ఇన్‌ఛార్జి జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్‌తో పాటు ట్రాన్స్‌కో ఎస్‌ఈ సూర్యనారాయణలను ఆదేశించారు. వీరు గ్రామాలవారీగా జాబితా తయారు చేసి 1,326 చోట్ల బోరు బావులు ఉన్నాయని గుర్తించారు. వాటి ద్వారా పంచాయతీలపై ప్రతి నెలా రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు భారం పడుతోందని నివేదిక తయారు చేసి కలెక్టర్‌కు అప్పగించారు. అయితే వాటిని తొలగించాలని ముందుగా నిర్ణయించినప్పటికీ కాలనీవాసులు కావాలంటే విద్యుత్‌ మీటర్లు వారి పేరు మీద మార్చుకోవచ్చని సూచించారు. మిషన్‌ భగీరథ తాగునీటి సౌకర్యం కల్పిస్తున్న దృష్ట్యా బోరు బావుల బిల్లులను ఆ కాలనీవాసులే చెల్లించుకోవాల్సి ఉంటుంది.


పంచాయతీలకు విద్యుత్‌ భారం తగ్గుతుంది..గుగులోతు రవి, కలెక్టర్‌, జగిత్యాల

జిల్లాలో చాలా చోట్ల అవసరం లేకుండా ఉన్న బోరు బావుల ద్వారా నీరు, విద్యుత్‌ వృథా అవుతోంది. అన్ని గ్రామాలకు మిషన్‌ భగీరథ నీరు వస్తోంది. కాలనీల్లో వేసిన బోరు బావులను వేరే అవసరాలకు ఉపయోగిస్తున్నారు. వీటి ద్వారా జిల్లాలో పంచాయతీలపై ప్రతి నెల రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు విద్యుత్‌ భారం పడుతోంది. కాలనీవాసులు కావాలంటే వాటిని వారి పేరు మీదికి మార్చుతున్నాం. దీనిపై సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి.

Updated Date - 2020-09-23T06:16:52+05:30 IST