శ్రీరాంసాగర్‌కు తగ్గిన వరద

ABN , First Publish Date - 2021-07-26T06:46:38+05:30 IST

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు ప్రాజెక్టు మొత్తం గేట్లను మూసివేశారు. కేవలం విద్యుత్‌ ఉత్పత్తికి మాత్రమే నీటి విడుదల కొ నసాగిస్తున్నారు.

శ్రీరాంసాగర్‌కు తగ్గిన వరద
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు గేట్లను మూసివేసిన దృశ్యం

నిజామాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/మెండోరా/నిజాంసాగర్‌: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు ప్రాజెక్టు మొత్తం గేట్లను మూసివేశారు. కేవలం విద్యుత్‌ ఉత్పత్తికి మాత్రమే నీటి విడుదల కొ నసాగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే విధంగా చూస్తున్నారు. గడిచిన రెండు రోజులుగా మహారాష్ట్రతో పాటు జిల్లాలో వర్షాలు కురవడం లేదు. అలాగే, ఎగువన గల విష్ణుపురి, బాలేగాం ప్రాజెక్టుల గేట్లను కూడా మూసివేయడంతో గోదావరికి వరద తగ్గింది. వర్షాలు లేకపోవడం వల్ల గోదావరితో పాటు మంజీరా, హరిద్ర నదుల నుంచి కూడా వరద రావడంలేదు. ఎగువ ప్రాంతం నుంచి ప్రస్తుతం ప్రాజెక్టులోకి 29,795 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా.. 1,089.90 అడుగులకు చేరింది. 90టీఎంసీలకుగాను 84.29టీఎంసీలకు చేరింది. ఎస్కేప్‌ గేట్ల ద్వారా 8వేల క్యూసెక్కుల నీటిని విద్యుత్‌ ఉత్పత్తి కోసం విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి జూన్‌ నుంచి ఇప్పటి వరకు 111 టీఎంసీల నీళ్లు రాగా.. 47 టీఎంసీల నీళ్లు దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు వరద తగ్గడంతో గేట్లను మూసివేశామని ఎస్‌ఈ శ్రీనివాస్‌ తెలిపారు. వరద పెరిగితే మళ్లీ గేట్లను ఎత్తుతామని ఆయన తెలిపారు.

Updated Date - 2021-07-26T06:46:38+05:30 IST