ఆర్టీసీ లాభాలకు ‘లాక్‌’

ABN , First Publish Date - 2021-05-18T04:43:46+05:30 IST

మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఉంది ప్రజా రవాణా వ్యవస్థ (ఆర్టీసీ) పరిస్థితి. నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వ పరిధిలోకి తెచ్చిన తరువాత అంతా ఆనందించారు. కానీ గత ఏడాది కరోనా నుంచి ఇప్పటి వరకూ నష్టాల బాట కొనసాగుతుండడంతో ఆర్టీసీ కుదేలయ్యింది. ప్రస్తుతం మధ్యాహ్నం 12 నుంచి ఉదయం ఆరు గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఆర్టీసీ అరకొర సర్వీసులు నడుస్తున్నా, నష్టాలు తప్పడం లేదు. కరోనా భయంతో ప్రయాణికులు బస్సులు ఎక్కడం లేదు. కనీస స్థాయిలో ప్రయాణికులు లేక డీజిల్‌ ఖర్చులు కూడా రావడం లేదు.

ఆర్టీసీ లాభాలకు ‘లాక్‌’

- కర్ఫ్యూతో తగ్గిన సర్వీసులు

- రాకపోకలకు ఆసక్తి చూపని ప్రయాణికులు

- ఆదాయం తగ్గుముఖం

- డీజిల్‌ ఖర్చు కూడా రాని వైనం

 (గుజరాతీపేట)

మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఉంది ప్రజా రవాణా వ్యవస్థ (ఆర్టీసీ) పరిస్థితి. నష్టాల బాటలో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వ పరిధిలోకి తెచ్చిన తరువాత అంతా ఆనందించారు. కానీ గత ఏడాది కరోనా నుంచి ఇప్పటి వరకూ నష్టాల బాట కొనసాగుతుండడంతో ఆర్టీసీ కుదేలయ్యింది. ప్రస్తుతం మధ్యాహ్నం 12 నుంచి ఉదయం ఆరు గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఆర్టీసీ అరకొర సర్వీసులు నడుస్తున్నా, నష్టాలు తప్పడం లేదు. కరోనా భయంతో ప్రయాణికులు బస్సులు ఎక్కడం లేదు. కనీస స్థాయిలో ప్రయాణికులు లేక డీజిల్‌ ఖర్చులు కూడా రావడం లేదు. జిల్లాలో శ్రీకాకుళం1, 2, పలాస, టెక్కలి, పాలకొండ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 450 బస్సులు ఉన్నాయి. అంతర్‌ రాష్ట్ర, జిల్లాతో పాటు స్థానికంగా రోజుకు 1,56,000 కిలోమీటర్లు ప్రయాణించేవి. కానీ గత ఏడాది లాక్‌డౌన్‌తో నెలల తరబడి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇప్పుడు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ 8 శాతం బస్సులనే నడుపుతున్నారు. దీంతో ఆదాయం తగ్గుముఖం పట్టింది. నిర్వహణ వ్యయం గణనీయంగా పెరిగింది. కనీసం నిర్వహణ ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి సాధారణ రోజుల్లో రోజుకు ఐదు డిపోలకు రూ.35లక్షల ఆదాయం సమకూరినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన గత పది రోజులుగా రూ.3.5 కోట్లు నష్టం వాటిల్లినట్టే. పది శాతం సిబ్బంది కరోనా బారిన పడ్డారు. వారంతా క్వారంటైన్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందికి వారంలో రెండు రోజులే డ్యూటీలు వేస్తున్నారు. గత ఏడాది కరోనా సమయంలో ఆర్టీసీ కార్గో సర్వీసులను ప్రారంభించినా ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. దీంతో అరకొరే సర్వీసులే నడుస్తున్నాయి. ప్రయాణికులు లేకపోవడం, నిర్వహణ వ్యయం పెరుగుతుండడంతో ఆర్టీసీకి కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయి. 


ఆదాయం తగ్గింది

ప్రస్తుతం ప్రయాణికులు బస్సులు ఎక్కడం లేదు. వితప్కర వేళ సేవా భావంతోనే ఆర్టీసీ సర్వీసులు నడుపుతున్నాం. కర్ఫ్యూతో సర్వీసుల సంఖ్య తగ్గడం, ప్రయాణికులు ఆసక్తి చూపకపోవడంతో ఐదు డిపోల ద్వారా రోజుకు సగటున రూ.35లక్షల ఆదాయం కోల్పోతున్నాం. అక్యూపెన్సీ రేటు తగ్గింది. నష్టాలు చవిచూస్తున్నాం. 

- జి.వరలక్ష్మి, డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌, శ్రీకాకుళం

Updated Date - 2021-05-18T04:43:46+05:30 IST