ఖాళీ ఖజానా.. పథకాల బజానా

ABN , First Publish Date - 2021-07-26T07:45:31+05:30 IST

ఓవైపు రాష్ట్ర ఖజానా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రాబడులు తగ్గిపోయి వట్టిపోతోంది. అత్తెసరు నిధులతోనే ఉద్యోగుల వేతనాలు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను నెట్టుకురావాల్సి వస్తోంది.

ఖాళీ ఖజానా..  పథకాల బజానా

రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గిన రాబడి

అయినా కొత్త హామీలు, కొంగొత్త పథకాలు

‘దళిత బంధు’కే 3 వేల కోట్లకు పైగా అవసరం

కాంట్రాక్టర్ల బిల్లులు రూ.13 వేల కోట్లు పెండింగ్‌

రూ.లక్ష లోపు పంట రుణాల మాఫీకి నిధుల లేమి

కొత్త కార్డులు, పెన్షన్లకూ కటకట.. ఇప్పటికే 21 వేల కోట్ల అప్పు చేసిన సర్కారు


హైదరాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): ఓవైపు రాష్ట్ర ఖజానా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రాబడులు తగ్గిపోయి వట్టిపోతోంది. అత్తెసరు నిధులతోనే ఉద్యోగుల వేతనాలు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను నెట్టుకురావాల్సి వస్తోంది. మరోవైపు సీఎం కేసీఆర్‌ హామీల మీద హామీలు గుప్పిస్తున్నారు. ఇదివరకు ప్రకటించిన హామీలకే అతీగతీ లేకుండా పోగా,  ఇప్పుడు కొత్త హామీలు ముందుకొచ్చాయి. పాత హామీలను పక్కన పెడితే... కొత్త హామీలకు నిధులెక్కడి నుంచి తెస్తారు? ప్రస్తుతం నెలవారీగా సమకూరుతున్న రాబడులు సరిపోతాయా? లేదంటే అప్పుల మీద అప్పులు చేయాల్సిందేనా? ఇలా అప్పుల కుప్ప పెరిగితే రాష్ట్ర భవిష్యత్తు ఎటు దారితీస్తుంది? సర్కారు వద్ద ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలేంటి? అన్న అంశాలపై ఇప్పుడు ఆర్థిక నిపుణులు, పరిశీలకుల్లో విస్తృత చర్చ జరుగుతోంది.


ముఖ్యంగా సీఎం కేసీఆర్‌ఇటీవల ప్రకటించిన ‘దళిత బంధు’ పథకంతో నిధుల అంశం ప్రస్తావనకు వస్తోంది. పైగా.. హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచే ఈ స్కీమ్‌ను ప్రారంభిస్తామని, ఇక్కడి దళితులకు సంతృప్త స్థాయిలో స్కీమ్‌ను వర్తింపజేస్తామని ప్రకటించారు. మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని దళితుల సంగతేంటి? వారు మాత్రం పేదరికంలో మగ్గడం లేదా? ప్రభుత్వ ఫలాలు వారికి అందాల్సిన అవసరం లేదా? అన్న చర్చ జరుగుతోంది. ఇదే కాదు.. ఈ నెల 26 నుంచి ఇస్తామంటున్న రేషన్‌ కార్డులు, వృద్ధాప్య పింఛన్ల అర్హుల వయసును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామంటూ వెలువడిన ప్రకటనలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి వాటన్నింటికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 


‘దళిత బంధు’కు 3 వేల కోట్లు అవసరం

రాష్ట్రంలోని దళితుల సాధికారత కోసం సీఎం కేసీఆర్‌ ఇటీవల ‘దళిత బంధు’ స్కీమ్‌ను ప్రకటించారు. దీనికి బడ్జెట్‌లో రూ.1000 కోట్లను ప్రతిపాదించారు. కానీ, ఒక్కో నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామని, ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున విడుదల చేస్తామని తొలుత ప్రకటించారు. ఈ లెక్కన 119 నియోజకవర్గాలకు మొత్తం రూ.1190 కోట్లు అవసరం కానున్నాయి. ఆ తరువాత ఈ పథకాన్ని హుజూరాబాద్‌ నుంచి ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. రూ.2 వేల కోట్లతో ఆ నియోజకవర్గంలో సంతృప్త స్థాయిలో అమలు చేస్తామన్నారు. దీంతో ‘దళిత బంధు’కు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3 వేల కోట్లకు పైగా అవసరం కానున్నాయి.


అవసరమైతే ఈ పథకానికి రూ.లక్ష కోట్లయినా ఖర్చు చేస్తామని సీఎం ప్రకటించారు. మరోవైపు రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు రూ.13 వేల కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్క సాగునీటి పారుదల శాఖలోనే రూ.10 వేల కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రోడ్లు-భవనాల శాఖలో రూ.800 కోట్లు, పంచాయతీరాజ్‌ శాఖలో రూ.200 కోట్లు.. ఇలా అన్నిశాఖల్లో బిల్లులు పేరుకుపోయాయి. అన్ని శాఖలకు కలిపి నెలకు రూ.500 కోట్లకు మించి బిల్లులను క్లియర్‌ చేయడం లేదు. ఆరు నెలలుగా తనకు రూ.13 కోట్ల బిల్లు రావడం లేదని ఓ కాంట్రాక్టరు వాపోయారు.  


కొత్త రేషన్‌ కార్డులు, వృద్ధాప్య పెన్షన్లకూ..

ఈ నెల 26 నుంచి కొత్త రేషన్‌ కార్డులను జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వీటి కోసం ఇప్పటికే 4,15,901 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి కార్డులు జారీ అయితే రేషన్‌ పంపిణీ కోసం నెలకు మరో రూ.20 కోట్లకు పైగా అదనపు భారం పడుతుంది. రాష్ట్రంలోని పాఠశాలలను ఆధునికీకరించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఇందుకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 39,36,521 మందికి ఆసరా పెన్షన్లను అందిస్తున్నారు. వయసు తగ్గింపుతో మరో 7 లక్షల మంది వృద్ధాప్య పెన్షన్లకు అర్హులవుతారని అంచనా వేస్తోంది. వీరికి అదనంగా నెలకు రూ.140 కోట్ల చొప్పున ఏడాదికి రూ.1680 కోట్లు కావాల్సి వస్తుందని అధికారులు విశ్లేషిస్తున్నారు. 


ఊసు లేని లక్షలోపు రుణ మాఫీ

రైతుల రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తామంటూ 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చింది. కానీ, రూ.25 వేల లోపు రుణాలను మాత్రమే మాఫీ చేసింది. రూ.లక్ష లోపు రుణాల మాఫీకి బడ్జెట్‌లో రూ.5,225 కోట్లను కేటాయించింది. నిధుల లభ్యత లేక మాఫీ చేయడంలేదు. బ్యాంకులు మాత్రం రైతుబంధు సొమ్మును పంట రుణాల కింద మినహాయించుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి. జిల్లా, మండల పరిషత్తులకు కలిపి బడ్జెట్‌లో రూ.500 కోట్లను కొత్తగా ప్రకటించింది. ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధులను రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచింది. దీని కింద రూ.800 కోట్లను ప్రతిపాదించింది. మరోవైపు ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సామానికి రైతులకు ఎకరాకు రూ.30 వేల చొప్పున 8.14 లక్షల ఎకరాలకు సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకూ ఇన్సెంటివ్‌లు, గొర్రెల పంపిణీ యూనిట్‌ విలువను రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచింది. వీటన్నింటికీ నిధులు సర్దాల్సి ఉంది. ఇక నిరుద్యోగులకు రూ.3016 చొప్పున ప్రతి నెలా భృతి చెల్లిస్తామని రెండేళ్ల నుంచి బడ్జెట్‌లో ప్రస్తావిస్తున్నారే తప్ప... అమలు చేయడం లేదు. మరోవైపు ఉద్యోగులకు ప్రభుత్వం 30 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది. దీంతో ఖజానాపై నెలకు రూ.1000 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. దీనిని కలుపుకొని జూలై నుంచి ఈ పద్దు కింద రూ.3000-3500 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు.


భారీగా తగ్గిన రాబడి..

2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.2,30,825.96 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించింది. ఇందులో పన్ను రాబడుల ద్వారా రూ.1,06,900 కోట్లను అంచనా వేసింది. అంటే నెలకు రూ.9000 కోట్ల వరకు పన్ను రాబడి సమకూరాలి. కానీ, రాబడులపై కరోనా లాక్‌డౌన్‌ తీవ్ర ప్రభావం చూపింది. సెకండ్‌ వేవ్‌ కారణంగా వ్యాపారాలు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు మందగమనం పట్టాయి. ఇతర పన్నుల నుంచీ ఆశించిన రాబడి సమకూరలేదు. ఇలా మొత్తం పన్నుల రాబడి ద్వారా ఏప్రిల్‌లో రూ.7,618 కోట్లు మాత్రమే సమకూరాయి. మరో రూ.174 కోట్ల పన్నేతర రాబడి, రూ.258 కోట్ల గ్రాంట్స్‌-ఇన్‌-ఎయిడ్‌, కంట్రిబ్యూషన్లు, రూ.1929 కోట్ల అప్పులు కలుపుకొంటే... ఏప్రిల్‌లో మొత్తం రాబడి రూ.9,980 కోట్ల మేర సమకూరింది. ఇక మే నెలలో పన్ను రాబడి రూ.5579.97 కోట్లు, మొత్తం రూ.13045.24 కోట్లు సమకూరాయి.


మే 12 నుంచి జూన్‌ 19 వరకు 40 రోజుల పాటు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగింది. అయినా జూన్‌లోనూ రూ.15 వేల కోట్ల వరకు అన్ని రకాల రాబడులుంటాయని అంటున్నారు. అయితే జూన్‌లో ప్రభుత్వం రూ.9,500 కోట్ల వరకు అప్పు తీసుకుంది. ఈ అప్పులు కలిపి జూన్‌లో రూ.22,545.24 కోట్లు సమకూరినట్లయింది. నిజానికి ఎలాంటి అప్పులు లేకుండా బడ్జెట్‌ లెక్కల ప్రకారం పద్దుల కింద నెలకు సగటున రూ.18,483 కోట్ల రాబడి సమకూరాలి. కానీ... ఏప్రిల్‌ నుంచి ఇలాంటి పరిస్థితి లేదు. దీంతో జూలై నెలపై ప్రభుత్వం ఆశ పెట్టుకుంది.


కరోనా లాక్‌డౌన్‌తో రాబడులు తగ్గి, వ్యయాలు పెరుగుతుండడంతో ప్రభుత్వం అప్పుల బాట పట్టింది. ఈ నిధులతోనే పథకాలు, వేతనాలకు సర్దుబాట్లు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే అప్పుల భారం అమాంతం పెరిగిపోయింది. ఏప్రిల్‌లో రూ.1,925.80 కోట్లు, మే నెలలో రూ.6,684.85 కోట్లు అప్పు తీసుకోగా... జూన్‌లో ఏకంగా రూ.9,500 కోట్లు తీసుకుంది. దీంతో ఈ మూడు నెలల్లోనే అప్పుల భారం రూ.18,110.65 కోట్లకు చేరింది. కాగా, ఈ నెల రెండో వారంలో రూ.2000 కోట్లు, 19న మరో రూ.1000 కోట్లను అప్పుగా తీసుకుంది. దీంతో అప్పుల భారం రూ.రూ.21,110.65 కోట్లకు చేరింది. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.45,509.59 కోట్ల అప్పు తీసుకోవాలని నిర్ణయించింది.

Updated Date - 2021-07-26T07:45:31+05:30 IST