సక్రమమేనా!

ABN , First Publish Date - 2020-11-19T06:27:08+05:30 IST

పన్నుల వసూళ్లలో అక్రమాలను నిలువరించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ (జీఎస్‌టీ) విధానాన్ని కొందరు వ్యాపారులు నీరుగారుస్తున్నారు.

సక్రమమేనా!
ఇటీవల రైల్వేస్టేషన్లో పట్టుబడిన రెడీమేడ్‌ వస్ర్తాల బేళ్లు

సీజ్‌ చేసిన రెడీమేడ్‌ వస్త్రాలు విడతలవారీగా విడుదల

రూ.50 లక్షల ప్రభుత్వ ఆదాయానికి వాణిజ్యశాఖ గండి

అన్నీ సక్రమంగా ఉన్నాయంటూ ఇప్పటికే 60 బేళ్లు వదిలేశారు

మిగిలిన వాటినీ వదిలేసేందుకు సిద్ధమవుతున్న వైనం

వ్యాపారులు రాకపోవడం వ్యూహంలో భాగమేనా!


పన్నుల వసూళ్లలో అక్రమాలను నిలువరించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ (జీఎస్‌టీ) విధానాన్ని కొందరు వ్యాపారులు నీరుగారుస్తున్నారు. ప్రభుత్వానికి భారీగా పన్ను ఎగ్గొట్టి అక్రమ మార్గంలో సరుకులను విజయవాడకు తీసుకొస్తున్నారు. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన వాణిజ్యపన్నుల శాఖ అధికారుల్లో కొందరు వ్యాపారులకు తెరవెనుక సహకారం అందిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. దానికి నిలువెత్తు ఉదాహరణే కొద్ది రోజుల క్రితం విజయవాడ రైల్వేస్టేషన్‌లో పెద్ద ఎత్తున పట్టుబడిన రెడీమేడ్‌ వస్త్రాలు.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) 

విజయవాడ రైల్వేస్టేషన్‌లో సుమారు రూ.3 కోట్ల విలువైన 600 బేళ్ల రెడీమేడ్‌ వస్త్రాలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు బిల్లులు లేవంటూ ఇటీవల సీజ్‌ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ వాటిలో 60 బేళ్లను అంతా బాగుందంటూ వదిలేశారు. వ్యాపారులతో కుదిరిన లోపాయికారి ఒప్పందం వల్లే ఈ విధంగా జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. బిల్లులు లేవంటూ పట్టుకున్న మొత్తం సరుకును ఒకే విడత విడుదల చేస్తే అనుమానాలు వస్తాయన్న ఉద్దేశంతో విడతలవారీగా అంతా బాగుందంటూ వదిలేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ‘ఆంధ్రజ్యోతి’ ఈనెల 14వ తేదీన ‘దొరికిందెంత? దాచిందెంత?’ శీర్షికతో కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. 


విజయవాడ నగరం వస్త్ర వ్యాపారానికి పెట్టింది పేరు. నిత్యం కొన్ని కోట్ల రూపాయల సరుకు నగరానికి తరలి వస్తుంటుంది. ఎక్కువగా రెడీమేడ్‌ వస్ర్తాలు కోల్‌కతా నుంచి వస్తుంటాయి. వారం క్రితం కోల్‌కతా నుంచి మూడు రైల్వే బోగీల్లో పెద్ద ఎత్తున రెడీమేడ్‌ వస్త్రాలు  విజయవాడ వచ్చాయి. హౌరా రైల్వేస్టేషన్‌ నుంచి రెడీమేడ్‌ వస్త్రాలను వ్యాపారులు అక్రమంగా తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు విజయవాడ రైల్వేస్టేషన్‌లో నిఘా ఉంచి వాటిని పట్టుకున్నారు. ఆ సరుకును పట్టుకున్న అధికారులు వారం తిరక్కముందే అందులో కొంత భాగం సరుకును సక్రమమేనంటూ వదిలేయడం అనుమానాలకు తావిస్తోంది. 


లక్షలాది రూపాయల డీల్‌..!

కోల్‌కతా నుంచి వచ్చిన ఒక్కొక్క బేలులో రూ.50 వేల విలువైన రెడీమేడ్‌ వస్త్రాలు ఉన్నాయి. ఇటువంటి మొత్తం వెయ్యి బేళ్లను విజయవాడ తరలించారు. అంటే నకిలీ బిల్లులతో విజయవాడ చేరుకున్న సరుకు విలువ సుమారు రూ.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. రెడీమేడ్‌ దుస్తులపై 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన రూ.5 కోట్ల విలువైన సరకుకు రూ.50 లక్షల వరకు పన్నుతోపాటు పెనాల్టీ కూడా కలిపి దాదాపు రూ.కోటి వరకు ప్రభుత్వానికి ఆదాయం సమకూరాల్సి ఉంది. కానీ వ్యాపారుల ప్రలోభాలకు గురైన కొందరు అధికారులు పట్టుకున్న రెడీమేడ్‌ వస్త్రాల్లో 400 బేళ్లను రైల్వేస్టేషన్‌లోనే అన్నీ బాగున్నాయంటూ వదిలేసినట్లు సమాచారం. కేవలం 600 బేళ్లను మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు చూపిస్తున్నారు. ఇందులో 60 బేళ్లకు పత్రాలు సక్రమంగా ఉన్నాయంటూ సంబంధిత వ్యాపారులకు అప్పగించేశారు. ఇక మిగిలిన 540 బేళ్లను కూడా సక్రమమైనవంటూ ఎలాంటి పన్ను, జరిమానా లేకుండా విడతలవారీగా విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇదే జరిగితే ప్రభుత్వ ఆదాయానికి రూ.50 లక్షలకుపైగా గండిపడే అవకాశం ఉంది. 


వ్యాపారుల జాడేదీ..!

రైల్వేస్టేషన్‌లో సరకును సీజ్‌ చేసి మూడు రోజులు గడిచిపోయినా వాటిని అక్రమంగా తరలించిన వ్యాపారులు రాకపోవడం కూడా పక్కా వ్యూహంలో భాగమేనన్న ప్రచారం జరుగుతోంది. వారు సరుకు తమదేనంటూ వస్తే బిల్లులు చూపించాల్సి ఉంటుంది. అందుకే వీలైనంత సమయం తీసుకుని నకిలీ బిల్లులతో బయటపడేందుకు వ్యాపారులు ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరోపక్క అక్రమ రవాణా వ్యవహారం బహిర్గతమైనందున ప్రభుత్వానికి నామమాత్రంగా పన్ను చెల్లించి కేసును మూసేందుకు జీఎస్టీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి అక్రమంగా విజయవాడ చేరుకున్నవి వెయ్యి బేళ్లు కాగా, వాటిలో 600 మాత్రమే అధికారులు చూపిస్తున్నారు. వాటిలోనూ 60 బేళ్ల వస్త్రాలకు అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నట్టు ధ్రువీకరించి రెండో రోజే వ్యాపారులకు అప్పగించేసినట్లు సమాచారం. ప్రస్తుతం అధికారుల స్వాధీనంలో ఉన్న సరకుకు సంబంధించిన బిల్లులు, పత్రాలు సక్రమంగా ఉంటే పరిశీలించి వ్యాపారులకు ఆ సరుకునూ అప్పగిస్తామని అధికారులు చెబుతుండటం గమనార్హం. అంటే ఆ సరుకునూ సక్రమంగా చూపి విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోందన్నమాట. 

Updated Date - 2020-11-19T06:27:08+05:30 IST