సంస్కరణా, విప్లవమా?

ABN , First Publish Date - 2021-02-28T05:59:23+05:30 IST

ఈవ్యాసానికి శీర్షికగా వున్న పేరు నేను పెట్టింది కాదు. రోజా లగ్జెంబర్గ్ అనే జర్మనీ దేశపు కమ్యూనిస్టు యువతి, అదే పార్టీలో పెద్ద నాయకుడిగా చలామణీ అవుతున్న...

సంస్కరణా, విప్లవమా?

ఈవ్యాసానికి శీర్షికగా వున్న పేరు నేను పెట్టింది కాదు. రోజా లగ్జెంబర్గ్ అనే జర్మనీ దేశపు కమ్యూనిస్టు యువతి, అదే పార్టీలో పెద్ద నాయకుడిగా చలామణీ అవుతున్న ఎడ్వర్డ్ బెర్నస్టీన్ రాసిన అస్తవ్యస్త సంస్కరణల రాతల్ని విమర్శిస్తూ తన పుస్తకానికి పెట్టిన పేరు అది. 


ఈ ‘రోజా’కి, వాళ్ళ మాతృభాష అయిన పోలిష్ భాషలో పేరు, ‘రోసా’. రోసా అంటే పోలిష్ భాషలో అర్ధం ‘మంచు బిందువు’ అట. రోసాని, అదే పేరుతో, ఆమె పుస్తకంలో వున్నట్టే రాస్తున్నాను. (ఈ పుస్తకం, పీకాక్ గాంధీ గారి వల్ల తెలుగు అనువాదంగా రావడం చాలా మంచిదైంది.) 


సంస్కరణ అనేది, తప్పుడు పరిస్తితిల్ని మూలం నించీ మార్చడం కాక, వాటిని అలాగే వుంచి, చిన్న చిన్న మార్పులూ, పై పై మెరుగులూ దిద్దడం. ‘విప్లవం’ అనేది అయితే, ఎటువంటి శతృ వైరుధ్యాలూ లేని విధంగా పరిస్తితిని సమూలంగా మార్చడం. బెర్నస్టీన్, పెట్టుబడిదారీ విధానాన్ని విప్లవం ద్వారా కాక సంస్కరణల ద్వారా సోషలిజంలోకి మార్చాలని ఒక సిద్ధాంతాన్ని తయారు చేశాడు. దానికే తర్వాత కాలంలో ‘రివిజనిజం’ అనే పేరువచ్చింది. (‘రివైజ్’ చెయ్యడం అంటే, సవరించడం; సమూలంగా మార్చడం కాదు.)


జర్మనీలో, ‘సోషల్ డెమోక్రసీ’ పేరుతోనే కమ్యూనిస్టు పార్టీ వుండేది. ఆ పార్టీలో ముఖ్యుడిగా వుండిన బెర్నస్టీన్, మార్క్సు సిద్ధాంతానికి వ్యతిరేకి! ఎంత వ్యతిరేకి అంటే, మార్క్సు కనిపెట్టిన ‘అదనపు విలువ’ అనే విషయం సరైనది కాదనీ, అంటే ‘శ్రమ దోపిడీ’ అనేది కేవలం మార్క్స్ ‘ఊహ’ మాత్రమే అనీ, బెర్నస్టీన్ వాదం.


బెర్నస్టీన్ కూడా, సోషలిజం రావాలనే అంటాడు. కానీ, దాని కోసం మార్క్సు చెప్పింది వినక్కర్లేదనీ, అలా నడవక్కర్లేదనీ, సోషలిజాన్ని పెట్టుబడిదారీ విధానమే తెచ్చేస్తుందనీ అంటాడు. ఈ రకంగా, సోషలిజం మీద బెర్నస్టీన్ రాతలన్నీ వంకర టింకర్లే, టింకర వంకర్లే.


రోసాకి, బెర్నస్టీన్ మీదా, ఆ రకం వాళ్ళమీదా ఎంత ఆగ్రహమో! బెర్నస్టీన్ మీద రాసిన 10 వ్యాసాల పుస్తకానికి పెట్టిన పేరే, ఈ ‘సంస్కరణా, విప్లవమా?’ పేరు. అంటే, దోపిడీ విధానం నించి శ్రామికవర్గం బైటపడడం, బెర్నస్టీన్ చెప్పే సంస్కరణల ద్వారా సాధ్యమా, అతనికి నచ్చని విప్లవం ద్వారా సాధ్యమా?’ – అనే అర్ధంతో, రోసా పెట్టిన పేరు అది. 


బెర్నస్టీన్ మీద రోసా రాజకీయమైన ఆగ్రహాన్ని తీవ్రంగా చూపిస్తూ, అద్భుతమైన విమర్శలు చేసింది. రోసా, మార్క్సిజం గురించి తగినంత అవగాహనతో వుంది. పార్టీ పేరు ఎలా వున్నా, ఆ పార్టీలో సభ్యులందరూ ఒకే అవగాహనతో వుండరనీ, అవకాశవాదుల బృందాలు వుంటాయనీ, చాలా ఉదాహరణలతో చెప్పింది. 


ఒకే పార్టీలో వున్నా రోసా, రోసాయే; బెర్నస్టీన్ బెర్నస్టీనే! ఇతను సోషలిజాన్ని కూడా ఒక బూర్జువా సిద్ధాంతం గానే అర్ధం చేసుకున్నాడు. సోషలిజాన్ని, శ్రామికవర్గ సిద్ధాంతం అనుకోడు. అసలు ఈ మేధావిని ఆ ‘సోషలిస్టు పార్టీ’ ఎలా భరించిందో! ఆ పార్టీ కూడా బెర్నస్టీన్ వంటిదేనా? కానీ, ఆ పార్టీలోనే ‘రోసా’లు కూడా వున్నారు కదా? బెర్నస్టీన్ లాంటి అవకాశవాదులూ, రోసా వంటి మార్క్సిస్టు మేధావులూ, ప్రతీ దేశపు పార్టీ లోనూ వుంటారన్న మాట! 


రోసా అయితే, మార్క్సు పుస్తకాల్ని చదివి, అర్ధం చేసుకుని గట్టి కమ్యూనిస్టుగా పాతికేళ్ళ వయసు నాటికే అయింది. అందుకే ఆమె బెర్నస్టీన్ వంటి వాళ్ళు రాసిన తప్పుడు రాతల్ని భరించలేక, గట్టి విమర్శలు చేయగలిగింది. 


‘అదనపు విలువ’ నీ, ‘శ్రమ దోపిడీ’ నీ, మార్క్సు ఎలా గ్రహించగలిగాడో, మనకి తెలిసి వుంటేనే, బెర్నస్టీన్ మీద రోసా చూపిన రాజకీయాగ్రహాన్ని అర్ధం చేసుకోగలం.


మానవ సమాజం, బానిసల కాలం నించీ, శ్రమలు చేసే వర్గం గానూ, శ్రమలు చెయ్యకుండానే ఇతరుల శ్రమల్ని దోస్తూ భోగాలతో జీవించే వర్గం గానూ, వందల వేల కాలాలుగా నడుస్తూ వుందనే కొత్త నిజాన్ని మార్క్సు మాత్రమే గ్రహించి చెప్పగలిగాడు. సమాజంలో మానవుల మధ్య సాగుతోన్న వర్గభేదాల్ని, శామికవర్గం గ్రహిస్తేనే, ‘వర్గాల’ సమాజం, ‘వర్గ రహిత’ సమాజంగా మారగలుగుతుందని మార్క్సు  అనేక విషయాలు చెపుతాడు.


రోసా రాసిన కొన్ని విషయాలు మాత్రమే, ఈ చిన్న వ్యాసంలో చూడగలం.

సోషలిజాన్ని సాధించడానికి అవసరమైన ఆర్ధిక పునాది, పెట్టుబడిదారీ సమాజంలోనే వుంది. – రోసా. 

మార్క్సు రాసిన అదనపు విలువ నియమం, కేవలం ఒక ‘ఊహ’ మాత్రమే- అని ప్రకటించాడు బెర్నస్టీన్. 

రోసా జవాబు: ‘మార్క్సు ఊహ, లేని దాన్ని సృష్టించడం కాదు; ఉన్న దాన్ని కనుగొనడమే’. [రోసా పుస్తకంలో, చాలా మంచి భావాలు దొరుకుతాయి గానీ, అనువాదంలో, ‘ద్వైధీ భావం’, ‘సద్యః స్ఫూర్తి’, ‘నిరపేక్ష గణాంకాలు’ వంటి ఇంకా కొన్ని మాటలు పాఠకుల్ని కొంచెం ఇబ్బంది పెడతాయి. రోసా వాక్యాలు కూడా కొన్ని చోట్ల అలాగే చేస్తాయి. అయినా, మంచి భావాల కోసం, చిన్న చిన్న ఇబ్బందుల్ని భరించక తప్పదు.] 

సోషలిజాన్ని సాధించాలంటే, పెట్టుబడిదారీ విధానం లోనే, కార్మికులు సహకారసంఘాలు పెట్టుకోవాలి-– అంటాడు, బెర్నస్టీన్. దీన్ని రోసా విమర్శిస్తుంది. కార్మికుల సహకార  సంఘాలు కూడా తమ ‘సరుకుల’ అమ్మకాల కోసం, పనిదినం పొడిగింపులూ, శ్రమ తీవ్రతలూ, జీతాల తగ్గింపులూ, కొన్ని సార్లు కొందరు కార్మికుల్ని పనిలోనించి తీసెయ్యడాలూ వంటి మార్కెట్ నియమాలనే పాటించక తప్పదు. ఇక అది కార్మికులకు చేసేది ఏమిటి?- –అని ఎంతో తార్కికంగా వివరిస్తుంది. అది, దోపిడీ వృక్షంపై పోరాటంగా గాక, దాని ఎండుటాకులపై పోరాటం మాత్రమే అంటుంది రోసా.


బెర్నస్టీన్, అర్ధం చేసుకున్న విషయాల్ని కూడా, గందర గోళంగానే అర్ధం చేసుకుంటాడు- –అంటుంది రోసా. 

బెర్నస్టీన్ చెప్పే సంస్కరణలు, వర్గభేదాల పునాదిని తీసివెయ్యడానికి కాదు; ఆ పునాది లోనే చిన్న చిన్న మార్పులు చెయ్యడానికి మాత్రమే. 

క్లుప్తంగా చెప్పాలంటే, పెట్టుబడిదారీ సంబంధాలను మార్చడం, ఆ వ్యవస్తలో వున్న శాసనాల్ని కొంత మార్చడం ద్వారా మాత్రమే సాధ్యం కాదు –అంటుంది రోసా. 

‘సోషలిజం’ దిశగా సాగవలిసిన మార్గంలో, శ్రామికవర్గ ఆచరణ ఎలా వుండాలో, ఆ దేశంలో నడిచే పార్టీ, శ్రామిక ప్రజలకు వివరిస్తూ వుండాలి. 

బెర్నస్టీన్, విలువ సిద్ధాంతాన్నీ, అదనపు విలువ సిద్ధాంతాన్నీ పూర్తిగా వదిలేశాడు. అందుకే, శ్రామిక దృష్టి లేకుండా, బూర్జువా ఉదార వాదంతో, రాజీల గురించే ముఖ్యంగా మాట్లాడతాడు. 

బూర్జువా వర్గానికి సోషలిజాన్ని అణచాలనే దృష్టి వుండదట! -ఇది బెర్నస్టీన్ సూత్రీకరణ!

బెర్నస్టీన్, వర్గభేదాల శాస్త్రం గురించి పట్టించుకోడు. అతను మాట్లాడేది బూర్జువా శాస్త్రం, బూర్జువా ప్రజాస్వామ్యం, బూర్జువా శాసనాలూ, బూర్జువా నైతికతా! 

‘సోషలిజం’ అని మాట్లాడేవాళ్ళు, సోషలిజానికి ఒక వర్గస్వభావం వుంటుందని తెలుసుకోరు- –అని రోసా విమర్శ. 

మార్క్సుకి పూర్వం కూడా, ‘సోషలిజం’ అనే ఆలోచనలు వున్నాయి. కానీ, మార్క్సు చెప్పిన సోషలిజం మాత్రమే వర్గ భేదాల్ని గ్రహించి దాన్ని నిర్మూలించే శాస్త్రీయ సోషలిజం. ఈ సోషలిజానికి గాక, ఇతర ఏ సోషలిజం వల్లా, వర్గాల విముక్తి జరగడానికి ఆస్కారం లేదు. 

మార్క్సు లేని కాలంలో, బెర్నస్టీన్ కొన్నాళ్ళు లండన్‌లో వున్నప్పుడు, ఎంగెల్సుకి స్నేహితుడయ్యాడు. ఇతను ‘సోషలిజం, సోషలిజం’ అంటూ వుంటే, ఆ మాటలు చూసి, ఇతన్ని ఎంగెల్సు కొన్నాళ్ళు ఇష్టపడ్డాడు. ఒకసారి ఏమైందంటే, మార్క్సు రాసిన ఒక వ్యాసానికి, మార్క్సు చనిపోయిన తర్వాత, ఎంగెల్సు ఒక ముందు మాట రాశాడు. ఆ వ్యాసాన్ని బెర్నస్టీన్, తను నడిపిన పత్రికలో ప్రచురించినప్పుడు, ఎంగెల్సు రాసిన ముందు మాటని బాగా మార్చేశాడు. ఎంగెల్సుని విప్లవకారుడిగా గాక, రాజీలు పడే శాంతిప్రియుడిగా చేసేశాడు. ఆ పత్రికని చూసి, ఎంగెల్సు బెర్నస్టీన్ మీద తీవ్రంగా మండిపడి, తన ముందుమాటని యధాతధంగా తిరిగి ప్రచురించమని చెప్పి, బెర్నస్టీన్‌ని అర్ధం చేసుకోవడంలో తన పొరపాటుకి బాధపడ్డాడు. [ఇది రోసా పుస్తకం లోది కాదు.]

రోసా పుస్తకాన్ని చదవాలి! అర్ధం కాని చోట్ల మళ్ళీ చదివి, మళ్ళీ అర్ధం కాకపోతే, అప్పుడు వదిలెయ్యండి! అర్ధం అయ్యే భాగాలు చాలా వున్నాయి. చాలు అవి! 

రోసా బాల్యం, పిహెచ్‌డి వరకూ చదువూ, ఉద్యమాల్లో ఆమె చేరికా, ఆమె రాజకీయ కార్యకలాపాలూ వంటి అనేక వివరాల్ని పీకాక్ గాంధీ గారు ‘విప్లవం ఆమె ఊపిరి’ అనే పేరుతో ఒక పెద్ద ముందుమాటలో ఇచ్చారు. దానిలో ఇచ్చిన ఒక విషాద ఘటన గురించి చివరిలో ప్రత్యేకించి చెప్పుకోవాలి. 

1919 జనవరిలో జరిగిన విప్లవకర ఉద్యమాన్ని అణచడానికి, అప్పటి జర్మనీ ప్రభుత్వం కిరాయి దళాలను ఉపయోగించింది. ఆ కిరాయి దళాలు లీబ్నెక్ట్ అనే విప్లవకారుణ్ణీ, రోసానీ పట్టుకుని చిత్రహింసలు పెట్టారు. ఒకడు రోసా తలపైన రైఫిల్ మడమతో బలంగా కొట్టగానే ఆమె పడిపోయింది. ఆ తర్వాత ఇంకొకడు ఆమె తలలోకి తుపాకీతో కాల్చాడు. ఆ హత్య జరిగినప్పుడు రోసా వయస్సు 48వ సంవత్సరం!

మార్క్సిస్టు విప్లవకారిణి, ఆ రకంగా, బూర్జువా ప్రభుత్వపు హత్యాకాండకు బలయ్యింది.

రంగనాయకమ్మ

Updated Date - 2021-02-28T05:59:23+05:30 IST