Advertisement

పన్నుల మోత

Nov 29 2020 @ 23:11PMఏప్రిల్‌ నుంచి అమలుకు సన్నాహాలు

రిజిస్ట్రేషన్‌ విలువ పెరిగిన ప్రతిసారీ పెంపు

పట్టణ వాసులపై అదనపు భారం

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి) : 

ఈ ఏడాది అంతా కరోనామయం. లాక్‌డౌన్‌ ప్రభావంతో ఇటు కార్మికులకు ఉపాధి లేదు. అటు వాణిజ్య సంస్థలన్నీ మూతబడి వ్యాపారులకు ఆదాయం లేదు. అయినప్పటికీ పట్టణ ప్రజలపై పన్నుల వడ్డింపు తప్పడం లేదు. స్థానిక సంస్థలకు ప్రధాన ఆదాయ వనరయిన పన్నుల వసూళ్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. కార్పొరేషన్‌, మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థ ప్రజలపై మరింత భారం మోపేందుకు సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన అవలంభిస్తున్న ఆస్తిపన్ను విధానానికి బదులు.. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు నిర్ణయించే ఆస్తి విలువను పరిగణనలోకి తీసుకునే కొత్త పద్ధతికి తెరతీసింది. దీనిని వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అమల్లోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో పన్ను పెరుగుదల శాతం ఎంత? అదనపు భారం ఎంత? వంటి అంశాలపై పట్టణవాసులు లెక్కలు వేసుకుంటున్నారు. అధికారులు మాత్రం పన్నుల పెంపు విషయమై తమ వద్ద ఇంకా సరైన సమాచారం లేదని చెబుతున్నారు.  


 ప్రస్తుతం ప్రాంతాల వారీగా పన్నులు... 

పట్టణాల్లో ప్రస్తుతం 350 చదరపు అడుగుల కంటే తక్కువ విస్తీర్ణంలో ఇల్లు ఉంటే ఇంటి పన్ను రూ.50, కమర్షియల్‌ భవనాలకు రూ. 150-250 వరకు ఉంటుంది. అంతకంటే ఎక్కువ నిర్మిత ప్రాంతం ఉంటే విస్తీర్ణాన్ని బట్టి ప్రాంతాలవారీగా ఆస్తి పన్ను వసూలు చేస్తారు. శ్రీకాకుళం నగరంలో ఏడురోడ్ల జంక్షన్‌ వద్ద  1,750 చదరపు అడుగుల నివాసానికి ఆరు నెలలకు రూ.1,650 చొప్పున ఏడాదికి రూ. 3,300 చెల్లిస్తున్నారు. ఆరు నెలలకోసారి చెల్లించే క్రమంలో సమయానికి చెల్లించకపోతే రూ. 150 వడ్డీ పడుతుంది. సంవత్సరం వరకు కట్టకపోతే మొత్తం వడ్డీ, ఇతర ఛార్జీలు కలిపి మూడింతలు అవుతుంది. అలా వడ్డీతో కలిపి పన్ను మొత్తం రూ.4,000 వరకు కట్టాల్సి వస్తోంది. ఇలా ఏటా పన్నులు పెరిగి.. కార్పొరేషన్‌, మునిసిపాలిటీలు, నగర పంచాయతీల ఆదాయం కూడా పెరుగుతోంది. 


 విలువ ఆధారితంగా... 

ఇదివరకు భవనానికి మాత్రమే పన్ను వేస్తుండగా, కొత్త విధానం అమలైతే భవనంతో పాటు అది ఉన్న స్థలానికి కూడా వేర్వేరుగా పన్నులు వేస్తారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ఆస్తి విలువను సవరించిన ప్రతిసారీ ఆస్తి పన్ను పెరుగుతుంది. దీని ప్రకారం నివాస భవనాలకు 0.10-0.50 శాతం వరకు, కమర్షియల్‌ భవనాలకైతే 0.20-2.0 శాతం వరకు పన్ను వేస్తారు. ఇది ఎంతనేది స్థానిక సంస్థలే నిర్ణయిస్తాయి.  ఇళ్లు, భవనాలను అద్దెకు ఇచ్చేవారిపై ఎంత భారం పడుతుంది? ఒకవేళ 10-15 శాతం పెంచాల్సి వస్తే పాత, కొత్త విధింపుల మధ్య ఎంత వ్యత్యాసం ఉంటుందని జిల్లావాసులు లెక్కలేసుకుంటున్నారు. విలువ ఆధారితంగా పన్ను పెంచితే ప్రస్తుతం చెల్లించే దానికంటే ఐదు రెట్లు ఎక్కువ ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. 375 చదరపు అడుగుల లోపు ఇల్లు ఉంటే పన్ను రూ.50 మాత్రమేనని, దానికి మించితే 0.10 నుంచి 0.50 శాతం వరకు పెంపు ఉంటుందని ప్రభుత్వం తరపున ప్రకటన వెలువడినట్లు సమాచారం. అసలే కరోనా కాలం... ఆపై రాబడులు తగ్గి..  ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విలువ ఆధారిత పన్నుల పెంపు అంశంపై ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయం సరికాదని, ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలని కోరుతున్నారు. 
Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.