ప్రాంతీయ పార్టీలతో దేశాభివృద్ధి కల్ల!

ABN , First Publish Date - 2022-05-19T05:56:32+05:30 IST

ఇటీవలికాలంలో మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడుతూ వస్తున్నది. దేశంలోని రాజకీయ పార్టీల బలాబలాలలో అసమతుల్యం ఏర్పడటమే దీనికి ప్రధాన కారణం.

ప్రాంతీయ పార్టీలతో దేశాభివృద్ధి కల్ల!

ఇటీవలికాలంలో మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడుతూ వస్తున్నది. దేశంలోని రాజకీయ పార్టీల బలాబలాలలో అసమతుల్యం ఏర్పడటమే దీనికి ప్రధాన కారణం. గతంలో జాతీయ పార్టీలు బలంగా ఉండేవి. మనకు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి దేశంలో కాంగ్రెసుతో పాటు భారతీయ జన సంఘం, భారతీయ కమ్యూనిస్టు పార్టీ, భారతీయ మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ, ప్రజా సోషలిస్టు పార్టీ మొదలగు పార్టీలు బలంగా ఉండి ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పడ్డాయి. రానురాను ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెసు, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చట్టసభల్లో తమ పూర్వ వైభవాన్ని, ఉనికిని కోల్పోతున్నాయి. ప్రస్తుత అధికార పార్టీ ముఖ్యమైన విధాన నిర్ణయాలు చేసే సందర్భంలో ప్రతిపక్షాల, ప్రజా సంఘాల, మేధావుల అభిప్రాయాలను స్వీకరించడానికి ఇష్టపడటం లేదు. ప్రజాస్వామ్యంలో ఈ విధానం శుభ సూచిక కాదు.


ఇటీవల చట్టసభలలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల ప్రాతినిధ్యం ప్రశ్నార్థకంగా మారిపోయింది. అదేవిధంగా 2019 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ లోక్‍సభలోని 543 సభ్యులలో పది శాతానికి కూడా చేరుకోలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా నాయకత్వ సమస్యలతో, అంతర్గత ప్రజాస్వామ్యం పేరిట కీచులాటలతో, గ్రూపు తగాదాలతో బలహీనపడుతూ వచ్చింది. కాంగ్రెసు, వామపక్షాలు బలహీనపడటం మన ప్రజాస్వామ్య మనుగడకు అవరోధం అవుతుందనటంలో సందేహం లేదు. ఎందుకంటే గత ఎనిమిదేళ్లలో నిత్యావసర వస్తువుల ధరలు రెండు వందల శాతానికి పైగా పెరిగినప్పటికీ, పెట్రోలు, డీజిలు, వంట గ్యాసుల ధరలు నిత్యం పెరుగుతున్నప్పటికీ– ప్రతిపక్షాలు బలహీనంగా ఉండటం వల్ల పాలక పక్షాన్ని నిలదీయలేకపోతున్నాయి. నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు పాపం పెరిగినట్లు పెరిగినా ప్రభుత్వాన్ని ప్రశ్నించగల ప్రతిపక్షం లేదు.


పార్లమెంటులో ప్రాంతీయ పార్టీలు రకరకాల కారణాల వల్ల పాలక పార్టీకి లొంగిపోవడమో, లేదా స్వప్రయోజనాల కోసం చర్చలో పాల్గొనకుండా నిశ్శబ్దంగా ఉండడమో చేస్తున్నాయి. దీనివల్ల అధికార పార్టీ అనేక బిల్లులను సరైన చర్చ లేకుండానే చట్టాలుగా మారుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లు, వ్యవసాయ బిల్లు, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం విషయంలో ప్రాంతీయ పార్టీలు ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించాయి. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని ప్రాంతీయ పార్టీలు కేంద్రానికి అడుగులకు మడుగులొత్తుతున్నాయి. ప్రజా ప్రయోజనాలను కూడా విస్మరిస్తున్నాయి. అంతేగాక, ఈ ప్రాంతీయ పార్టీలు తమ తమ ప్రాంతాల స్వంత కులాల ప్రయోజనాలకు లేదా ఆ పార్టీల అధినాయకత్వాల, వారి తాబేదార్ల ప్రయోజనాలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్థమవుతున్నది. గతంలో ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై ఫ్రంట్‍లు, సిండికేట్లు, వేదికలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ ప్రజలకు ఎలాంటి విశ్వసనీయమైన, సమర్థనీయమైన పాలన ఇచ్చినట్టు చరిత్రలో దాఖలా లేదు. అందువలన జాతీయస్థాయిలో జాతీయ పార్టీలే బలంగా ఉండాలి. దేశ సమగ్రతను కాపాడగలిగేవి, కులమతాలకు అతీతంగా దేశాభివృద్ధిని కాంక్షించేవి జాతీయ పార్టీలే అని గత అనుభవాలు చెబుతున్నాయి. ప్రాంతీయ పార్టీలు కేవలం రాష్ట్రం పరిధిలోనే ఉండాలి. దేశ రాజకీయాలలో వాటికి ప్రధాన పాత్ర ఇచ్చినా దేశ సమగ్రతకుగాని, అన్ని వర్గాల అభివృద్ధి గాని అవేమీ ఉపయోగపడలేవు.


తెలంగాణ రాష్ట్రంలో కూడా గత ఎనిమిదేళ్ళలో ప్రతిపక్షాలు బలహీనపడడం వలన ప్రజలకు అనేక సమస్యలు ఏర్పడ్డాయి. ప్రజల భూములకు, ఆస్తులకు, ఆత్మగౌరవానికి రక్షణ లేని దుస్థితి ఏర్పడింది. అస్తవ్యస్తమైన పరిపాలన, మితిమీరిన అవినీతి తెలంగాణ పాలనా యంత్రాంగంలో విలయతాండవం చేస్తున్నది. కాంగ్రెసు బలహీనపడడం, ఎన్నికైన కాంగ్రెస్ నాయకులు స్వంత ప్రయోజనాల కోసం పార్టీకి వెన్నుపోటు పొడిచి గంపగుత్తగా టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవటం వల్ల ప్రధాన ప్రతిపక్షం బలహీనపడింది. అధికార పార్టీ ప్రతిపక్షాలను బలహీన పరచాలని, ప్రజా సమస్యలు ఎత్తిచూపే వాళ్ళే లేకుండా చేయాలని ఎన్నికైన ప్రజాప్రతినిధులను తమ పార్టీలోకి ఆకర్షిస్తూ వచ్చింది. వారికి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అవమానమే మిగిలిపోయింది. అదేవిధంగా తెలంగాణ సెంటిమెంటుతో తెలుగుదేశం పార్టీ దాదాపు అంతరించిపోయింది. ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు కూడా కొందరు తాము అనేక సంవత్సరాలుగా ప్రజలకు బోధించిన సామ్యవాద సిద్ధాంతాలను గాలికి వదిలి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక కొంతమంది దురాశపరులైన ఉన్నతాధికారులు బాధ్యతలను మరిచి స్వప్రయోజనాల కోసం ఈ బంగారు తెలంగాణ పునర్నిర్మాణ పథకానికి లొంగిపోయారు.


నిధులు, నియామకాలు, నీళ్లు, ఆత్మగౌరవం, స్వయం పాలన మొదలైన తెలంగాణ ప్రజల ఆశయాలు కలగానే మిగిలిపోయాయి. కృష్ణా నీళ్లు జగన్‌రెడ్డి ఎత్తుకుపోతున్నాడు. నిధులు ఆంధ్ర కాంట్రాక్టర్ల వశం అవుతున్నాయి. నియామకాలు అడపా దడపా నత్తనడక నడుస్తున్నాయి. నోటిఫికేషన్ల ద్వారానే కాలమంతా గడుస్తున్నది. ఆత్మగౌరవం అటకెక్కింది. స్వయం పాలన ఒకే సామాజిక వర్గ పాలనలో నలిగిపోతున్నది.


ఇప్పటికైనా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడిచే నాయకులను పసిగట్టి ఎన్నికల్లో బుద్ధి చెప్పవలసిన అవసరం ఉన్నది. గత సంవత్సర కాలం నుంచి తెలంగాణలో ప్రతిపక్షాల పాదయాత్రలు, బహిరంగ సభలు, చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మళ్లీ అనేక ప్రతిపక్షాలు పోటీలో నిలబడడం వల్ల అన్నీ బలహీనపడతాయి. తత్ఫలితంగా ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. చివరకు ఇదంతా ఏకపక్ష పాలనకే దారి తీస్తుంది. ఎన్నికల సందర్భంలో రకరకాల తాయిలాలు, మందు, విందు, డబ్బు సంచులకు లొంగకుండా, ఓట్లను మార్కెట్లో అమ్ముకోకుండా ప్రజలను చైతన్యపరిచే కృషి జరగాల్సిన అవసరం ఉంది. దేశంలో గాని మన తెలంగాణలో గాని కేవలం జాతీయ పార్టీలకే ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యమైన అమెరికాలో 2 ప్రధాన పార్టీల మధ్యనే ఎన్నికలు జరుగుతాయి. జర్మనీ, గ్రేట్ బ్రిటన్ మొదలగు పాశ్చాత్య దేశాలలో కూడా జాతీయ పార్టీల ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. పూర్వపు రాజరికాలు, భూస్వామ్యాలు, ఆధిపత్య కులాల ప్రాబల్యం వల్ల రాష్ట్రాలలో, అదే విధంగా తెలంగాణలో, జాతీయ పార్టీలు బలహీన పడి, ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతామని హడావిడి చేయటం జరుగుతున్నది. దేశ సమగ్రతను, సమస్త ప్రజల సమతుల్య అభివృద్ధినీ అడ్డుకునే ప్రభుత్వాల వల్ల ప్రయోజనం శూన్యమని గుర్తించాలి. ప్రజాస్వామ్యం విఫలమైతే అది ప్రజల, మేధావుల, విద్యావంతుల వైఫల్యం అని గుర్తు పెట్టుకోవాలి.


ఆచార్య కూరపాటి వెంకటనారాయణ

Updated Date - 2022-05-19T05:56:32+05:30 IST