రిజిస్ర్టేషన్‌ బాదుడు

ABN , First Publish Date - 2021-11-07T05:41:52+05:30 IST

రిజిస్ర్టేషన్‌ బాదుడు

రిజిస్ర్టేషన్‌ బాదుడు

జిల్లా రిజిస్ట్రేషన్‌ శాఖలో అమలవుతున్న కొత్త విధానం

వంశ పారంపర్య ఆస్తుల వాటా పంపకాలపై భారం

మేజర్‌ వాటాకు స్టాంపు డ్యూటీ మినహాయింపు రద్దు 

అసమాన వాటాల పరిష్కారానికి మూడు శాతం స్టాంపు డ్యూటీ

సొంతంగా ఆస్తి సంపాదించుకుంటే నాలుగు శాతం

వారసత్వ ఆస్తులను పంచుకునే విషయంలో సంప్రదాయంగా వస్తున్న పద్ధతులు, విధివిధానాలకు రిజిస్ర్టేషన్‌ శాఖ తిలోదకాలిచ్చింది. కుటుంబ సభ్యుల నడుమ ఆస్తుల పంపిణీకి గతంలో ఉన్న నామమాత్రపు స్టాంపు డ్యూటీ ని భారీగా పెంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం.. ఆదాయం కోసం కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేలా నిర్ణయాలు తీసుకుంటోందని పలువురు మండిపడుతున్నారు. 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కుటుంబ సభ్యుల ఆస్తుల వాటా పరిష్కార డాక్యుమెంట్లకు సంబంధించి మేజర్‌ వాటాకు ఇప్పటివరకు ఉన్న ఫ్రీ స్టాంపు డ్యూటీని మినహాయించటం, అసమాన వాటాలు తీసుకున్న వారిపై 3 శాతం స్టాంపు డ్యూటీ విధించాలని రిజిస్ర్టేషన్‌ శాఖ తీసుకున్న నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 

గతంలో ఇలా..

ఒక కుటుంబంలో నలుగురు పిల్లలుంటే.. తల్లిదండ్రుల అంగీకారంతో ఎలా అయినా ఆస్తులు పంచుకోవచ్చు. తల్లిదండ్రులు చనిపోతే వారసుల అంగీకారం మేరకు ఎలా అయినా పంపకాల రిజిస్ర్టేషన్‌ చేసుకోవచ్చు. మేజర్‌ వాటాకు స్టాంపు డ్యూటీ మినహాయింపు ఉండేది. ఈ ప్రయోజనాన్ని ఆ కుటుంబ సభ్యులు సమానంగా లబ్ధి పొందేవారు. తక్కువ వాటాలు ఉన్నవారు ఒక్క శాతం స్టాంపు డ్యూటీ చెల్లించేవారు. ఈ విధానానికి రిజిస్ర్టేషన్‌ శాఖ తిలోదకాలు ఇచ్చింది. 

ప్రస్తుతం ఇలా.. 

కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న అసమాన వాటాల్లో మేజర్‌ వాటాకు ఉన్న స్టాంపు డ్యూటీ మినహాయింపును రిజిస్ర్టేషన్‌ శాఖ ఎత్తివేసింది. ఉదాహరణకు ఒక కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే వారి వాటా విలువ మొత్తాన్ని నాలుగుతో భాగించగా వచ్చిన విలువనే మినహాయిస్తారు. ఐదుగురు ఉంటే వారందరి వాటాను ఐదుతో భాగించగా, వచ్చే విలువను మాత్రమే మినహాయిస్తారు. దీనివల్ల మేజర్‌ వాటా విలువ చాలా తగ్గిపోతుంది. కుటుంబ సభ్యులు పొందే ప్రయోజనం విలువ తగ్గిపోతుంది. మేజర్‌ వాటా ఎలా తగ్గిపోతుందంటే.. ఒక కుటుంబంలో నలుగురు వారసులు ఉంటే, ఒకరికి రూ.40 లక్షలు, రెండో వారికి రూ.30 లక్షలు, మూడో వారికి రూ.20 లక్షలు, నాల్గో వారికి రూ.10 లక్షల చొప్పున అసమాన వాటాల పరిష్కారానికి దస్తావేజులు వచ్చినపుడు, పాత విధానంలో అయితే మేజర్‌ షేర్‌ రూ.40 లక్షల వాటాకు స్టాంపు డ్యూటీ మినహాయించేవారు. మిగిలిన మూడు వాటాలకు సంబంధించి ఒక్క శాతం స్టాంపు డ్యూటీ చెల్లించేవారు. నూతన విధానంలో నాలుగు వాటాలను కలిపితే.. కోటి రూపాయలను నాలుగుతో భాగించగా, వచ్చే విలువ రూ.25 లక్షలకు మాత్రమే స్టాంపు డ్యూటీ మినహాయింపు ఉంటుంది. అంటే మేజర్‌ వాటా రూ.40 లక్షలు పోయి, దాని కంటే తక్కువ విలువకే మినహాయింపు ఉంటుంది. ఇదే సందర్భంలో అసమాన వాటాలకు సంబంధించి గతంలో మాదిరిగా ఒక్క శాతం కాకుండా ప్రస్తుతం 3 శాతం అదనంగా స్టాంపు డ్యూటీ చెల్లించాలని రిజిస్ర్టేషన్‌ శాఖ నిర్దేశించింది. దీని ప్రకారం చూస్తే.. కుటుంబ సభ్యులు మేజర్‌ వాటా స్టాంప్‌ డ్యూటీ ప్రయోజనాన్ని కోల్పోవటంతో పాటు అదనంగా 2 శాతం స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సొంతంగా ఆస్తి సంపాదించుకుని ఉంటే, వాటిని కూడా వాటా పరిష్కార దస్తావేజుల్లో కలపాల్సి వస్తే, మొత్తం వాటాల మార్కెట్‌ విలువపై 4 శాతం స్టాంపు డ్యూటీ విధించాలని రిజిస్ర్టేషన్‌ శాఖ నిర్దేశించింది. ఒకవేళ కుటుంబ సభ్యులందరి అంగీకారం మేరకు చట్టబద్ధం కానీ వారసులను కూడా కలిపి ఆస్తుల వాటా పరిష్కారం చేసుకునేటపుడు కూడా వాటాల మార్కెట్‌ విలువపై 4 శాతం స్టాంపు డ్యూటీ విధించాలని నిర్దేశించారు.

Updated Date - 2021-11-07T05:41:52+05:30 IST