అక్రమ లేఔట్లలో కాసుల వర్షం

ABN , First Publish Date - 2021-10-30T06:23:49+05:30 IST

ఇది రిజిస్ట్రేషన దందా. అనుమతి లేకున్నా.. నిబంధనలకు విరుద్ధమైనా.. రిజిస్ట్రేషన చేసేస్తున్నారు.

అక్రమ లేఔట్లలో కాసుల వర్షం
రిజిస్ర్టేషన్లు చేయిస్తున్నది, జరుపుతున్నది కమ్మూరులోని సర్వేనెంబరు 505లోని ఈ భూమిలోనే

రిజిస్ట్రేషన దందా..!

ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్‌

అహుడా నిబంధనలు గాలికి

ఒక్కో సెంటు రిజిస్ర్టేషనకు రూ.20 వేలు ?

అనంతపురం రూరల్‌ సబ్‌రిజిస్ర్టార్‌ 

కార్యాలయంలో వసూళ్ల పర్వం

లిల్లీగార్డెన్స లేఔట్‌లో ఒకేరోజు 15 రిజిస్ర్టేషన్లు

నేడు 50 చేసేందుకు ముహూర్తం...?

అనంతపురం కార్పొరేషన, అక్టోబరు 29: ఇది రిజిస్ట్రేషన దందా. అనుమతి లేకున్నా.. నిబంధనలకు విరుద్ధమైనా.. రిజిస్ట్రేషన చేసేస్తున్నారు. పైసలు ముడితే చాలు అక్రమ లేఔట్లలోని ప్లాట్లను సైతం రిజిస్ర్టేషన చేయించేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ ప్లా ట్లు విక్రయించాలనే ఉద్దేశంతో అక్రమార్కులు న యా దందాకు తెరలేపుతున్నారు. వారితో కుమ్మక్కవుతున్న అధికారులు ఆమ్యామ్యాల మత్తులో అవినీతికి పాల్పడుతున్నారు. అనుమతుల్లేకపోయినా ఇష్టారాజ్యంగా రిజిస్ర్టేషన్లు చేస్తుండటంతో రిజిస్ర్టేషన శాఖపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనంతపురం-హిందూపురం పట్టణాభివృద్ధి సంస్థ (అహుడా) పరిధిలో జిల్లాలో అక్రమ లేఔట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఇప్పటివరకు 960పైచిలుకు అనధికార లేఔట్లను గుర్తించారు. గుర్తించనివి ఇంకా వందల సంఖ్యలోనే ఉన్నట్లు సమాచారం. వాటిని క్రమబద్దీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించినా.. కొందరు సద్వినియోగం చేసుకోలేదు. ఇక అనుమతుల్లేని లేఔట్లలో సైతం ప్లాట్లు రిజిస్ర్టేషన చేయిస్తూ భారీగానే సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతుల్లేని వాటిని రిజిస్ర్టేషన చేయకూడదని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను పక్కన పెట్టేశారు. అహుడా నిబంధనలు గాలికొదిలేశారు.


ఒక్కో ప్లాట్‌ రూ.12 లక్షలకు...

కూడేరు మండలం కమ్మూరు సమీపాన అనంతపురం-బళ్లారి ప్రధాన రహదారి పక్కనే సర్వేనెంబరు 505లోని 15 ఎకరాల్లో లేఔట్‌ వేశారు. అది అహుడా పరిధిలోకి వస్తుంది. అందులో 70 శాతానికి మాత్రమే ఎనఓసీ చే యించారు. ఒక్క సెంటు కూడా ల్యాండ్‌ కన్వర్షన చే యించలేదు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు ల్యాండ్‌ కన్వర్షన తప్పనిసరి. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆ లేఔట్‌లో ప్లాట్లు విక్రయించేందుకు అహుడా అనుమతి కచ్చితంగా తీసుకోవాలి. ఆ లేఔట్‌ వేసిన వీర్రాజు బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్‌ సంస్థ లిల్లీ గార్డెన్స పేరుతో అహుడాకు ఉత్తుత్తిగా ఆనలైనలో దరఖాస్తు చేసుకుంది. దీంతో టెంపరరీ లేఔట్‌ ప్లాన (ఎల్‌టీపీ) 1107/0072 నెంబర్‌ వచ్చింది. దాంతోనే వ్యవహారం నడిపారు. స్పాట్‌ రిజిస్ర్టేషన చేయిస్తామం టూ నమ్మబలికి ఒక్కో ప్లాట్‌(మూడు సెంట్లు) రూ.12 లక్షల చొప్పున విక్రయించేశారు. మొత్తం 238 ప్లాట్లలో ఇప్పటికే 120 ప్లాట్లు అమ్మేసి, రూ.కోట్లలో వెనకేసుకున్నట్లు సమాచారం. 


ఒక్కో సెంటు రిజిస్ర్టేషనకు రూ.20 వేలు..?

లిల్లీగార్డెన్స పేరుతో వెలసిన లేఔట్‌లో ప్లాట్ల విక్రయాలు కొనసాగుతున్నాయని వివరిస్తూ గత నెలలో ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. అప్పుడు స్పందించిన అహుడా అధికారులు వాటిని రిజిస్ర్టేషన చేయడం కుదరదని ఆదేశాలిచ్చామన్నారు. నెలరోజులు తిరక్కుండానే కథ మొదటికొచ్చింది. లిల్లీగార్డెన్స లేఔట్‌లో ఒకేరోజు (గురువారం) ఏకంగా 15 ప్లాట్లకు రిజిస్ర్టేషన చేశారు. అనంతపురం రూరల్‌ సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఈ దందాకు తెరలేపారు. ఒక్కో సెంటు రిజిస్ర్టేషనకు రూ.20 వేలు చొప్పున ఒక్కోప్లాట్‌కు రూ.50 వేల  నుంచి రూ.60 వేల వరకు రహస్య ఒప్పందం కుదిరినట్లు విశ్వసనీయ సమాచారం. అహుడా అనుమతిలేని లేఔట్‌లోని ప్లాట్లను ఎలా రిజిస్ర్టేషన చేశారో అంతుబట్టని విషయం. సంబంధిత రిజిస్ర్టేషన డాక్యుమెంట్లలో టీఎల్‌పీ నెంబర్‌నే నమోదు చేయడం గమనార్హం. అనుమతి ఉంటే ఫైనల్‌ లేఅవుట్‌ ప్లాన (ఎఫ్‌టీపీ) నెంబర్‌ వస్తుంది. టీఎల్‌పీ నెంబర్‌తో కూడా రిజిస్ర్టేషన చేయవచ్చనే ఆలోచన ఆ సబ్‌రిజిస్ర్టార్‌కు ఎలా తట్టిందో మరి. ఎవరైనా వెళ్లి ఒకటి, రెండు ప్లాట్ల రిజిస్ర్టేషన చేయమంటే మందలించి పంపే అధికారులు పెద్ద మొత్తంలో ఒప్పందం కుదిరితే అవకతవకలకు పాల్పడతారనే విమర్శలు వినిపిస్తున్నాయి.


నేడు 50 రిజిస్ర్టేషన్లకు ముహూర్తం...?

అహుడా అనుమతిలేని లేఔట్లలోని ప్లాట్లను గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ర్టేషన చేయిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. గార్లదిన్నె మండలం లోలూరు క్రాస్‌లో ఎక్కువ మొత్తం ఎకరాల్లో వేసిన అక్రమ లేఔట్‌లోనూ, బుక్కరాయసముద్రం మండలం పొడరాళ్లలోని మరో లేఔట్‌లో కొన్ని ప్లాట్లకు రిజిస్ర్టేషన్లు చేయించినట్లు సమాచారం. ఎనీవేర్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో ఎక్కడైనా రిజిస్ర్టేషన చేయించుకునే అవకాశం ఉండటంతో అక్రమార్కులు ఈ రకమైన దందా చేస్తున్నారు. కూడేరు మండలం అరవకూరు సర్వేనెంబరు 537/1, 538/1లో 17.5 ఎకరాల్లో వేసిన లేఔట్‌కు అహుడా అనుమతి లేదు. ఇందులో అధికార పార్టీకి చెందిన ఓ నేత కుమారుడికి రూ.కోట్లలో ముట్టజెప్పి, అహుడా అనుమతి లేకుండా రిజిస్ర్టేషన చేయించుకుంటున్నట్లు సమాచారం. లిల్లీగార్డెన్స పేరుతో 15 రిజిస్ర్టేషన్లు చేయించేసిన సంబంధిత లేఔట్‌ యజమానులు శనివారం 50 రిజిస్ర్టేషన్లకు ముహూర్తం సిద్ధం చేయించినట్లు తెలిసింది. రిజిస్ర్టేషన విషయం అహుడా వైస్‌చైర్మన మురళీకృష్ణగౌడ్‌కు తెలియడంతో అధికారులను సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయానికి పంపి, ఆ ప్రక్రియ నిలిపివేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయంపై సబ్‌రిజిస్ర్టార్‌ శ్రీనివాసులును వివరణ కోరగా... అహుడా అనుమతి ఉందిగా... వారి నుంచి వచ్చిన అనధికారిక లేఔట్ల జాబితాలో సర్వేనెంబరు 505 లేదనీ, కేవలం ఒక్కటి మాత్రమే రిజిస్ర్టేషన చేశామని చెప్పుకురావడం గమనార్హం. 




Updated Date - 2021-10-30T06:23:49+05:30 IST