రేపటి నుంచి రిజిస్ర్టేషన్‌ ధరల పెంపు

ABN , First Publish Date - 2020-08-09T10:06:14+05:30 IST

ఒకవైపు రియల్‌ ఎస్టేట్‌ పతనం, మరోవైపు మూడు రాజధానుల నిర్ణయం, ఇంకోవైపు కరోనా వంటి పరిస్థితుల్లో అన్ని వర్గాల ప్రజల ఆర్థిక..

రేపటి నుంచి రిజిస్ర్టేషన్‌ ధరల పెంపు

ఈసారి పట్టణ ప్రాంతాలకే పరిమితం

దాదాపు అన్ని ప్రాంతాల్లో పదిశాతం వరకు పెంపు

పట్టణాల్లో కమర్షియల్‌, శివారు ప్రాంతాల్లో 20 నుంచి 30 శాతం పెంపుదల

భూముల విలువ పెంపుపై సర్వత్రా ఆందోళన


గుంటూరు, ఆగస్టు 8: ఒకవైపు రియల్‌ ఎస్టేట్‌ పతనం, మరోవైపు మూడు రాజధానుల నిర్ణయం, ఇంకోవైపు కరోనా వంటి పరిస్థితుల్లో అన్ని వర్గాల ప్రజల ఆర్థిక పరిస్థితులు అగమ్యగోచరంగా ఉన్న తరుణంలో ప్రభుత్వం రిజిస్ర్టేషన్‌ చార్జీల పెంపునకు నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో రిజిస్ర్టేషన్‌ చార్జీలు పెరగబోతున్నాయి. ఈ మేరకు రిజిస్ర్టేషన్‌ శాఖ ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాల వారీగా పెరగనున్న భూముల విలువలను సంబంధిత జిల్లాలకు పంపారు. వాటిని అధికార వర్గాలు ఆన్‌లైన్‌లో నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఆదివారంనాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి సోమవారం నుంచి కొత్త చార్జీలను అమలులోకి తీసుకురాబోతున్నారు. ఏటా పట్టణ ప్రాంతంలో, రెండేళ్లకొకసారి గ్రామీణ ప్రాంతాల్లో భూముల విలువలను ప్రభుత్వం పెంచుతూ వస్తుంది.


గతేడాది అర్బన్‌, రూరల్‌ ఏరియాల్లో చార్జీలను పెంచారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ఆయా చార్జీల పెంపు పట్టణ ప్రాంతాలకు పరిమితం చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న భూముల విలువను 10 శాతానికి తగ్గకుండా పెంచారు. అంటే ఇప్పటివరకు అమలులో ఉన్న రిజిస్ర్టేషన్‌ చార్జీలు అన్ని పట్టణాల్లో ఎంతోకొంత పెరగబోతున్నాయి. ఇదిలావుంటే ఆయా పట్టణాల్లోని వాణిజ్య ప్రాంతాలు, ప్రధాన రహదారి వెంట ఉన్న ప్రాంతాలతోపాటు శివారు ప్రాంతాలు, కొత్త లేఅవుట్లు వేసిన ప్రాంతాల్లో భూముల విలువను భారీగా పెంచబోతున్నారు. ముఖ్యంగా కమర్షియల్‌ ప్రాంతాల్లో 20 నుంచి 30 శాతం వరకు ధరలు పెరగబోతున్నాయి. ప్రస్తుత తరుణంలో రిజిస్ర్టేషన్‌ చార్జీల పెంపుదలపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నప్పటికీ ప్రభుత్వం ఖజానా నింపుకోవటమే లక్ష్యంగా ప్రజలపై మరింత భారం మోపబోతుంది. ముఖ్యంగా గుంటూరు, తెనాలి, నరసరావుపేటతోపాటు మిగిలిన మున్సిపల్‌ పట్టణ ప్రాంతాల్లో రిజిస్ర్టేషన్‌ చార్జీలు భారీగా పెరగబోతున్నాయి. వాస్తవానికి ఆగస్టు ఒకటి నుంచే కొత్త చార్జీలు అమలులోకి రావాల్సి ఉన్నప్పటికీ పెంపుదల విషయంపై నెలకొన్న సందిగ్ధత నేపథ్యంలో కొంత ఆలస్యమైంది.


ఏటా పెంపుదలపై ప్రభుత్వం ముందుగానే ప్రకటన చేసేది. దీంతో జులై చివర్లో అప్పటికే ఒప్పందాలైన, కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేసుకున్న వారు పాత చార్జీల ప్రకారం రిజిస్ర్టేషన్‌ కోసం ఎగబడేవారు. అయితే ఈసారి అటువంటి ప్రకటన చేయకపోవటంతో పాటు కరోనా నేపథ్యంలో ఆ విధమైన రిజిస్ర్టేషన్‌ కోసం ప్రజల నుంచి ప్రయత్నాలు జరపలేదు. దీనికితోడు రెండో శనివారం, ఆదివారం సెలవులు రావటంతో ప్రజలకు ఆ అవకాశం లేకుండా పోయింది. మొత్తం మీద ప్రభుత్వం రిజిస్ర్టేషన్‌ చార్జీల పెంపునకు తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆస్తుల క్రయ, విక్రయాలు, రియల్‌ఎస్టేట్‌ లావాదేవీలు మరింతగా స్తంభించిపోతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. 

Updated Date - 2020-08-09T10:06:14+05:30 IST