రిజిస్ట్రేషన్‌ రగడ

ABN , First Publish Date - 2021-10-24T06:06:11+05:30 IST

రిజిస్ట్రేషన్‌ రగడ

రిజిస్ట్రేషన్‌ రగడ
శిక్షణ పొందుతున్న గ్రామ సచివాలయ సిబ్బంది

ఒకరికి శిక్షణ.. మరొకరికి శిక్ష

గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లకు శ్రీకారం

సచివాలయ సిబ్బందికి తొలి విడత శిక్షణ పూర్తి

మ పరిస్థితి ఏమిటంటున్న డాక్యుమెంట్‌ రైటర్లు

భవిష్యత్తు కార్యాచరణపై నేడు సమావేశం

ఒకరికి శిక్షణ.. మరొకరికి శిక్షగా మారింది. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు సచివాలయ సిబ్బందికి ఓవైపు శిక్షణ ఇస్తుండగా, తమ పరిస్థితి ఏంటని డాక్యుమెంట్‌ రైటర్లు తలలు పట్టుకుని కూర్చున్నారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల కారణంగా రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద అవినీతి తగ్గే అవకాశం ఉందన్న వాదనా వినిపిస్తోంది. 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గ్రామ సచివాలయాల్లో రిజిస్ర్టేషన్లు నిర్వహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో, పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపికైన మన జిల్లాలో సచివాలయాల సిబ్బందికి తొలి విడత శిక్షణ పూర్తయింది. జిల్లాలో రిజిస్ర్టేషన్‌ శాఖ ఎంపిక చేసిన సచివాలయాల సిబ్బందికి ఓవైపు శిక్షణ ఇస్తుండగా, మరోవైపు డాక్యుమెంట్‌ రైటర్లు ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. విజయవాడ వేదికగా ఆదివారం సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను రూపొందించు కోనున్నారు. గ్రామ సచివాలయాల పరిధిలో రిజిస్ర్టేషన్లు జరిగితే డాక్యుమెంట్‌ రైటర్లకు ప్రాధాన్యత ఉండదని, ఉపాధి కోల్పోతామని భావిస్తున్నారు. అయితే, కొందరు అవినీతి సబ్‌ రిజిస్ర్టార్లకు డబ్బు ముట్టే అవకాశం ఉండదు కాబట్టి పరోక్షంగా డాక్యుమెంట్‌ రైటర్లను ఉసిగొలుపుతున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. 

పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపికైన సచివాలయాలు ఇవే..

జిల్లాలో నాలుగు గ్రామ సచివాలయాలను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. మచిలీపట్నం జిల్లా రిజిస్ర్టార్‌ కార్యాలయ పరిధిలో పోతిరెడ్డి, మెరకగూడెం, మర్రిబంధం, విజయవాడ జిల్లా రిజిస్ర్టేషన్‌ కార్యాలయ పరిధిలో షేర్‌ మహ్మద్‌పేట గ్రామ సచివాలయాన్ని ఎంపిక చేశారు. 

శిక్షణ ప్రారంభం

గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ర్టేషన్లు నిర్వహించేందుకు సచివాలయ కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్‌కు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఆరు నెలల పాటు శిక్షణ ఉంటుంది. మొదటి దశలో 45 రోజులు, రెండో దశలో 45 రోజులు, మూడో దశలో 90 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం మొదటి దశ శిక్షణ పూర్తయింది. 

శిక్షణలో అంశాలు 

డాక్యుమెంట్‌ ఫీడింగ్‌, చెకింగ్‌, స్కానింగ్‌, రిజిస్ర్టేషన్‌, స్టాంపు డ్యూటీ, క్లాసిఫికేషన్స్‌ వంటి అంశాలపై తొలిదశ శిక్షణ ఇచ్చారు. డాక్యుమెంట్‌ను గ్రామ సచివాలయ కార్యదర్శి రూపకల్పన చేస్తాడు. చేత్తో రాసే డాక్యుమెంట్‌ ఉండే అవకాశం లేదు. అభివృద్ధి పరిచిన ఈ-డాక్యుమెంట్‌ను వినియోగించనున్నారు. ఆన్‌లైన్‌లో పొందుపరిచిన వివరాలన్నింటినీ పూరించి సంబంధిత ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయగానే, డాక్యుమెంట్‌ రూపొందుతుంది. దీనివల్ల సమయం, డ బ్బు ఆదా అవుతాయి. ఈ డాక్యుమెంట్‌ వల్ల సబ్‌ రిజిస్ర్టార్లకు మామూళ్లు సమర్పించుకునే అవకాశాలు ఉండవు. ఆన్‌లైన్‌ ప్రాసెస్‌, డేటా ఎంట్రీ, డాక్యుమెంట్స్‌ అప్‌లోడ్స్‌ వంటివన్నీ డిజిటల్‌ అసిస్టెంట్‌ నిర్వహించాల్సి ఉంటుంది. రిజిస్ర్టేషన్‌ ఫీజులు, స్టాంపు డ్యూటీ, చలానా వగైరాలన్నీ వీరి పర్యవేక్షణలోనే నడుస్తాయి. 

నేడు డాక్యుమెంట్‌ రైటర్ల కీలక సమావేశం

గ్రామ సచివాలయాల పరిధిలో రిజిస్ర్టేషన్లకు కసరత్తులు జరుగుతున్న నేపథ్యంలో డాక్యుమెంట్‌ రైటర్లు కార్యాచరణ దిశగా కదులుతున్నారు. నగరంలో ఆదివారం సమావేశమవుతున్నారు. ఇటీవల కాలంలో కొందరు డాక్యుమెంట్‌ రైటర్ల ప్రమేయంతో చలానా ఆర్థిక అవకతవకలు భారీగా వెలుగుచూసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్న మాటలు వినిపిస్తున్నాయి. అయితే, సచివాలయాల్లో రిజిస్ర్టేషన్లు ప్రవేశపెడితే డాక్యుమెంట్‌ రైటర్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ చేసే అవకాశముంది. 

డాక్యుమెంట్‌ రైటర్ల మాటున..

డాక్యుమెంట్‌ రైటర్లు ఒక్కసారిగా కార్యాచరణకు శ్రీకారం చుట్టడం వెనుక రిజిస్ర్టేషన్‌ శాఖలోని పెద్దల సహకారం ఉన్నట్టు తెలుస్తోంది. సబ్‌ రిజిస్ర్టార్లకు ఆదాయ మార్గాలుగా డాక్యుమెంట్‌ రైటర్లు ఉంటారు. సచివాలయాల్లో ఈ సేవలు అందిస్తే ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని, ఫలితంగా రిజిస్ట్రార్లకు కూడా ఏమీ అందవని భావిస్తున్నారు. భవిష్యత్తులో తమ పరిస్థితి ఏంటన్నది వారి ప్రశ్న. గ్రామ సచివాలయాలు పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోకి వస్తాయి. ప్రాసెసింగ్‌ అంతా అక్కడే జరుగుతుంది కాబట్టి, లంచాలు తగ్గిపోతాయన్న భయమూ డాక్యుమెంట్‌ రైటర్లలో ఉంది.




Updated Date - 2021-10-24T06:06:11+05:30 IST