రిజిస్ట్రేషన్‌ పరేషాన్‌!

ABN , First Publish Date - 2021-05-07T05:24:53+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో టీకా కేంద్రాల వద్ద రిజిస్ట్రేషన్ల విధానాన్ని సర్కారు నిలిపివేయడంతో 45ఏళ్లు పైబడిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు.

రిజిస్ట్రేషన్‌ పరేషాన్‌!
రెండో డోసు వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే రద్దయినట్లు వచ్చిన మెసేజ్‌

మళ్లీ నమోదు చేసుకోవాలని సందేశాలు

 కోవిన్‌ పోర్టల్‌ యాప్‌తో తప్పని తిప్పలు

 మీ సేవా కేంద్రాల వద్ద నిరక్షరాస్యులు, వృద్ధుల పడిగాపులు

 రెండో డోస్‌ తీసుకునే వారిపై ప్రభావం


మెదక్‌ అర్బన్‌, మే 6: కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో టీకా కేంద్రాల వద్ద రిజిస్ట్రేషన్ల విధానాన్ని సర్కారు నిలిపివేయడంతో 45ఏళ్లు పైబడిన వారికి ఇబ్బందులు తప్పడం లేదు. కొత్త నిబంధన వల్ల నిరక్షరాస్యులు, వృద్ధులు, నిరుపేదలు సెల్ఫ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోలేకపోతున్నారు. ఇప్పటికే మొదటి డోసు తీసుకుని రెండోడోసు కోసం ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకుంటున్న వారికి స్లాట్‌ రద్దయినట్లు మెసేజ్‌లు వస్తున్నాయి. దీంతో వారు కూడా ఆందోళనకు గురవుతున్నారు. మెదక్‌ జిల్లావ్యాప్తంగా 24 కేంద్రాల్లో టీకాలను ఇస్తున్నారు. 

వ్యాక్సిన్‌ కార్యక్రమం ఈఏడాది జనవరి 16న మెదక్‌ జిల్లాలో ప్రారంభమైంది. వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌,  60ఏళ్లు పైబడిన వారితోపాటు 45ఏళ్లు నిండిన వారికి టీకాలు వేస్తున్నారు. మెదక్‌ జిల్లావ్యాప్తంగా మొదటి డోసు వేసుకున్న వారు 1,01,263 మంది ఉన్నారు. ఇక రెండోడోసు తీసుకున్న వారు 10,360 మంది ఉన్నారు. రెండో డోసు వేసుకోవాల్సిన వారు ఇంకా చాలా మందే ఉన్నారు. మొదటి డోసు సమయంలో వ్యాక్సిన్‌ కేంద్రాల వద్దనే వైద్యసిబ్బంది రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తిచేసి టీకా వేశారు. గత నెల వరకు టీకా వేసేందుకు ఎలాం టి పరిమితులూ లేకపోవడంతో రోజుకు 4వేల మంది వరకు టీకాలు వేశారు. ప్రస్తుతం ఒక్కోకేంద్రంలో వందమందికి మాత్రమే అని చెప్పడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అత్యవసరమైన వారికి మాత్రం టీకా దొరకడం లేదు. 


అవగాహన కల్పిస్తేనే

కొందరికి రిజిస్ట్రేషన్‌పై సరైన అవగాహన ఉండడం లేదు. కొన్ని కుటుంబాల్లో విడివిడిగా ఫోన్లు లేవు. ఒకే నంబర్‌తో అందరి పేర్లు నమోదు చేస్తుండడంతో యాప్‌ నిరాకరిస్తోంది. ఇంటర్నెట్‌ సౌకర్యం ఉన్న వారు ఇంట్లో నుంచే స్లాట్‌ బుక్‌ చేసుకుంటున్నారు. ఆ సౌకర్యం లేని వారికి మీ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు తప్పడం లేదు. ప్రభుత్వ అధికారులు వ్యాక్సిన్‌ వేసుకునే వారికి అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. 


తగ్గిన కరోనా టెస్టులు

మెదక్‌ జిల్లా కరోనా వైరస్‌ చాపకింత నీరులూ విస్తరిస్తుండగా... మరోవైపు సర్కారు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య కుదించడం ఆందోళన కలిగిస్తోంది. జ్వరం, జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు తదితర సమస్యలతో బాధపడుతూ కరోనా టెస్టుల కోసం వెళ్లిన వారికి నిరాశే మిగులుతోంది. మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 24 కేంద్రాల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్లు ద్వారా టెస్టులు చేస్తున్నారు. ఒక్కో సెంటర్‌కు రోజు సగటున 150 మందికిపైగా వస్తుండగా...కిట్ల కొరత కారణంగా పీహెచ్‌సీలో 20, జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 100, ఏరియా ఆసుపత్రిలో 50, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో 40కి మించి టెస్టులు చేయడం లేదు. అది కూడా లక్షణాలు ఉంటేనే చేస్తున్నారు. లేదంటే నాలుగు రోజులు ఆగి రావాలని పంపిస్తున్నారు. దీంతో లక్షణాలు ఉన్న అనుమానితులు జనాల్లో తిరుగుతున్నారు. హోంక్వారంటైన్‌లో కూడా ఉండడం లేదు. రద్దీగా ఉండే ప్రదేశాల్లో తిరుగుతుండడంతో ఎవరు కరోనా పాజిటివ్‌ వ్యక్తులు? ఎవరికి లక్షణాలు ఉన్నాయో.? తెలియక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

Updated Date - 2021-05-07T05:24:53+05:30 IST