అక్రమాలకు అడ్డా

ABN , First Publish Date - 2022-05-27T05:30:00+05:30 IST

జిల్లాలో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు అక్రమాలకు చిరునామాగా మారుతున్నాయి. మామూళ్ల మత్తులో అధికారులు, సిబ్బంది అడ్డదారులు తొక్కుతున్నారు. పూర్వాపరాలు ఆరా తీయకుండానే రిజిస్ర్టేషన్లు చేస్తున్నారు. తప్పుడు డాక్యుమెంట్లకు వంత పాడుతున్నారు. ఫలితంగా శాఖాపరమైన చర్యలకు గురవుతున్నారు. జిల్లాలో సిద్దిపేట అర్బన్‌, సిద్దిపేట రూరల్‌, గజ్వేల్‌, దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాలలో సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలున్నాయి.

అక్రమాలకు అడ్డా
సిద్దిపేట అర్బన్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం

సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో సిబ్బందిపై ఆరోపణలు

మామూళ్ల కోసం అడ్డదారులు

ఆరా తీయకుండానే సంతకాలు

ఆఫీసుల్లో డాక్యుమెంట్‌ రైటర్లదే హవా

సిద్దిపేట సబ్‌ రిజిస్ర్టార్‌పై వేటు

గతంలో చేర్యాల ఎస్‌ఆర్‌వో సస్పెన్షన్‌


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మే 27: జిల్లాలో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు అక్రమాలకు చిరునామాగా మారుతున్నాయి. మామూళ్ల మత్తులో అధికారులు, సిబ్బంది అడ్డదారులు తొక్కుతున్నారు. పూర్వాపరాలు ఆరా తీయకుండానే రిజిస్ర్టేషన్లు చేస్తున్నారు. తప్పుడు డాక్యుమెంట్లకు వంత పాడుతున్నారు. ఫలితంగా శాఖాపరమైన చర్యలకు గురవుతున్నారు. జిల్లాలో సిద్దిపేట అర్బన్‌, సిద్దిపేట రూరల్‌, గజ్వేల్‌, దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాలలో సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలున్నాయి. గతంలో వ్యవసాయ, గృహ, వాణిజ్యపరమైన లావాదేవీలన్నీ ఇక్కడే జరిగేవి. ధరణి అమలులోకి వచ్చిన అనంతరం వ్యవసాయ భూములు మినహాంచారు. మిగితా డాక్యుమెంట్ల రిజిస్ర్టేషన్లు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లోనే జరుగుతున్నాయి.  


తప్పుడు రిజిస్ర్టేషన్లకు ప్రోత్సాహం

ఒక డాక్యుమెంట్‌ రిజిస్ర్టేషన్‌ చేయాలంటే 16 రకాల అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ అంశాలతోపాటు డాక్యుమెంట్‌ పూర్వాపరాలపై కనీస పరిశీలన చేయాలి. కానీ అవేవి లేకుండానే రిజిస్ర్టేషన్లు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. మామూళ్ల మత్తులో అమాయకులకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి బాధితులు ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నారు. చేసిన తప్పులకు కొందరు సబ్‌ రిజిస్ర్టార్లు కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అంతేకాకుండా రిజిస్ర్టేషన్‌ ఛార్జీలు, స్టాంపు డ్యూటీలు చెల్లించాల్సిన క్రమంలో.. కార్యాలయ సిబ్బంది చార్జీలు అంటూ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇందుకోసం ఆఫీసుల్లో విధులు నిర్వహించే ప్రైవేట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను వాడుకుంటున్నారు. ఒక్కో డాక్యుమెంట్‌కు ఒక్కో రేటును నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. 


దండుకుంటున్న డాక్యుమెంట్‌ రైటర్లు

భూక్రయవిక్రయాలు జరగాలంటే నేరుగా స్లాట్‌ బుక్‌ చేసుకొని  కార్యాలయంలో రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ చేపట్టవచ్చు. కానీ నేరుగా వచ్చేవారి డాక్యుమెంట్లలో అధికారులు, సిబ్బంది కావాలనే లోపాలు ఎత్తిచూపుతుండంతో డాక్యుమెంట్‌ రైటర్లను ఆశ్రయించక తప్పని పరిస్థితి. దీనిని ఆసరాగా చేసుకొని డాక్యుమెంట్‌ రైటర్లు అడ్డగోలుగా దండుకుంటున్నారు. డాక్యుమెంట్‌ పత్రాలు అటుఇటుగా ఉన్నా అధికారులను, సిబ్బందిని మేనేజ్‌ చేసి రిజిస్ట్రేషన్‌ చేయిస్తామంటూ వసూళ్లు చేస్తున్నారనే ఫిర్యాదులు అందుతున్నాయి. 


ఇప్పటి వరకు ఇద్దరు సస్పెన్షన్‌

సిద్దిపేట అర్బన్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ రఘుపతిని రెండ్రోజుల క్రితం అధికారులు సస్పెండ్‌ చేశారు. ఓ వ్యక్తి పేరిట ఉన్న స్థలాన్ని పాత పత్రాల ఆధారంగా, నిబంధనలకు  విరుద్ధంగా మరో వ్యక్తి పేరిట రిజిస్ర్టేషన్‌ చేశాడని  ఆయనపై ఫిర్యాదు వచ్చింది. విచారించిన అధికారులు ఈమేరకు చర్యలు తీసుకున్నారు. అత్యంత విలువైన తన స్థలాన్ని అక్రమంగా మరొకరికి బదిలీ చేయడంపై సదరు వ్యక్తి ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో ఇటీవల విచారణ చేపట్టి తాజాగా రఘుపతిని సస్సెండ్‌ చేశారు. ఏడాది కిందట చేర్యాల సబ్‌ రిజిస్ర్టార్‌గా పనిచేస్తున్న రాజు కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు. కొండపాకకు చెందిన ఓ ప్లాట్‌ రిజిస్ర్టేషన్‌ విషయంలో ఆయనపై వేటు పడింది.


ఎన్‌ఆర్‌ఐ ఫిర్యాదుతో..

సిద్దిపేట సబ్‌ రిజిస్ర్టార్‌ రఘుపతి సస్పెన్షన్‌ వెనుక ఎన్‌ఆర్‌ఐ పోరాటం ఉంది. తొగుటకు చెందిన గాడిపల్లి రఘువర్ధన్‌రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. సిద్దిపేటలోని ప్రభుత్వ పాఠశాల ఎదురుగా మూడేళ్ల క్రితం స్థలం కొనుగోలు చేశారు. ఈ స్థలాన్ని నెల క్రితం సిద్దిపేట అర్బన్‌ సబ్‌రిజిస్ట్రార్‌ రఘుపతి పాత పత్రాల ఆధారంగా మరో వ్యక్తికి ఫేక్‌ రిజిస్ర్టేషన్‌ చేశాడు. విషయం తెలిసి ఎన్‌ఆర్‌ఐ రఘువర్ధన్‌రెడ్డి హుటాహుటిన అమెరికా నుంచి వచ్చారు. తన డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలతో ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి హరీశ్‌రావును కలిసి అక్రమ రిజస్ట్రేషన్‌ విషయం చెప్పారు. మంత్రి ఆ శాఖ ఉన్నతాధికారులను విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన అధికారులు చర్యలు తీసుకున్నారు. అక్రమంగా చేసిన రిజిస్ర్టేషన్‌ను రద్దు చేయాలని రఘువర్ధన్‌రెడ్డి కోరుతున్నారు. 

Updated Date - 2022-05-27T05:30:00+05:30 IST