అంతంతే!

ABN , First Publish Date - 2021-07-23T05:18:20+05:30 IST

తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు,

అంతంతే!
మేడ్చల్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయంలో..

  • పెరిగిన ఆస్తుల విలువ, రిజిస్ర్టేషన్‌ రుసుము
  • ధరల పెరుగుదలతో మొదటి రోజు తగ్గిన రిజిస్ర్టేషన్లు
  • తాండూరు, పెద్దేముల్‌లో రిజిస్ర్టేషన్లు నిల్‌
  • పరిగి సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఒకే ఒక్కటి
  • ధరల పెరుగుదల ప్రభావం మరో వారం రోజులు ఉండొచ్చని అధికారుల అంచనా


తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలు, రిజిస్ర్టేషన్‌ రుసుములు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గురువారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. కానీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రిజిస్ర్టేషన్లు అంతంత మాత్రంగానే జరిగాయి. మామూలు రోజుల కంటే తక్కువ జరగడానికి ఓ వైపు ఎడతెరిపిలేని వర్షాలు కూడా కారణం కావొచ్చంటున్నారు.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) :  ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో నేటి నుంచి పెరిగిన విలువలు, చార్జీలకు అనుగుణంగా రిజిస్ర్టేషన్లు జరిగాయి. ఇప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారు అదనపు రుసుము చెల్లించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. కొత్త రిజిస్ర్టేషన్‌ చార్జీలను రిజిస్ర్టేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. రిజిస్ర్టేషన్‌ ఫీజును ప్రభుత్వం 6 నుంచి 7.5 శాతానికి పెంచింది. వ్యవసాయ భూముల కనిష్ఠ విలువ ఎకరానికి రూ.75 వేలుగా నిర్ణయించారు. అలాగే గ్రామాల్లో ఓపెన్‌ ప్లాట్ల కనిష్ఠ విలువ చదరపు గజానికి రూ.200గా నిర్ణయించారు. గజం రూ.151 నుంచి రూ.1000 ఉన్న ప్లాట్ల ధరలు 1.5 రెట్లు అంటే 50 శాతం పెంచారు. గజం రూ. 1001 నుంచి రూ.5వేల వరకు ఉన్న ప్రాంతాల్లో 1.3 రెట్లు లేదా రూ.1500 పెరిగింది. అలాగే గజం రూ.5 వేలకు పైగా ఉన్న ప్రాంతాల్లో 1.2 రెట్లు లేదా 6,500గా అమలు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్లకు సంబంధించి అతి తక్కువ విలువ ఒక చదరపు అడుగుకు రూ.800 ఉండగా దీన్ని రూ.1000 చేశారు. కొత్తగా పెంచిన ధరలు గురువారం నుంచి అమల్లోకి రావడంతో రిజిస్ర్టేషన్లు తగ్గాయి. ఉమ్మడిరంగారెడ్డి జిల్లాలోని సబ్‌రిజిస్ర్టార్‌, తహసీల్దార్‌ కార్యాలయాల్లో మొదటిరోజు రిజిస్ర్టేషన్లు అంతంత మాత్రంగానే జరిగాయి. సుమారు 124-150 వరకు రిజిస్ర్టేషన్లు జరిగినట్లు తెలుస్తుంది. సాధారణ రోజుల్లో రిజిస్ర్టేషన్ల సంఖ్యను పరిశీలిస్తే  550 నుంచి 800 వరకు రిజిస్ర్టేషన్లు జరుగుతాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు కూడా రిజిస్ర్టేషన్ల తగ్గుదలకు మరో కారణమంటున్నారు. 


పెద్దేముల్‌, తాండూరులో నిల్‌..

వికారాబాద్‌ జిల్లా తాండూరు సబ్‌రిజిస్ర్టేషన్‌ కార్యాలయంలో కనీసం ఒక్క రిజి స్ర్టేషన్‌ కూడా కాలేదు. పెద్దేముల్‌ మండలంలో తహసీల్దారు లేని కారణంగా అక్కడ ఒక్క రిజిస్ర్టేషన్‌ కూడా జరగలేదు. పరిగి సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఒకే ఒక్క ప్లాట్‌ రిజిస్ర్టేషన్‌ అయ్యింది. రిజిస్ర్టేషన్‌ లేని కారణంగా సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలు వెలవెలబోయాయి. 

బషీరాబాద్‌ మండలంలో 11 రిజిస్ర్టేషన్లు, తాండూరు తహసీల్దారు కార్యా లయంలో 3 రిజిస్ర్టేషన్లు అయ్యాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 25, చేవెళ్లలో 22, శంకర్‌పల్లిలో 20, వికారాబాద్‌ పరిధిలోని 7 సబ్‌రిజిస్ర్టార్‌, తహసీల్దారు కార్యాలయాల్లో 36, పరిగిలో 7 రిజిస్ర్టేషన్లు అయ్యాయి. శంషాబాద్‌ తహసీల్దారు కార్యాలయంలో 16 రిజిస్ర్టేషన్లు, సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో 25 రిజిస్ర్టేషన్లు జరి గాయి. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో 15, తహసీల్దారు కార్యాలయంలో ఒకటి రిజిస్ర్టేషన్‌ కాగా, కీసరలో 10, మేడ్చల్‌ రిజిస్ర్టేషన్‌లో 30 రిజిస్ర్టేషన్లు జరిగాయి. శామీర్‌పేట సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో 8 రిజిస్ర్టేషన్లు జరగగా సాఫ్ట్‌వేర్‌ సమస్య నెలకొంది. ధరల పెరుగుదల ప్రభావం వారం, పదిరోజుల వరకు ఉంటుందని, దీంతో రిజిస్ర్టేషన్ల సంఖ్య తగ్గే అవకాశం ఉందని, అధికారులు అంచనా వేస్తున్నారు. 



Updated Date - 2021-07-23T05:18:20+05:30 IST