రిజిస్ర్టేషన్ల సందడి

ABN , First Publish Date - 2020-11-26T06:13:47+05:30 IST

ఒక సుదీర్ఘ స్తబ్దత తరువాత రిజిస్ర్టేషన్ల సందడి మొదలయింది.

రిజిస్ర్టేషన్ల సందడి
పటమట రిజిస్ట్రార్‌ ఆఫీసులో రద్దీ

మరో నెల ఇలాగే ఉంటాయని అంచనా 

చుక్కల భూముల రిజిస్ర్టేషన్ల కోసం అభ్యర్థనలు 

మార్గదర్శకాలు వస్తే ఆదాయం పెరిగే అవకాశం 

ఈనాం భూములకు ఖరారు కాని విధివిఽధానాలు 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

 ఒక సుదీర్ఘ స్తబ్దత తరువాత రిజిస్ర్టేషన్ల సందడి మొదలయింది. మంచి ముహూర్తాలు ఉండటంతో పక్షం రోజులుగా పెద్ద ఎత్తున రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాయి. బుధవారం మంచి రోజు కావటంతో జిల్లావ్యాప్తంగా రిజిస్ర్టేషన్లు భారీగా జరిగాయి. విజయవాడ నగరంలో పటమట, గాంధీనగర్‌, గుణదల సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు కిటకిటలాడాయి. నున్న, గన్నవరం, కంకిపాడు, నూజివీడు, తిరువూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అధిక సంఖ్యలో లావాదేవీలు జరిగాయి. గిఫ్ట్‌ డీడ్స్‌, ఆస్తి బదలాయింపులు, మార్ట్‌గేజ్‌ రిలీజ్‌లు ఎక్కువగా జరిగాయి. నూతనంగా భూముల కొనుగోళ్లకు సంబంధించి కూడా అధిక సంఖ్యలో రిజిస్ర్టేషన్లు జరిగాయి. కరోనాకు ముందు ఈ-డాక్యుమెంట్లకు కొద్ది మేర ఆదరణ లభించినా, ప్రస్తుతం వీటి పట్ల ప్రజలు ఆసక్తి చూపటం లేదు. దాదాపు అందరూ మాన్యువల్‌ పద్ధతిలోనే వెళుతున్నారు. 


రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లోకి మాస్కులు ఉంటేనే అనుమతిస్తున్నారు. కార్యాలయాల్లో శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. నగరంలోని మూడు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు కూడా ఇరుగ్గా ఉండటం కొంత ఇబ్బందిని కలిగిస్తోంది. మాన్యువల్‌ డాక్యుమెంట్లతో లావాదేవీలు నిర్వహించటం వల్ల అప్‌డేషన్‌, ఫొటో, బయోమెట్రిక్స్‌ తప్పనిసరి అయ్యాయి. డాక్యుమెంట్లు ఎక్కువగా ఉండటంతో ప్రజలు కార్యాలయం బయటే నిరీక్షించాల్సి వచ్చింది. ప్రస్తుతం మంచి రోజులు కావడంతో రిజిస్ర్టేషన్లు పెరిగాయని, డిసెంబర్‌ రెండో వారం వరకు ఇదే రద్దీ కొనసాగుతుందని రిజిస్ర్టేషన్‌ వర్గాలు భావిస్తున్నాయి. 


పెండింగ్‌లోనే చుక్కల భూముల రిజిస్ర్టేషన్లు 

జిల్లాలో చుక్కల భూముల రిజిస్ర్టేషన్ల అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ భూములకు సంబంధించి జిల్లాలో వివాదాలు పెద్దగా లేవనే చెప్పాలి. ఇప్పటికే ఈ భూములు అనేక మంది చేతులు మారాయి. చుక్కల భూములు కావటం వల్ల వీటి రిజిస్ర్టేషన్లు జరగడం లేదు. వీటి రిజిస్ర్టేషన్లపై కలెక్టర్‌ ఒక నిర్ణయం తీసుకుని, రిజిస్ర్టేషన్‌ శాఖకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే, ఈ శాఖకు భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని, కొవిడ్‌ అనంతర క్లిష్ట పరిస్థితుల్లో ఇది మంచి అవకాశం కూడానని రిజిస్ర్టేషన్‌ వర్గాలంటున్నాయి. ఈనాం భూముల రిజిస్ర్టేషన్లకు కూడా ఇప్పటి వరకు విధి విఽధానాలు లేవు. ప్రభుత్వ స్థాయిలోనే ఇది జరగాలి. ఈనాం భూములకు సంబంధించిన విధి విధానాలు ఖరారయితే భారీ ఎత్తున ఆదాయం సమకూర్చుకోవచ్చునన్న వాదన కూడా ఈ శాఖ నుంచి వినవస్తోంది. 

Updated Date - 2020-11-26T06:13:47+05:30 IST