రిజిస్ర్టేషన్లు బంద్‌!

ABN , First Publish Date - 2022-02-20T07:48:09+05:30 IST

రిజిస్ర్టేషన్లు బంద్‌!

రిజిస్ర్టేషన్లు బంద్‌!

అనధికార లేఅవుట్లలోని స్థలాలకు ఆపేయండి 

ఆదేశాలు ఉల్లంఘిస్తే సబ్‌ రిజిస్ర్టార్లు డిస్మిస్‌ 

స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ ఐజీ ఉత్తర్వులు 

ఇకపై డీటీసీపీ లేఅవుట్లలోని స్థలాలకే పరిమితం 

రాష్ట్రవ్యాప్తంగా ఆగిపోయిన వేలాది రిజిస్ర్టేషన్లు 

గ్రామాల్లో కూడా నిషేధం ఉత్తర్వులు అమలు 

కొనుగోలుదారులు, అమ్మకందారుల్లో గందరగోళం


అమరావతి(ఆంధ్రజ్యోతి)/కలికిరి, ఫిబ్రవరి 19: రాష్ట్రవ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు బంద్‌ అయ్యాయి. అనధికార లే అవుట్లలోని స్థలాల రిజిస్ర్టేషన్లు తక్షణం ఆపేయాలని స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శనివారం వేలాదిగా రిజిస్ర్టేషన్లు ఆగిపోయాయి. ఈ అనూహ్య పరిణామంతో ముందుగానే చలానాలు కట్టినవారు, దూరప్రాంతాల నుంచి వచ్చిన వారంతా తీవ్ర ఆందోళన చెందారు. వాస్తవానికి అనధికార లేఅవుట్లలో రిజిస్ర్టేషన్లు ఆపేయాలంటూ 2020లోనే ఉత్తర్వులిచ్చారు. అవి చాలాచోట్ల అమలు కావడం లేదని, అందుకే మరోసారి ఉత్తర్వులు ఇస్తున్నామని రిజిస్ర్టేషన్ల శాఖ ఐజీ వి.రామకృష్ణ పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించి రిజిస్ర్టేషన్లు చేస్తే సబ్‌ రిజిస్ర్టార్లను డిస్మిస్‌ చేస్తామని, తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై డీటీసీపీ లే అవుట్లలోని స్థలాలు మాత్రమే రిజిస్ర్టేషన్‌ చేయాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సబ్‌ రిజిస్ర్టార్లు ఎవరూ రిజిస్ర్టేషన్లు చేయలేదు. చలానాలు కట్టి, అన్ని ఏర్పాట్లు చేసుకొని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయానికి వెళ్లినవారంతా రిజిస్ర్టేషన్లు చేయట్లేదని తెలియడంతో తీవ్ర ఆందోళన చెందారు. గతంలో చాలాకాలం క్రితం వేసిన లే అవుట్లలో స్థలాలను అమ్మేయడం, రిజిస్ర్టేషన్లు చేయడం అప్పుడే అయిపోయింది. ఆ తర్వాత అవి చాలా చేతులు మారాయి. ఇప్పుడు అలాంటి స్థలాలను సైతం రిజిస్ర్టేషన్‌ చేయవద్దని ఆదేశాలివ్వడంతో నాడు కొనుగోలు చేసినవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడో వేసిన లే అవుట్లను, ఇప్పటికే రిజిస్ర్టేషన్లు అయిపోయిన స్థలాలను మినహాయించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు గ్రామాల్లో ఇళ్ల మధ్య ఉండే స్థలాలకు డీటీసీపీ లే అవుట్‌ ఉండదు. అయితే తాజా నిబంధనల ప్రకారం ఇకపై గ్రామాల్లో స్థలాలను కూడా రిజిస్ర్టేషన్‌ చేయరు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని పలువురు కోరుతున్నారు. 


22(ఈ)లో చేర్చకుండానే ఆపేయొచ్చా!

రిజిస్ర్టేషన్ల చట్టం ప్రకారం ఆస్తుల రిజిస్ర్టేషన్‌పై రిజిస్ర్టేషన్ల శాఖకు ఉన్న అధికారాలు అపరిమితం కాదు. ఏయే ఆస్తులను రిజిస్ర్టేషన్‌ చేయకూడదన్న అంశంపై సెక్షన్‌ 22 కింద ప్రొహిబిషన్‌ జాబితా రూపొందిస్తారు. అందులో ప్రభుత్వ భూములు, దేవదాయ భూములు, అసైన్డ్‌, వక్ఫ్‌ భూములు వంటివి ఉంటాయి. ఇవి కాకుండా ఇతరత్రా స్థలాలు, ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చాలంటే సెక్షన్‌ 22(ఈ)లో చేర్చడంతో పాటు గెజిట్‌లో ప్రకటించాలి. అలా ప్రకటించకుండానే రిజిస్ర్టేషన్లు నిషేధించే అధికారం రిజిస్ర్టేషన్ల శాఖకు లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లక్షలాది మంది ప్రజలకు సంబంధించిన ఈ విషయంలో గందరగోళం సృష్టించకుండా... అప్పటికే రిజిస్ర్టేషన్లు అయినవాటిని, గ్రామాల్లో ఉన్న స్థలాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులు ఇవ్వాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. 


రియల్‌ ఎస్టేట్‌లో విభిన్న చర్చలు 

తాజా ఉత్తర్వులతో రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో పాటు ప్రభుత్వానికి రావలసిన ఆదాయం కూడా పడిపోయింది. దీంతో రిజిస్ట్రేషన్ల నిషేధంపై పునరాలోచన చేస్తారా లేక కచ్చితంగా కొనసాగిస్తారా అని చర్చలు జరుగుతున్నాయి. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై ప్రభుత్వం పట్టుదలగా ఉండటంతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఒక్కసారిగా ఊపందుకుంది. ప్రతిపాదిత కొత్త జిల్లా కేంద్రాలకు 10నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో భూముల ధరలు భగ్గుమంటున్నాయి. ఆదాయం పెంచుకునేందుకు దీన్ని అవకాశంగా తీసుకుని స్థలాల రిజిస్ట్రేషన్‌ విషయంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించడానికే ఎక్కువ అవకాశాలున్నట్లు రియల్‌ వ్యాపారులు పేర్కొంటున్నారు. దీనిపై త్వరలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయనుందని అంటున్నారు. మరోవైపు రియల్‌ ఎస్టేట్‌ ఊపుతో వ్యవసాయ భూముల ధరలు నాలుగింతలు పెరిగిపోవడాన్ని కూడా సొమ్ము చేసుకునేందుకు అనువుగా రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. 

Updated Date - 2022-02-20T07:48:09+05:30 IST