సచివాలయాల్లో రిజిస్ర్టేషన్లు..!

ABN , First Publish Date - 2021-09-16T05:41:34+05:30 IST

ఇప్పటి వరకు రిజిస్ట్రార్‌ కార్యాలయాలకే పరిమితమైన రిజిస్ట్రేషన్‌ సేవలు ఇకపై గ్రామ,వార్డు సచివాలయా ల్లోనూ అందుబాటులోకి రానున్నాయి.

సచివాలయాల్లో రిజిస్ర్టేషన్లు..!

కసరత్తు ప్రారంభించిన అధికారులు

కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్లకు శిక్షణ

జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌–3గా గుర్తింపు

సాంకేతిక సమస్యల మాటేంటి ?

సాధ్యమేనా..? వెంటాడుతున్న అనుమానాలు


ఏలూరు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):

ఇప్పటి వరకు రిజిస్ట్రార్‌ కార్యాలయాలకే పరిమితమైన రిజిస్ట్రేషన్‌ సేవలు ఇకపై గ్రామ,వార్డు సచివాలయా ల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఆస్తుల క్రయ విక్రయాలు గ్రామాలకూ చేరువ కానున్నాయి. జిల్లాలో ఇప్పటికే దీనిపై కసరత్తు జరుగుతోంది. జిల్లాలోని అన్ని సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నా ఇది ఎంతవరకు సాధ్యమవుతుందన్నదే ఇప్పుడు ప్రశ్నగా నిలుస్తోంది.


రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇకపై సులభతరం కానుందా..? లేక క్లిష్టంగా.. గందరగోళంగా మారనుందా.. అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రతి మండలం లోని ఒక సచివాలయంలో రిజిస్ట్రేషన్‌ సేవలు అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి సిబ్బందికి శిక్షణ  కార్యక్రమాన్ని జిల్లా అధికారులు చేపట్టారు. జిల్లాలో తాజాగా రెండో దశ శిక్షణ మొదలైంది. డివిజన్‌కు నలుగురు చొప్పున ఉద్యోగులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తున్నారు. తొలిదశ శిక్షణలో భాగంగా రెండు నెలల క్రితమే భీమవరం జిల్లా కార్యాలయ పరిధిలోని ఉండి మండలం పెదపుల్లేరు గ్రామ సచివాలయాలకు చెందిన కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్లకు 45 రోజుల శిక్షణ అందించారు.మలిదశ శిక్షణలో భాగంగా ఏలూరు జిల్లా కార్యాలయ పరిధిలోని మూడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 4 సచివాలయాల సిబ్బంది శిక్షణ తీసు కుంటున్నారు. ఈ మేరకు వేగేశ్వరపురం సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయ పరిధిలో ఇద్దరు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరులలో ఒక్కొక్కరు చొప్పున సచివాలయ ఉద్యోగులు శిక్షణ తీసుకుంటున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత సచివాలయ సిబ్బందికి వీరు శిక్షణ ఇస్తారు. ఎంపిక చేసిన సచివాలయ కార్యదర్శులు, డిజిటల్‌ అసిస్టెంట్లకు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌– 3గా గుర్తింపునిస్తున్నారు.  


సాధ్యాసాధ్యాలపై అనుమానాలు 

ఎన్‌ఐసీ, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల సిబ్బంది వీరికి 45 రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు. అందులో భాగంగా వివాహ నమోదు, ఫర్మ్‌ రిజిస్ర్టేషన్‌, తనఖా రిజిస్ట్రేషన్లు, బాండ్లు, డాక్యుమెంటు రిజిస్ట్రేషన్‌, ఈసీ తీయడం, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలపై అవగాహన కల్పించారు. శిక్షణ అనంతరం ఈ ఆరు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. కేవలం 45 రోజుల్లో శిక్షణతో అత్యంత సంక్లిష్టమైన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సాధ్యమవుతుందా అన్నదే ప్రశ్న. ఒక స్థలం, ఆస్తి, ఎవరిది, దాని స్వభావం ఏమిటి వంటి అంశాలపై ఎలాంటి అవగాహన లేని సచివాలయ సిబ్బంది పరిష్క రించగ లుగుతారా ? అత్యంత సుశిక్షితులైన సబ్‌ రిజిస్ట్రార్లు కూడా రిజిస్ట్రేషన్‌ శాఖ లోని చిక్కుముడులతో సతమతమవుతూ ఉంటే, ఆస్తులు చేతులు మారడం, స్వభావం మారడం, నాన్‌ లేఅవుట్లు లే అవుట్లుగా మారడం, డబుల్‌ రిజిస్ట్రేషన్లు, నకిలీ డాక్యుమెంట్లు వంటి సవాలక్ష సమస్యలు ఉండగా వీటిని సచివాలయ సిబ్బంది పసిగట్టగలరా ? పరిష్కరించగలరా ? వంటి ప్రశ్నలు అందరినీ వెంటాడుతున్నాయి. 


ముందుగా మండలంలో ఒక్కటైనా..

సచివాలయాల సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు కావాల్సిన సిబ్బందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అందుకోసం డివిజన్‌కు నలు గురు చొప్పున శిక్షకులను ఎంపిక చేసి వారిని బాపట్ల లోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి శిక్షణ నిమిత్తం పంపనున్నారు. వీరికి ఆరు నెలల పాటు అక్కడ శిక్షణ ఇస్తారు.  శిక్షణ పూర్తయిన అనంతరం వీరు సచివాలయాల కార్యదర్శులు, డిజిటల్‌ అసిస్టెంటకు శిక్షణ ఇస్తారు. జిల్లాలోని అన్ని సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నా, ముందుగా జిల్లాలోని ప్రతి మండలానికి ఒక సచివాలయంలోనైనా రిజిస్ట్రేషన్‌ సేవలు అందు బాటులోకి వచ్చేలా చేయాలన్న లక్ష్యంతో ఈ శిక్షణ ఇప్పించనున్నట్టు అధికారులు తెలిపారు.


శిక్షణ తరువాతే నిర్ణయం : జేసీ శుక్లా

ప్రతి సచివాలయంలో రిజిస్ట్రేషన్‌ సేవలు అందు బాటులోకి తేవాలన్నది ప్రభుత్వ నిర్ణయం. ఆ నిర్ణ యాన్ని అమలు చేయడంలో భాగంగా ఇప్పుడు శిక్షణ నిర్వహిస్తున్నాం. శిక్షణ పూర్తయిన తర్వాత మిగిలిన అంశాల గురించి కూలంకషంగా పరిశీలిస్తాం. తొలి దశలో మండలానికి ఒక సచివాలయంలోనైనా సేవలు అందుబాటులోకి తేవాలన్నది మా ప్రయత్నం.  


Updated Date - 2021-09-16T05:41:34+05:30 IST