జిల్లాలో రిజిస్ర్టేషన్‌లు అంతంతే!

ABN , First Publish Date - 2021-04-17T06:09:42+05:30 IST

జిల్లాలో భూముల రిజిస్ర్టేషన్‌లపై కరోనా ప్రభావం పడింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో రిజిస్ర్టేషన్‌లు తగ్గుతున్నాయి. కరోనా కేసులు కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి వస్తుండడంతో భూములు కొన్నవారు కూడా రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను వాయిదా వేస్తున్నారు. గత నెలతో పోలిస్తే ఈ నెలలో

జిల్లాలో రిజిస్ర్టేషన్‌లు అంతంతే!
నిజామాబాద్‌ జిల్లాకేంద్రంలోని రిజిస్ర్టార్‌ ఆఫీస్‌

రిజిస్ట్రేషన్‌లపై కరోనా మహమ్మారి ప్రభావం

జిల్లాలో అంతంతగానే వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ

ఏప్రిల్‌ నెలలో ప్రభుత్వానికి భారీగా తగ్గిన ఆదాయం

గతంలో రోజుకు 250 నుంచి 300 వరకు రిజిస్ట్రేషన్‌లు

ఇప్పటికీ  సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో డాక్యూమెంట్‌ రైటర్‌లదే హవా

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో భూముల రిజిస్ర్టేషన్‌లపై కరోనా ప్రభావం పడింది. కరోనా కేసులు పెరుగుతుండడంతో రిజిస్ర్టేషన్‌లు తగ్గుతున్నాయి. కరోనా కేసులు కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి వస్తుండడంతో భూములు కొన్నవారు కూడా రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను వాయిదా వేస్తున్నారు. గత నెలతో పోలిస్తే ఈ నెలలో భారీగా రిజిస్ర్టేషన్‌లు తగ్గాయి. వ్యవసాయ భూములతో పాటు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ర్టేషన్‌లు తగ్గాయి. జిల్లాలో కరోనా కేసులు నెలన్నర నుంచి భారీగా పెరుగుతుండడంతో ఆ ప్రభావం ఇతర రంగాలపై పడుతోంది. కరోనా వల్ల ఈ నెల ఆరంభం నుంచి రిజిస్ర్టేషన్‌లు తగ్గాయి. జిల్లాలో గత ఆరు నెలలుగా వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్‌లు ధరణి ద్వారా చేస్తుండగా.. ఇళ్లు, ఇతర ఆస్తులను సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో చేస్తున్నారు. వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్లు జిల్లా పరిధిలోని అన్ని తహసీల్దార్‌ కార్యాలయాలలో చేస్తున్నారు. గత అక్టోబర్‌ నుంచి మార్చి చివరి వరకు ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్‌లు జోరుగా సాగాయి. ప్రతి తహసీల్దార్‌ కార్యాలయంలో రోజు 5నుంచి 20 వరకు డాక్యూమెంట్‌లు రిజిస్ర్టేషన్లు అయ్యాయి. వ్యవసాయ భూములు కొన్నవారికి ఒక్కరోజులోనే రిజిస్ర్టేషన్‌లు పూర్తయ్యాయి.

ఈనెల ఆరంభం నుంచి తగ్గుముఖం

ఏప్రిల్‌ ఆరంభం నుంచి కరోనా కేసులు బాగా పెరగడం, ఉద్యోగులు కేసుల బారీన పడడంతో ఎక్కువ రిజిస్ర్టేషన్లు కావడంలేదు. ప్రతి తహసీల్దార్‌ కార్యాలయంలో రోజు 2నుంచి 10లోపే ఉంటున్నాయి. గతంలో 15 వరకు అయిన రిజిస్ర్టేషన్లు.. తహసీల్దార్‌లు కార్యాలయాలలో కూడా ఇప్పుడు బాగా తగ్గాయి. ఎక్కువ మంది కేసుల బారీన పడడం వల్ల ధరణి ద్వారా జిల్లాలో రిజిస్ర్టేషన్లు తగ్గాయి. అమ్మినవారు కరోనా బారీన పడడం వల్ల కూడా వాయిదా వేసుకోవడం రిజిస్ర్టేషన్లు తగ్గినట్లు తహసీల్దార్‌లు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో వ్యవసాయేత ఆస్తుల రిజిస్ర్టేషన్‌లు కూడా బాగా తగ్గాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం పది సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలోనే ఎక్కువగా రిజిస్ర్టేషన్‌లు జరుగుతాయి. కరోనా ప్రభావంతో పనిచేస్తున్న ఉద్యోగులు డాక్యూమెంట్‌ రైటర్‌లకు కేసులు రావడంతో పది రోజుల క్రితం మూతపడిన నిజామాబాద్‌ అర్బన్‌ సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం గురువారం తెరుచుకోగా, శుక్రవారం కార్యక్రమాలను ప్రారంభించింది. 

గతంలో 250నుంచి 300 రిజిస్ట్రేషన్లు

ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంతో పాటు నిజామాబాద్‌ రూరల్‌, బోధన్‌, ఆర్మూర్‌, కామారెడ్డి రిజిస్ర్టార్‌ కార్యాలయాలలో ఎక్కువగా డాక్యూమెంట్‌ల రిజిస్ర్టేషన్లు జరుగుతాయి. బీంగల్‌, దోమకొండ, బిచ్కుంద, బాన్సూవాడ, ఎల్లారెడ్డి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో తక్కువగా జరుగుతాయి. ఈ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలలో ఏప్రిల్‌కు ముందు ప్రతీరోజు 250నుంచి 300 వరకు డాక్యూమెంట్‌లు ఉమ్మడి జిల్లా పరిధిలో రిజిస్ర్టేషన్‌ అయ్యేవి. ప్రభుత్వానికి ప్రతీరోజు రూ.30నుంచి రూ.40లక్షల ఆదాయం వచ్చేది. ప్రతీనెల సగటున రూ.7 నుంచి 10 కోట్ల వరకు రిజిస్ర్టేషన్‌ రూపేణా ప్రభుత్వానికి చేరేది. ఏన్రిల్‌ ఆరంభం నుంచి కేసులు భారీగా పెరగడంతో ఆ ప్రభావం రిజిస్ర్టేషన్‌లపై పడింది. ప్రస్తుతం ప్రతీరోజు ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలు కలిపి 170 నుంచి 230 వరకు డాక్యూమెంట్‌లు రిజిస్ర్టేషన్‌లు అవుతున్నాయి. అన్ని కార్యాలయాల పరిధిలో సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులకో లేదా డాక్యూమెంట్‌ రైటర్‌లకో కరోనా బారీన పడుతుండడంతో ఆ ప్రభావం రిజిస్ర్టేషన్లపై పడుతుంది. నిజామాబాద్‌ అర్బన్‌ సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న 8 మంది ఉద్యోగులు, 15 మంది వరకు డాక్యూమెంట్‌ రైటర్‌లు కరోనా బారీన పడడంతో పది రోజులపాటు నిలిపివేశారు. ఈ కార్యాలయాలలో కరోనా నియంత్రణ మొదట్లో ప్రారంభించకపోవడం వల్ల కేసులు పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అన్ని కార్యాలయాలల్లో కరోనా కట్టడి చేస్తు రిజిస్ర్టేషన్‌లు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కొంత తగ్గినా మళ్లీ కరోనా తగ్గగానే రిజిస్ర్టేషన్‌లు పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికీ డాక్యుమెంట్‌ రైటర్‌లదే హవా

సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలలో అన్ని రిజిస్ర్టేషన్‌లు ఆన్‌లైన్‌లో జరుగుతున్నా.. ఇప్పటికీ డాక్యుమెంట్‌ రైటర్‌లదే హవా కొనసాగుతోంది. వారు తీసుకువచ్చిన డాక్యూమెంట్‌నే త్వరగా చేస్తున్నారు. ఎవరైనా నేరుగా ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకుని వచ్చిన పలు డాక్యుమెంట్‌లు అడుగుతుండడంతో తప్పనిసరి పరిస్థితిలలో ఇళ్లు, వ్యవసాయేతర ఆస్తులను కొన్నవారు సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలలో డాక్యూమెంట్‌ రైటర్‌ల ద్వారానే రిజిస్ర్టేషన్‌ లు చేస్తున్నారు. ప్రతీ డాక్యూమెంట్‌కు ఇంత అన్ని కమీషన్‌ వసూలు చేస్తున్న వారు కొంతమొత్తం ఉద్యోగులకు ఇస్తుండడంతో ఈ వ్యవస్థ ఇంకా అనధికారికంగా కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయాలలో కొంతమేర రిజిస్ర్టేషన్‌లు తగ్గాయని జిల్లా రిజిస్ర్టార్‌ రవీంధర్‌రావు తెలిపారు. కరోనా ప్రభావంతో ఇవి తగ్గాయని భావిస్తున్నామని ఆయన తెలిపారు. కార్యాలయాలలో అన్ని కరోనా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని, కరోనా ప్రభావం తగ్గగానే మళ్లీ రిజేస్ర్టేషన్‌ల ప్రక్రియ పుంజుకుంటుందని అధికారి పేర్కొన్నారు.

Updated Date - 2021-04-17T06:09:42+05:30 IST