ప్రభుత్వ భూమికి రిజిస్ట్రేషన్లు

ABN , First Publish Date - 2021-10-26T07:46:47+05:30 IST

ఇటీవలే మదనపల్లెలో ప్రభుత్వ భూమి పరాధీనమైన వ్యవహారంలో తొమ్మిదిమంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది సహా మొత్తం 15 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదైన నేపధ్యంలో ఈనెల 6వ తేదీన రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ హరినారాయణన్‌ చేసిన హెచ్చరిక ఇది!

ప్రభుత్వ భూమికి రిజిస్ట్రేషన్లు

కొందరు తహసీల్దార్లు నిబంధనలు పాటించకుండా రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్లు చేసి ఆ వెంటనే డిజిటల్‌ కీని రివోక్‌ చేసేస్తున్నారు... ఖచ్చితంగా ఇవన్నీ నేరాలని మీ అందరికీ చెబుతున్నా... మీరు కావాలనే భూములపై లిటిగేషన్‌ సృష్టిస్తున్నారు... దీనివల్ల పేదలు ఇబ్బంది పడుతున్నారు... ఇకపై ఎవరైనా స్పందనకు వచ్చి తమ భూమిని మ్యుటేషన్‌తో మార్చారని ఫిర్యాదు చేస్తే మాత్రం కారకులైన తహసీల్దార్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తా..... 

ఇటీవలే మదనపల్లెలో ప్రభుత్వ భూమి పరాధీనమైన వ్యవహారంలో తొమ్మిదిమంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది సహా మొత్తం 15 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదైన నేపధ్యంలో ఈనెల 6వ తేదీన రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ హరినారాయణన్‌ చేసిన హెచ్చరిక ఇది! అయితే ఉన్నతాధికారుల హెచ్చరికలను, క్రిమినల్‌ చర్యలను కిందిస్థాయి రెవిన్యూ అధికారులు, ఉద్యోగులూ ఖాతరు చేయడం లేదు. తాజాగా మదనపల్లె మండలం బసినికొండ రెవెన్యూ గ్రామంలో వెలుగుచూసిన మరో భూదందాయే దీనికి నిదర్శనం!! 

మదనపల్లె, అక్టోబరు 25: మదనపల్లె మండలం బసినికొండ రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు .235-2, 235-3లలో మొత్తం 6.15 ఎకరాల భూమి వుంది. ఇది ప్రభుత్వ భూమి. ఇందులో 60 సెంట్లు బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి కేటాయించగా ప్రభుత్వ భూమి కనుక పరిహారం కూడా ఎవరికీ చెల్లించలేదు. ఇది పోనూ 235-2 సర్వే నెంబరులో 3.50 ఎకరాలు, సర్వే నెంబరు 235-3లో 2.05 ఎకరాల చొప్పున మొత్తం 5.55 ఎకరాల భూమి మిగిలి వుంది. బైపాస్‌ రోడ్డు పక్కన వుండడంతో బహిరంగ మార్కెట్‌లో ఎకరా రూ. 3 కోట్లు పలుకుతోంది. భూముల విలువ పెరగడంతో అందరి దృష్టీ వీటిపై పడింది. ఆ క్రమంలో సర్వే నెంబరు 235-3లోని 2.05 ఎకరాల భూమి మదనపల్లె మండలం కొండామరిపల్లెకు చెందిన రామాపురం వెంకటమ్మ అనే మహిళ పేరిట రికార్డుల్లో మ్యుటేషన్లు జరిగాయి. ఆమె భర్త నరసింహులు పేరిట ఆ భూమిపై  ప్రభుత్వం 1981లో డీకేటీ పట్టా ఇచ్చినట్టు, భర్త మరణించినందున రికార్డుల్లో భూమిని భార్య వెంకటమ్మ పేరిట మార్చినట్టు రికార్డుల్లో పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్‌ఐ రెడ్డెప్ప, తహసీల్దార్‌ ఇ.జి.కుప్పుస్వామి వన్‌బీలో మ్యుటేషన్‌ చేసినట్టు రికార్డుల్లో నమోదై వుంది. ఆ సందర్భంగా పట్టాదారుకు భూమి ఎలా దక్కిందనే కాలమ్‌లో డీకేటీ పట్టా అని పేర్కొన డానికి బదులు అనువంశీకంగా పేర్కొన్నారు. ఈ మ్యుటేషన్ల ఆధారంగా మరుసటి నెలలోనే అంటే మార్చి 3న వెంకటమ్మ తన పేరిట వున్న భూమిలో ఇద్దరు కుమార్తెలకు 35 సెంట్లు చొప్పున 70 సెంట్ల భూమిని దానవిక్రయం కింద రిజిస్ర్టేషన్‌ చేసిచ్చారు. మదనపల్లె సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో డాక్యుమెంట్‌ నెంబర్లు 2344, 2345 పేరిట ఆ రిజిస్ట్రేషన్లు జరిగాయి. అలాగే మదనపల్లె పట్టణం చీకలిగుట్ట శివాజీనగర్‌కు చెందిన కొమ్ము చిన్నరెడ్డెప్ప పేరిట బసినికొండ సర్వే నెం.235-2లో 3.50 ఎకరాలు డీకేటీ పట్టా వున్నట్టు చిత్రీకరించి ఆ భూమిని చిన్నరెడ్డెప్ప, అతని తండ్రి పెద్దరెడ్డెప్ప నడుమ భాగపరిష్కారాలు చేసుకున్నట్టు డాక్యుమెంట్లు సృష్టించుకున్నారు.స్థానిక సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో ఈ ఏడాది మార్చి 17న భాగపరిష్కార దస్తావేజును డాక్యుమెంట్‌ నెంబరు 7571 పేరిట రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. తండ్రి పెద్దరెడ్డెప్ప భాగానికి వచ్చిన భూమిని ప్లాట్లుగా చేసి పలువురికి విక్రయించారు. ఉదాహరణకు గత నెల 13న గుడిపాల మండలం శ్రీరంగంపల్లెకు చెందిన కె.తులసమ్మకు డాక్యుమెంట్‌ నెంబరు 7888 ద్వారా, అనంతపురం జిల్లా తనకల్లు మండలం కనసానివారిపల్లెకు చెందిన చిన్నమండ్యం సోమశేఖర్‌రెడ్డికి డాక్యుమెంట్‌ నెంబరు 7889 ద్వారా, నిమ్మనపల్లె మండలం పూలవాండ్లపల్లెకు చెందిన కె.ప్రవీణ్‌కు డాక్యుమెంట్‌ నెంబరు 7907 ద్వారా ప్లాట్ల విక్రయ రిజిస్ట్రేషన్లు జరిగాయి. గత నెల 20న పట్టణంలోని గౌతమీనగర్‌కు చెందిన కె.ప్రమీలకు డాక్యుమెంట్‌ నెంబరు 8214 ద్వారా విక్రయ రిజిస్ట్రేషన్‌ జరిగింది. ఈ విధంగా రెవిన్యూ రికార్డుల్లో ప్రభుత్వానిదిగా వున్న భూమి తొలుత డీకేటీ పట్టాలుగా, తర్వాత అనువంశిక భూములుగా మారిపోయి చివరికి రిజిస్ట్రేషన్ల ద్వారా పరుల పాలవుతున్నాయి. 

వెలుగు చూసిందిలా....

ప్రభుత్వ భూమి రెవెన్యూ అధికారుల సహకారంతో పరులపాలైన వ్యవహారం వారిలో వారు తగాదా పడడంతో వెలుగు చూసింది. డీకేటీ పట్టాదారులుగా చెలామణి అవుతున్న రామాపురం వెంకటమ్మ, కొమ్ము చిన్న రెడ్డెప్ప భూమి హద్దుల విషయంలో తగాదా పడ్డారు. ఫలితంగా ప్రస్తుత రెవిన్యూ ఽఅధికారుల దృష్టికి వెళ్ళింది. ఆరా తీయడంతో గతంలో ఽరెవిన్యూ అధికారులు, ఉద్యోగులు భారీ మొత్తంలో లబ్ధి పొంది రికార్డుల్లో చేసిన అక్రమ మ్యుటేషన్లు వెలుగు చూశాయి. దీంతో అప్రమత్తమైన ప్రస్తుత అధికారులు ప్రభుత్వ భూమి పట్టా భూమిగా మారడానికి కారణమైన డిజిటల్‌ కీని తీసేసి, వివాదానికి తెరదించారు. ఇంతవరకూ బాగానే వున్నా రూ. లక్షలు పోసి రిజిస్ట్రేషన్ల ద్వారా భూమి కొనుగోలు చేసిన వారు ఇపుడు లబోదిబోమంటున్నారు. అయితే ఇంతటితో వివాదం సద్దుమణిగితే పర్వాలేదు. కానీ ప్రభుత్వ భూములు కాజేయాలనుకున్న వారు, దానికోసం భారీ మొత్తాలు ఖర్చు చేసి రెవిన్యూ అధికారులను, ఉద్యోగులను ప్రలోభపెట్టి రికార్డుల్లో మ్యుటేషన్లు చేయించుకున్నవారు చేతులు ముడుచుకుని కూర్చునే పరిస్థితి లేదు. తమవద్ద వున్న పత్రాలతో న్యాయస్థానాలను ఆశ్రయించడం, స్టే ఉత్తర్వులు తెచ్చుకుని ఏళ్ళ తరబడీ కేసులు సాగదీయడం జరుగుతోంది. ఆలోపు ప్రభుత్వ భూములు పలువురి చేతులు మారిపోయి చివరికి పూర్తిగా అన్యాక్రాంతమైపోతున్నాయి. ఈ తరహా ఘటనలు వెలుగు చూసినపుడు వారికి డీకేటీ పట్టాలు ఎలా వచ్చాయో విచారించాల్సివుంది. నకిలీవని తేలితే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాల్సివుంది. ఒకవేళ డీకేటీ పట్టాలు నిజమే అయినా ఇతరులకు విక్రయించడానికి వీల్లేదు కాబట్టి ఆ ఉల్లంఘనపై కూడా క్రిమినల్‌ కేసులు పెట్టాల్సివుంది. అక్రమంగా రికార్డుల్లో మ్యుటేషన్లు చేసిన రెవిన్యూ సిబ్బందిని కూడా గుర్తించి వారిపైనా క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సివుంది. అలా చేసినప్పుడే ప్రభుత్వ భూముల జోలికి రావడానికి అక్రమార్కులు భయపడే పరిస్థితి వుంటుంది.


ఇది ప్రభుత్వ భూమే!

బసినికొండ రెవిన్యూ గ్రామం సర్వే నెంబర్లు 235-2, 3లలోని 5.55 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని మదనపల్లె తహసిల్దారు సీకే శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఈ విషయమై ఆంధ్రజ్యోతి ఆయన్ను వివరణ కోరగా భూమి ప్రభుత్వానిదేనని, అందులో ఎలాంటి వివాదానికీ తావు లేదన్నారు. గతంలో కొందరి పేరిట ఆన్‌లైన్‌లో నమోదు చేశారని, వాటి ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరిగాయని తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2021-10-26T07:46:47+05:30 IST