మునిగిపోతున్నాం.. పునరావాసమేదీ?

ABN , First Publish Date - 2020-07-14T10:31:22+05:30 IST

రిజర్వాయర్‌ కోసం భూములు, ఇళ్లు వదులుకున్నా నేటికీ పునరావాసం కల్పించలేదని, నేడో రేపో నీటిని విడుదల

మునిగిపోతున్నాం.. పునరావాసమేదీ?

యాదాద్రి, జూలై13(ఆంధ్రజ్యోతి): రిజర్వాయర్‌ కోసం భూములు, ఇళ్లు వదులుకున్నా నేటికీ పునరావాసం కల్పించలేదని, నేడో రేపో నీటిని విడుదల చేస్తే తమ పరిస్థితి ఏంటని యాదా ద్రి జిల్లా బస్వాపూర్‌ రిజర్వాయర్‌ ముంపు గ్రామల ప్రజలు సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. పునరావాసంపై స్పష్టమైన హామీ ఇవ్వాలని హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిని దిగ్బంధించారు.


మూడు గంటల పాటు సాగిన ఈ ఆందోళనలతో రహదారికి ఇరువైపులా నాలుగు కిలోమీటర్లమేర ట్రాఫిక్‌ స్తంభించింది. కాళేశ్వరం ప్రాజెక్టు 16వ ప్యాకేజీలో బస్వాపూర్‌ వద్ద 11.39టీఎంసీల సామర్ధ్యంతో రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టారు. దీంతో భువనగిరి మండలం బీఎన్‌.తిమ్మాపూర్‌ గ్రామం ముంపునకు గురవుతోంది. 2,500 మంది ఉన్న ఈ గ్రామంలో 560 గృహాలు, ఇతర నిర్మాణాలు ముంపు ప్రాంతంలో ఉన్నాయి. వీటితోపాటు వేల ఎకరాల భూములను ప్రభుత్వం సేకరించింది. రిజర్వాయర్‌ నిర్మాణం తుది దశకు చేర గా, రేపో మాపో 1.50 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. బీఎన్‌.తిమ్మాపూర్‌ గ్రామస్థులకు పునరావాసం కోసం మూడు ప్రాంతాలు వడపర్తి, హుస్సేనాబాద్‌, ముత్తిరెడ్డిగూడెంలోని ప్రభుత్వ స్థలాలను అధికారులు ప్రతిపాదించారు.


ఇప్పటి వరకు ఎక్కడ పునరావాసం కల్పిస్తారో స్పష్టత లేదు. రిజర్వాయర్‌ నిర్మాణం ప్రారంభమై నాలుగేళ్లు కాగా, ముం పు కారణంగా ఆర్థికంగా, మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నామని, కనీసం పిల్లలకు పెళ్లిళ్లు చేయలేని పరిస్థితులు ఉన్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పునరావాసంపై స్పష్టత ఇవ్వాలని, నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ స్వయం సహాయక మహిళా సంఘం ఆధ్వర్యం లో గ్రామస్థులు మూకుమ్మడిగా కదిలివచ్చి కలెక్టరేట్‌ను ముట్టడించారు. గంట పాటు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేశారు.


కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌, అదనపు కలెక్టర్‌ జి.రమేష్‌ సెలవులో ఉండటంతో సమస్యను పరిష్కరిస్తామని మరో అదన పు కలెక్టర్‌ కిమ్యానాయక్‌ హామీ ఇచ్చారు. అందుకు బాధితులు ససేమిరా అంటూ కలెక్టర్‌ వెంటనే వచ్చి హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. అనంతరం హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారి పై మూడు గంటల పాటు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా ఉడుత మణికంఠ అనే యువకుడు పెట్రోల్‌ను ఒంటిపై పోసుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. బాధితులతో అదనపు కలెక్టర్‌ కిమ్యా నాయక్‌, భువనగిరి ఏసీపీ భుజంగరావు గంటపాటు చర్చించి పునరావాసంపై కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కారం చూపుతామని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.


ఆందోళనలో ఎంపీటీసీ సభ్యురాలు ఉడుత శారద అంజనేయు లు,సర్పంచ్‌ పిన్నం లతరాజు, ఉపసర్పంచ్‌ ఎడ్లదర్శన్‌రెడ్డి, సంఘ బంధం అధ్యక్షురాలు ఉడుత కవిత, మాజీ ఎంపీటీసీ జిన్న మల్లేశం, మాజీ సర్పంచ్‌ రావుల అనురాధ నందు, మోర నర్సిరెడ్డి, పిన్నం జహంగీర్‌, రాజు, రావుల రాజు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-14T10:31:22+05:30 IST