
అతను ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. చిన్ననాటి స్నేహితురాలతో ముచ్చటగా మూడో పెళ్లికి సిద్ధమయ్యాడు.. ఆ పెళ్లికి రెండో భార్య అడ్డువస్తుండడంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు.. ప్రేయసితో కలిసి ఆమెను దారుణంగా హతమార్చాడు.. ఆమె గొంతు కోసి చంపేసి మొండెం నుంచి తల వేరు చేశాడు.. అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే కాల్చేశాడు.. ఆ కార్యక్రమం కోసం ప్రేయసితో కలిసి ముందుగా రిహార్సల్ కూడా వేశాడు.. చివరకు పోలీసులకు దొరికిపోయాడు.
ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాకు చెందిన తేజ్‌రామ్ అనే వ్యక్తి 2009లో మొదటి వివాహం చేసుకున్నాడు. మూడేళ్లకే ఆమెకు విడాకులు ఇచ్చి 2014లో ఇంద్రాణి అనే మహిళను ప్రేమ వివాహం చేసుకున్నాడు. రెండేళ్ల క్రితం పూర్ణిమ అనే తన చిన్ననాటి స్నేహితురాలితో ప్రేమలో పడ్డాడు. అప్పటికే ముగ్గురు పిల్లలకు తల్లి అయిన పూర్ణిమ భర్త నుంచి విడిపోయింది. పూర్ణిమను పెళ్లి చేసుకునేందుకు ఇంద్రాణికి తేజ్‌రామ్ విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే విడాకులు ఇచ్చేందుకు ఇంద్రాణి అంగీకరించలేదు.
భార్యను హతమార్చేందుకు ప్రియురాలితో కలిసి తేజ్‌రామ్ స్కెచ్ వేశాడు. పక్కాగా రిహార్సల్స్ వేసుకుని గురువారం రాత్రి హత్యకు పాల్పడ్డారు. ఇంట్లోకి ప్రవేశించి ఇంద్రాణి గొంతు కోసి చంపేశారు. ఆమె బతికే ఉందేమో అనే అనుమానంతో ఆమె మొండెం నుంచి తల వేరు చేశారు. అనంతరం పెరట్లో కట్టెల మధ్య ఆమె శరీరాన్ని ఉంచి తగలబెట్టేశారు. అయితే మృతదేహం పూర్తిగా కాలకపోవడంతో చుట్టుపక్కల వారికి దొరికిపోయారు. వారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు తేజ్రామ్ను, పూర్ణిమను అరెస్ట్ చేశారు.