పదిలక్షల ప్రస్థానం

ABN , First Publish Date - 2020-07-18T05:48:52+05:30 IST

ఇరవయ్యొకటో శతాబ్దిలో మానవాళి పాలిట దాపురించిన మొదటి, అతి పెద్ద ఉపద్రవం కరోనా వైరస్‌. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి సుమారుగా కోటీ నలభై లక్షల మందికి సోకి, ఆరులక్షల మందిని...

పదిలక్షల ప్రస్థానం

ఇరవయ్యొకటో శతాబ్దిలో మానవాళి పాలిట దాపురించిన మొదటి, అతి పెద్ద ఉపద్రవం కరోనా వైరస్‌. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి సుమారుగా కోటీ నలభై లక్షల మందికి సోకి, ఆరులక్షల మందిని పొట్టన పెట్టుకున్నది. ఈ వైరస్‌ జైత్రయాత్ర అప్రతిహతంగా సాగుతూనే ఉన్నది తప్ప మందగించడం లేదు. దీనికి నివారణ, నిదానం ఎప్పుడు అందుతుందో చెప్పలేని పరిస్థితి. జీవనవిధానాలను, జీవనాధార వ్యవస్థలను, ఆర్థికాది రంగాలను కొవిడ్‌–19 వ్యాధి తీవ్రంగా దెబ్బతీసింది. మనుషుల సంచారాన్ని, సామూహికతను నియంత్రించింది. పూర్తిగా స్తంభింపజేయడం దగ్గర నుంచి, మందకొడిగా మార్చడం దాకా మానవ కార్యకలాపాలన్నిటిని ప్రభావితం చేసింది. ఈ దశ ముగిసిన తరువాత కూడా, ఈ ప్రభావాలు కొనసాగుతాయి. పనిపద్ధతులు, చదువులు, సాంస్కృతిక అంశాలు.. సమస్తం మారిపోతాయి.. 


భారతదేశంలో మొట్టమొదటి కరోనా కేసు జనవరి 30 వ తేదీన కేరళలో నమోదైంది. అప్పుడు మొదలైన గణనం ఈ శుక్రవారం ఉదయానికి పదిలక్షలను దాటేసింది. ఈ ఐదున్నర నెలల కరోనా కాలంలో దేశంలో 25వేల మంది దాకా చనిపోయారు. చాలా దేశాలతో పోలిస్తే, భారతదేశంలో వ్యాప్తి, మరణాల రేటు తక్కువగా కనిపిస్తాయి. చాలా తొందరలోనే స్పందించి మార్చి మూడోవారంలోనే, దేశంలో కేసుల సంఖ్య కనీసం వెయ్యికి కూడా చేరకముందే, పూర్తి లాక్‌డౌన్‌ను విధించడం వ్యాప్తి నెమ్మదిగా జరగడానికి కారణమని చెబుతారు. అదే సమయంలో, తొలిరోజుల్లో చూపినంత చొరవను, వ్యూహ నిపుణతను భారతదేశ విధాన నిర్ణేతలు తరువాత కాలంలో చూపలేదన్న విమర్శలూ ఉన్నాయి. 


కొవిడ్‌ కేసుల సంఖ్య పదిలక్షలకు చేరడం సాంకేతికమేనని, కోలుకున్నవారిని మినహాయిస్తే, ప్రస్తుతం మూడున్నర లక్షల మంది వ్యాధి గ్రస్తులే చికిత్సలో ఉన్నారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ చెబుతున్నది. ఈ సంఖ్య భారతదేశ సామర్థ్యానికి లోబడే ఉన్నదని, వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్న వివిధ చర్యల వల్ల వ్యాధిసోకినవారి సంఖ్యను ఎప్పటికప్పుడు మితిమీరకుండా చూడగలుగుతున్నామని ఆ శాఖ వర్గాలు అంటున్నాయి. కట్టడి చర్యల విషయంలోనే, ముఖ్యంగా దీర్ఘకాలం లాక్‌డౌన్‌ తరువాతి ప్రస్తుత సడలింపుల దశలోని నియంత్రణల విషయంలో, వివిధ వర్గాలకు అసంతృప్తి ఉన్నది. దేశంలో కొవిడ్‌ కేసులు లక్ష సంఖ్యను చేరడానికి 110 రోజులు పడితే, ఆ తరువాతి 9 లక్షలు కేవలం 59 రోజుల్లో నమోదయ్యాయి. ఈ 59 రోజులు, లాక్‌డౌన్‌ సడలింపుల తరువాతివే అని వేరే చెప్పనక్కరలేదు. ప్రస్తుతం ప్రతిరోజూ కొత్తగా చేరుతున్న కేసుల సంఖ్య 28 వేలు, ఆ పైన ఉంటున్నది. ఈ వేగం ఇట్లాగే కొనసాగితే, త్వరలోనే భారతదేశం తీవ్రమైన ఉపద్రవంలో చిక్కుకుంటుందని గణాంక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 


భారతదేశం జనాభా 130 కోట్లు. ఆ జనాభాకు ఒక మిలియన్‌ కేసులు అన్నది పెద్ద విషయం కాదు– అన్న ఆశ్వాసన కూడా ఈ సందర్భంగా వినిపిస్తున్నది. మొత్తం జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే, అమెరికా, బ్రెజిల్‌ వంటి దేశాలలోని మరణాల రేటుకు మనకు పోలికే లేదు. ప్రతి మిలియన్‌కు కేసుల సంఖ్యను చూస్తే భారతదేశం 106 వ ర్యాంకులో ఉన్నది. భారత్‌లో ప్రతి పదిలక్షలకు 658 మందికి కరోనా సోకగా, అమెరికాలో దానికి 16రెట్లు, రష్యాలో 5 రెట్ల వ్యాప్తి ఉన్నది. మరణాలలో చూస్తే అమెరికాలో ప్రతి మిలియన్‌ జనాభాకు 392 మంది మరణిస్తుండగా, భారత్‌లో కేవలం 14.2 మాత్రమే చనిపోతున్నారు. జనాభా నిష్పత్తిని పరిగణించకపోతే, కేసుల సంఖ్య రీత్యా భారత్‌ ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్నది. మరణాల సంఖ్యలో ఎనిమిదో స్థానంలో ఉన్నది. 


గణాంకాలు భయపెట్టినట్టే, మభ్య పెడతాయి కూడా. భారతదేశంలో పరీక్షల సంఖ్యను, కేసుల సంఖ్యను, మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని అంతర్జాతీయంగా విమర్శలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా భారతదేశంలో చేయవలసినన్ని పరీక్షలు చేస్తే, కేసుల సంఖ్య పెరుగుతుందని, భవిష్యత్తులో ఇండియాలో కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా ఎదురయిన పరిస్థితిని ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్‌ కాలం తగిన వ్యవధిని, వెసులుబాటును ఇచ్చింది. 


ఇక ముందు, రోజుకు 30 వేలు, 50 వేలు, లక్ష చొప్పున కేసులు పెరిగే రోజు వచ్చినప్పుడు దేశంలోని ఆరోగ్య మౌలిక వసతుల వ్యవస్థ తట్టుకుంటుందా అన్నది ఆందోళనకరమైన ప్రశ్న. నిజానికి కఠినమైన కట్టడులు అవసరమైన సమయం ఇదే. గుడులు, హోటళ్లు, మాల్స్‌ అన్నీ తెరిచేస్తే , వైరస్‌ చేతులు కట్టుకుని ఉంటుందా– అని ప్రజారోగ్యవేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఒక స్పష్టమైన విధానం, కార్యాచరణ ప్రణాళిక, పారదర్శకత– ఇవి లేకుండా కరోనాను ఎదుర్కొనడం కష్టమన్నదే నిపుణులందరి అభిప్రాయం. ప్రపంచపు లెక్కలతో భారత్‌ లెక్కలు పోలిస్తే, అవాంఛనీయమైన ధీమా కలిగినట్టే, భారతదేశంలోని అనేక రాష్ట్రాల లెక్కలను చూసినప్పుడు తెలుగు రాష్ట్రాలకు కూడా ఉదాసీనతకు ఆస్కారం ఏర్పడుతుంది. అది మంచిది కాదు. వేగంగా వ్యాప్తి జరుగుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ ఇప్పటికే చేరింది. ఆ రాష్ట్రంలో రోజువారీ మరణాలు బెంబేలెత్తిస్తున్నాయి. తెలంగాణ ఇంకా పరీక్షల సంఖ్యను తగినంత పెంచకుండా దోబూచులాడుతున్నది. పరీక్షలకు భయపడితే, పర్యవసానాలకు ఎట్లా సిద్ధపడతారు?

Updated Date - 2020-07-18T05:48:52+05:30 IST