ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

ABN , First Publish Date - 2021-04-24T05:12:42+05:30 IST

సిద్దిపేట 43 వార్డులకు, గజ్వేల్‌ ఒక వార్డులో మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు.

ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

 ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే చర్యలు: సీపీ

 అభ్యర్థులకు సూచనలు చేసిన జోయల్‌ డేవిస్‌


సిద్దిపేట క్రైం, ఏప్రిల్‌ 23: సిద్దిపేట 43 వార్డులకు, గజ్వేల్‌ ఒక వార్డులో మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో గొడవలను సృష్టించే వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టామన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా ఎవరైనా పాల్పడితే వారిపట్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఓటెయ్యాలని ప్రజలను ఇబ్బందులకు గురిచేసినా, డబ్బు ఆశ చూపినా, మద్యం సరఫరా చేసినా, ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించినా చర్యలు తీసుకుంటామన్నారు. ఏదైనా సమస్య ఉంటే వార్డు ప్రజలు, యువకులు 100కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు సీపీ జోయల్‌ డేవిస్‌ పలు సూచనలు చేశారు. 

 కరోనా విజృంభిస్తున్న దృష్ట్యా మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తప్పకుండా కొవిడ్‌ నిబంధనలు, రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు తప్పకుండా పాటించాలి. ప్రచారం చేసే సమయంలో ఎక్కువ మంది ఉండరాదు.

 ప్రతీ ఒక్కరూ మాస్కు ధరించి, వెంట శానిటైజర్‌ ఉంచుకోవాలి, భౌతిక దూరం పాటించాలి. ప్రచారం చేసే సమయంలో గంటకు ఒకసారి చేతులకు శానిటైజర్‌ పెట్టుకోవాలి.

 అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదు. సిద్దిపేట, గజ్వేల్‌ ఏసీపీల పర్మిషన్‌ తీసుకుని సభలు, సమావేశాలు, ర్యాలీ నిర్వహించాలి.

 ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రచారం చేసుకోవాలి. రాత్రి 7 నుంచి ఉదయం 8 గంటల వరకు ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలు, స్థానిక సభలు నిర్వహించకూడదు.

 ఒక అభ్యర్థికి ఒక ప్రదేశంలో మాత్రమే సభలు, సమావేశాలకు, ర్యాలీకి పర్మిషన్‌ ఇస్తాం. ఇంటింటి ప్రచారం చేసేటప్పుడు మైకులు ఉపయోగించరాదు, సభలు సమావేశాలకు మాత్రమే మైకులు ఉపయోగించాలి.


 

Updated Date - 2021-04-24T05:12:42+05:30 IST