మద్యం సేవిస్తాడంటూ క్లెయిమ్‌ తిరస్కృతి

ABN , First Publish Date - 2021-07-26T07:19:46+05:30 IST

మద్యం సేవిస్తాడన్న కారణంతో పాలసీ డబ్బులు చెల్లించేందుకు నిరాకరించిన ‘ద న్యూ ఇండియా అషూరెన్స్‌’ సంస్థను వినియోగదారుల ఫోరం-2 తప్పిపట్టింది.

మద్యం సేవిస్తాడంటూ క్లెయిమ్‌ తిరస్కృతి

కాలేయ వ్యాధికి మద్యం ఒక్కటే కారణం కాదన్న ఫోరం

హైదరాబాద్‌ సిటీ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): మద్యం సేవిస్తాడన్న కారణంతో పాలసీ డబ్బులు చెల్లించేందుకు నిరాకరించిన ‘ద న్యూ ఇండియా అషూరెన్స్‌’ సంస్థను వినియోగదారుల ఫోరం-2 తప్పిపట్టింది. కాలేయ వ్యాధికి మద్యం ఒక్కటే కారణం కాదని మందలించింది. సికింద్రాబాద్‌ సిక్‌విలేజ్‌కు చెందిన లక్ష్మీనరసింహ ప్రసాద్‌.. ‘ద న్యూ ఇండియా అషూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌’ నుంచి రూ.లక్షకు మెడిక్లెయిమ్‌ పాలసీ తీసుకున్నారు. 2012 జూలై 6న కాలేయ వ్యాధితో ఆయన ఆస్పత్రిలో మృతిచెందారు. దీంతో లక్ష్మీ నరసింహ ప్రసాద్‌ తండ్రి రాములు బీమా సంస్థను సంప్రదించారు. పాలసీదారు మద్యం సేవిస్తాడనే సాకుతో ఆ క్లెయిమ్‌ తిరస్కరణకు గురైంది. దీంతో రాములు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. పాలసీదారు అప్పుడప్పుడూ మద్యం సేవించేవారని, అది అలవాటు కాదని వివరించారు. మద్యం సేవించడం వల్లే లక్ష్మీనరసించ చనిపోయారని  ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రతినిధులు చెప్పారు. వాదోపవాదాలు విన్న ధర్మాసనం.. మద్యపానం ఒక్కటే కాలేయ వ్యాధికి కారణం కాదని వ్యాఖ్యానించింది. పాలసీ మొత్తం రూ.లక్షకు.. 9ు వడ్డీ కలిపి 45 రోజుల్లోగా చెల్లించాలని, మనోవేదనకు గురిచేసినందుకు రూ. 10వేలు, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించింది.

Updated Date - 2021-07-26T07:19:46+05:30 IST