రిజిస్టేషన్లకు మ్యుటేషన్‌ బ్రేక్‌!

ABN , First Publish Date - 2021-01-24T04:34:00+05:30 IST

జిల్లాలో మ్యుటేషన్‌ సమస్య వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి. భూమి దస్తావేజులో యజమాని పేరున్నా అడంగల్‌ 1ఏ, 1బీలలో అతని పేరుకు బదులు అమ్మకందారు వివరాలు ఉంటున్నాయి.

రిజిస్టేషన్లకు మ్యుటేషన్‌ బ్రేక్‌!
రిజిస్ట్రేషన్‌ శాఖ కార్యాలయం

నెల్లూరు (హరనాథపురం), జనవరి 23 : జిల్లాలో మ్యుటేషన్‌ సమస్య వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి. భూమి దస్తావేజులో యజమాని పేరున్నా అడంగల్‌ 1ఏ, 1బీలలో అతని పేరుకు బదులు అమ్మకందారు వివరాలు ఉంటున్నాయి. దస్తావేజుల ఆధారంగా అడంగల్‌లో పేరు మార్పును మ్యుటేషన్‌గా చెప్పవచ్చు. ఈ ప్రక్రియ తహసీల్దార్‌ కార్యాలయాల్లో పూర్తి కావాల్సి ఉంది.  జిల్లాలోని కొన్ని మండలాల తహసీల్దార్లకు డిజిటల్‌ కీలు అందక పోవడంతో వారు అడంగల్‌లో పేరు మార్పు ప్రక్రియను చేపట్టలేక పోతున్నారు. భూ యజమానులు అడంగల్‌లో పేరు మార్పు కోసం నెలల తరబడి తిరిగినా ప్రయోజనం ఉండటం లేదు.  మ్యుటేషన్‌ ప్రక్రియ సక్రమంగా ఉంటేనే రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ అధికారులు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. దస్తావేజుల్లో పేరు ఉండి, అడంగల్‌లో వేరే పేరు ఉన్నట్లు గుర్తిస్తే రిజిస్ట్రేషన్లు  చేయడం లేదు. తోటపల్లి గూడూరు మండల వాసులు ఇలాంటి  సమస్యతో మూడు నెలల నుంచి రిజిస్ట్రేషన్లు చేయించుకోలేక పోతున్నారు. తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ వారు మూడు నెలల నుంచి తిరుగుతున్నా ప్రయోజనం లేదు. యజమాని భూమికి  సంబంధించి తహసీల్దార్ల ధ్రువీకరణ ద్వారా రెవెన్యూ రికార్డులో ఆర్వోఆర్‌-1బీలో శాశ్వత నమోదు అవసరం ఉంది. మ్యుటేషన్‌ పక్రియ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్లు జరిగితే కొనుగోలు, అమ్మకం దారులకు ఇబ్బందులు తలెత్తవు. ఉన్నతాధికారులు డిజిటల్‌ కీలు లేని తహసీల్దార్‌లకు వాటిని అందేలా చర్యలు తీసుకొని మ్యుటేషన్‌కు సమస్య లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-01-24T04:34:00+05:30 IST