ఈ రేఖ చాలా స్ట్రాంగ్‌

ABN , First Publish Date - 2021-04-28T05:32:14+05:30 IST

విధి ఆడిన వింత నాటకంలో పావుగా మారినా... తల్లిగా పిల్లల బాధ్యత భుజాలకెత్తుకోక తప్పని పరిస్థితి! భారమైన బ్రతుకు బరువుకు బరువులతోనే బదులిచ్చిందామె!

ఈ రేఖ చాలా స్ట్రాంగ్‌

విధి ఆడిన వింత నాటకంలో పావుగా మారినా... తల్లిగా పిల్లల బాధ్యత భుజాలకెత్తుకోక 

తప్పని పరిస్థితి! భారమైన బ్రతుకు బరువుకు బరువులతోనే బదులిచ్చిందామె!

పవర్‌ లిఫ్టింగ్‌లో అంచెలంచెలుగా ఎదిగి స్ట్రాంగ్‌ ఉమన్‌గా పేరు తెచ్చుకున్న...

32 ఏళ్ల పవర్‌ లిఫ్టర్‌ ఇంటూరి రేఖ కథ ఇది!


జీవితంలో కొన్ని పార్శ్వాలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోకపోతేనే మంచిది అనిపిస్తుంది. కానీ, మనం మర్చిపోదామనుకున్నా అవి ఏదో ఒక రూపంలో మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. నా స్వస్థలం సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం. నాన్న బీహెచ్‌ఎల్‌ రిటైర్డ్‌ ఉద్యోగి. నాకు, మా అక్క శాంతికి చిన్నతనం నుంచి క్రీడలంటే మక్కువ. బీహెచ్‌ఎల్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో చదువుతున్నప్పుడు తొలుత ఖో-ఖో, తర్వాత కబడ్డీ బాగా ఆడేవాళ్లం. నాకు ఓడిపోవడమంటే నచ్చేది కాదు. బృంద క్రీడలైన ఖో-ఖో, కబడ్డీలో ఒక్కరు సరిగ్గా ఆడకపోయినా ఫలితం జట్టు మొత్తమ్మీద పడేది. అందరిలో ఒకేలాంటి తపన లేనప్పుడు గెలుపు కష్టమని అర్థం కావడానికి మూడేళ్లు పట్టింది. తొమ్మిదో తరగతి నుంచి కరణం మళ్లీశ్వరిని ఆదర్శంగా తీసుకుని వెయిట్‌ లిఫ్టింగ్‌లో శిక్షణ ఆరంభించా. మూడు నెలల తర్వాత ఓ రోడ్డు ప్రమాదంలో కుడి భుజానికి గాయమైంది. వెయిట్‌ లిఫ్టింగ్‌ చేయొద్దని వైద్యులు సూచించారు. కొద్దిరోజులు విరామం తీసుకున్న తర్వాత మా పాఠశాల పీఈటీ ద్వారా పవర్‌ లిఫ్టింగ్‌ గురించి తెలుసుకున్నా. అప్పటి నుంచి నా జీవితంలో అదొక భాగమైపోయింది.


వేధింపులు తప్పవు..

నా జీవితంలో అడుగడుగనా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా. మహిళా క్రీడాకారులు.. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినవారికి ఇవి ఎక్కువ. క్రీడల్లో అమ్మాయిలను ప్రోత్సహించని కుటుంబాల నుంచి వచ్చే అమ్మాయిల్లో చాలామంది ఇలాంటి వేధింపుల గురించి ఇంట్లో తెలిస్తే ఆట వైపు కన్నెత్తి కూడా చూడనివ్వరనే భయంతో లోలోపలే బాధపడతారే తప్ప ఇంట్లో తెలియనివ్వరు. ఇలా నా స్నేహితురాళ్లలో చాలామందికి ఆసక్తి ఉన్నా, మరోదారి లేక అర్ధంతరంగా తమ కెరీర్‌ను ముగించిన వారున్నారు. సబ్‌ జూనియర్‌, జూనియర్‌ లెవల్‌లోనే ఈ తరహా వేధింపులు ఎక్కువ చవిచూశా. సీనియర్‌ కేటగిరీకి వచ్చాక కానీ, శిక్షణ పేరిట జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి అర్థం చేసుకోలేకపోయా. మహిళా కోచ్‌లు తక్కువగా ఉండడం కూడా ఈ దుస్థితికి కారణమని ఆ తర్వాత తెలుసుకున్నా.


హేళన చేసినవాళ్లే.. శభాష్‌ అన్నారు!

2003లో నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ఖైరతాబాద్‌లో జిల్లా స్థాయి సబ్‌ జూనియర్‌ పోటీలు జరిగాయి. అందులో 30 కిలోల బరువు ఎత్తలేక చతికిలపడ్డా. అందరూ ‘‘నీకెందుకమ్మా ఈ పోటీ’’ అని హేళన చేశారు. ఇంట్లో వాళ్లు కూడా ‘‘ఇవన్నీ మానేసి బుద్ధిగా చదువుకో’’ అన్నారు. పట్టుదలగా సాధన చేసి ఏడాది తిరిగేలోగా 2004లో పాటియాలాలో జరిగిన జాతీయ సబ్‌ జూనియర్‌ పోటీల్లో, 57 కిలోల విభాగంలో, పసిడి పతకం నెగ్గి ప్రశంసలందుకున్నా. 2005లో అమృత్‌సర్‌లో జరిగిన ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ పోటీల్లో 67 కిలోల కేటగిరీలో, స్వర్ణం సాధించి, బెస్ట్‌ పవర్‌ లిఫ్టర్‌ టైటిల్‌ దక్కించుకున్నా. 2007 పెళ్లయ్యాక మూడేళ్లు పోటీలకు దూరంగా ఉన్నా.


ఆ తర్వాత 2013లో మరోసారి ప్రాక్టీస్‌ ప్రారంభించా. 2015లో సీనియర్‌ కేటగిరీ 84 కిలోల విభాగంలో జాతీయ చాంపియన్‌గా నిలిచి సత్తా చాటాను. ఈ ఏడాది జనవరిలో జిల్లా స్థాయి, ఫిబ్రవరిలో రాష్ట్ర స్థాయి పోటీల్లో పసిడి పతకాలు సాధించి, జాతీయ పోటీల బరిలో నిలిచి స్ట్రాంగ్‌ ఉమెన్‌ టైటిల్‌ గెలిచాను. గత నెల జంషెడ్‌పూర్‌లో జరిగిన ఈ పోటీల్లో అంతకు ముందున్న జాతీయ రికార్డులు బద్దలుకొట్టా. 72 కిలోల విభాగంలో, స్క్వాట్‌ 250 కిలోలు, బెంచ్‌ ప్రెస్‌ 100, డెడ్‌ లిఫ్ట్‌ 220 మొత్తంగా 570 కిలోల బరువెత్తి నూతన రికార్డులు నెలకొల్పా. నా పునరాగమనంలో కోచ్‌ సుమిత్‌, బీడీఎల్‌ ఎంప్లాయిస్‌ ఎన్జీఓ, ఫార్మర్స్‌ ఫౌండేషన్‌ సభ్యులు నాకు వెన్నుదన్నుగా నిలిచారు. ఈ ఏడాది ఆసియా పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించా. పోటీల్లో పాల్గొనాల్సిందిగా కిర్గిస్థాన్‌ నుంచి లేఖ కూడా వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతో ఆ పోటీలకు వెళ్లలేకపోయా.


ప్రశ్నిస్తేనే విముక్తి!

నా కెరీర్‌ మెరుగ్గా ఉన్న దశలో ప్రేమ వివాహం చేసుకున్నాను. అతనొక మోసగాడనీ, బాధ్యతల నుంచి తప్పించుకునే తాగుబోతు అనీ తర్వాత తెలిసింది. దానికితోడు నన్ను విపరీతంగా వేధించేవాడు. ఆ బాధలు ఓర్చుకోలేక ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని కూడా ప్రయత్నించా. కానీ, ఒక క్రీడాకారిణిగా.. పట్టుదల, శక్తిసామర్థ్యాలు ఉన్న మహిళగా అలా ఆలోచించడం తప్పనిపించింది. విడాకులు తీసుకొని ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పని చేస్తూ.. నా ముగ్గురు పిల్లలను పెంచుకుంటూనే సాధన మొదలుపెట్టా. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించడం, యువ పవర్‌ లిఫ్టర్లకు కోచింగ్‌ ఇవ్వలానేవి నా ముందున్న లక్ష్యాలు. నేను ఎదుర్కొన్న ఇబ్బందులు, పడిన అవమానాలు మరో అమ్మాయి పడకూడదనే భావనతో మహిళల కోసం ప్రత్యేకంగా పవర్‌ లిఫ్టింగ్‌ కమ్‌ సెల్ఫ్‌ డిఫెన్స్‌ అకాడమీ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నా. ఇందుకు ప్రభుత్వం, దాతలు ఎవరైనా సహాయం చేస్తారని ఆశిస్తున్నా!


2003లో నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ఖైరతాబాద్‌లో జిల్లా స్థాయి సబ్‌ జూనియర్‌ పోటీలు జరిగాయి. అందులో 30 కిలోల బరువు ఎత్తలేక చతికిలపడ్డా. అందరూ ‘‘నీకెందుకమ్మా ఈ పోటీ’’ అని హేళన చేశారు. పట్టుదలగా సాధన చేసి ఏడాది తిరిగేలోగా 2004లో పాటియాలాలో జరిగిన జాతీయ సబ్‌ జూనియర్‌ పోటీల్లో, 57 కిలోల విభాగంలో, పసిడి పతకం నెగ్గి ప్రశంసలందుకున్నా.


సంజయ్‌ శంకా, హైదరాబాద్‌


Updated Date - 2021-04-28T05:32:14+05:30 IST