స్వార్థానికి మున్సిపల్‌ నిధులు

ABN , First Publish Date - 2022-05-13T06:38:48+05:30 IST

తాడిపత్రి పట్టణ నడిబొడ్డున అత్యంత ఖరీదైన ప్రాంతంలో వాణిజ్య భవన సముదాయం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి బంధువు ఒకరు నిర్ణయించారు.

స్వార్థానికి మున్సిపల్‌ నిధులు
కాలువను ఆనుకొని ఉన్న ఎమ్మెల్యే బంధువు స్థలం( ఈ స్థలంలోనే కొత్తగా కాంప్లెక్స్‌ కడుతున్నారన్న ప్రచారం)

బంధువు అడ్డదారి

నిబంధనలకు విరుద్ధంగా పనులు

వరద కాలువ కోసం ఆగస్టులో వర్క్‌ ఆర్డర్‌

గడువు దాటాక.. ఇప్పుడు ఆ పేరిట పనులు

ఎమ్మెల్యే బంధువు కాంప్లెక్స్‌ కోసం బరితెగింపు


తాడిపత్రి పట్టణ నడిబొడ్డున అత్యంత ఖరీదైన ప్రాంతంలో వాణిజ్య భవన సముదాయం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి బంధువు ఒకరు నిర్ణయించారు. కానీ అక్కడికి వాహనాలు వెళ్లే రోడ్డు లేదు. ద్విచక్ర వాహనాలు మాత్రమే వెళ్లే వీలుంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే బంధువు ఏకంగా వరద కాలువను కబ్జా చేస్తున్నారు. కాలువ పునరుద్ధరణ పేరిట రూ.11 లక్షలకు పైగా మున్సిపల్‌ నిధులతో పనులు జరుగుతున్నాయి. టీడీపీ మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యులు అడ్డుకున్నా, కాంట్రాక్టర్‌ తనపని తాను చేసుకుపోతున్నాడు. అధికారపార్టీ ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయన్న ధీమాతో పనులు చేయిస్తుండటంతో అధికారులు సైతం చేతులెత్తేశారు. జాప్యం జరిగితే పనులకు టీడీపీ కౌన్సిల్‌ సభ్యులు అడ్డుతగులుతారని భావించి, వర్షం పడుతున్నా ఆపకుండా కొనసాగిస్తున్నారు. 

- తాడిపత్రి


నిబంధనలు పట్టవా..?
నిబంధనల ప్రకారం వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చిన ఏడు రోజుల్లో కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్‌ చేసుకోవాలి. వారం దాటితే వర్క్‌ ఆర్డర్‌ను అధికారులు రద్దు చేయాలి. గత ఏడాది ఆగస్టు 28న వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చారు. డిసెంబరు 28న అగ్రిమెంట్‌ చేసుకున్నారు. నాలుగు నెలల తర్వాత అగ్రిమెంట్‌ చేయించుకోవడం నిబంధనలకు విరుద్ధం. అగ్రిమెంట్‌ చేసుకున్న తర్వాతైనా వెంటనే పనులు ప్రారంభించారా అంటే అదీ లేదు. ఐదు నెలల తర్వాత, ఈ నెల రెండో వారంలో పనులు ప్రారంభించారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 




సెలవులో వెళ్లిన ఇంజనీర్‌

తాడిపత్రి మున్సిపాలిటీలో పనులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయి. నాణ్యత పాటించడం లేదు. బిల్లులపై ఒత్తిడి వస్తోంది. వీటికి ఆమోదం తెలిపితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో మున్సిపల్‌ ఇంజనీర్‌ రసూల్‌ సెలవులో వెళ్లారని ప్రచారం జరుగుతోంది. వివాదాస్పదంగా మారిన కాలువ నిర్మాణం కూడా తలనొప్పిగా మారడం, ఆయన సెలవులో వెళ్లడానికి కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న కాలువ నిర్మాణ పనుల్లో కూడా నాణ్యత లోపించిందని ఆరోపణలు ఉన్నాయి. మున్సిపాలిటీలో ఐదుగురు వర్క్‌ ఇనస్పెక్టర్‌లు ఉన్నా, కాలువ పనులను పర్యవేక్షించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారం అత్యంత వివాదాస్పదంగా మారడంతో తమకు ఎందుకొచ్చిన తంటా అని మిన్నకుండిపోయారని అంటున్నారు. పూర్తిస్థాయిలో కాలువ విస్తరణ పనులు చేపట్టి, అనంతరం రోడ్డు నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఉన్న కాలువలోతును సైతం పూడుస్తున్నారు. 



కౌన్సిల్‌ను తప్పుదోవ పట్టించిన అధికారులు

కాలువ పునరుద్ధరణ పనులకు సంబంధించి కౌన్సిల్‌ను అధికారులు తప్పుదోవ పట్టించారని టీడీపీ కౌన్సిలర్లు మండిపడుతున్నారు. ఎస్‌బీఐ బజార్‌ బ్రాంచ వద్ద నుంచి మసీదు వెనుక భాగం వరకూ వరద కాలువ (స్టార్మ్‌ వాటర్‌ డ్రెయిన) నిర్మాణం కోసం 2021 మే31న రూ.11,85,707 టెండర్‌లకు ఆహ్వానించారు. ఈ పనులకు మున్సిపల్‌ సాధారణ నిధులను కేటాయించారు. జూలై 7న టెండర్లు తెరిచారు. సింగిల్‌ టెండర్‌ కింద అంచనాల కంటే 0.01 శాతం తక్కువగా ఎమ్మెల్యే మరొక బంధువు రూ.11,85,588కు పనులు దక్కించుకున్నారు. ఈ టెండర్‌ ఆమోదం కోసం 2021 జూలై 19న కౌన్సిల్‌ దృష్టికి తీసుకువెళ్లారు. కానీ ప్రస్తుతం మసీదు సమీపంలో పనులు చేయడం లేదు. ఎస్‌బీఐ బజార్‌ బ్రాంచ పక్కన మాత్రమే జరుగుతున్నాయి. ఎస్‌బీఐ బజారు బ్రాంచ ఉన్న భవంతి కూడా ఎమ్మెల్యే బంధువుదే. ఆ బంధువుకు బజార్‌బ్రాంచ వెనుక ఖాళీ స్థలం ఉంది. అక్కడ కాంప్లెక్స్‌ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి రోడ్డు కావాలి. కానీ ద్విచక్రవాహనాలు మాత్రమే తిరిగే అవకాశం ఉంది. ఈ చిన్నపాటి రోడ్డుకు మధ్య కాలువ ఉంది. ఈ కాలువను పూడ్చి, వరద నీరు వెళ్లే కాలువగా మార్చి, పైన సిమెంట్‌ రోడ్డు వేస్తే తమకు అనుకూ లంగా ఉంటుందని నిర్ణయించారు. ఈ పనులు పూర్తి అయితే.. కాంప్లెక్స్‌కు అవసరమైన రోడ్డు ఏర్పడుతుంది. ఈ ఆలోచనతోనే రోడ్డు పనులు చేయిస్తున్నారు. 



వరద కాలువ కబ్జా

బ్రిటీష్‌ కాలంలో ఏర్పాటు చేసిన వరద కాలువ కబ్జాకు గురైంది. వరదకాలువ కుంచించుకుపోయి, వివాదాలకు కారణమవుతోంది. కబ్జాకు గురైన వరదకాలువను పునరుద్ధరించి, కొత్తగా నిర్మించాలి. కానీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం మున్సిపల్‌ నిధులను ఖర్చు చేసి, వరద కాలువను కుదించడం విమర్శలకు తావిస్తోంది. మూడు కి.మీ. పైగా ఉన్న వరదకాలువ కబ్జాకు గురై పిల్లకాలువగా మారింది. అప్పట్లో 30 అడుగులకు పైగా వెడల్పు ఉన్న కాలువ నేడు కొన్నిచోట్ల 5 అడుగులు కూడా లేదు. మిల్క్‌ డెయిరీ ప్రాంతం నుంచి కాలువ కబ్జాకు గురైంది. సర్వే చేసి ఆక్రమణలను తొలగించి పునరుద్ధరించాలని మండల సర్వేయర్‌, మున్సిపల్‌ టౌనప్లానింగ్‌ అధికారులకు టీడీపీ కౌన్సిల్‌ సభ్యులువినతిపత్రం ఇచ్చారు. సర్వే పనులు పెండింగ్‌లో ఉండగానే అధికారులు టెండర్లు పిలిచారు. కేవలం ఎమ్మెల్యే సమీప బంధువుకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేశారు. ఈ పనుల వల్ల నిధుల ఖర్చు తప్ప ప్రజలకు ఒరిగేది లేదు. 


పోలీసుల వత్తాసు 

మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు అబ్దుల్‌ రహీం, సరస్వతమ్మ, పలువురు కౌన్సిల్‌ సభ్యులు రెండు రోజుల క్రితం డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పనులను ఆపాలని వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. పనులు జరిగే ప్రాంతానికి తాము వెళితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ఇలా చేశారు. కానీ డీఎస్పీ కార్యాలయంలో గంటకు పైగా వేచి చూసినా స్పందించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అడ్డుకొనే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ కృష్ణారెడ్డి అక్కడికి వచ్చారని, ఆ ప్రదేశం నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారని వాపోయారు. 


సెలవు.. తెలియదు..

నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పనుల గురించి మున్సిపల్‌ కమిషనర్‌ శివారెడ్డిని వివరణ కోరేందుకు ఆంధ్రజ్యోతి ప్రయత్నించింది. ఆయన పది రోజులపాటు సెలవు పెట్టారు. సెల్‌ఫోనలో కూడా అందుబాటులోకి రాలేదు. ఇనచార్జ్‌ కమిషనర్‌ రాజేశ్వరీబాయి తనకేమీ తెలియదని అన్నారు. కమిషనర్‌ వచ్చిన తర్వాత మాట్లాడాలని సూచించారు.


చర్యలు తీసుకుంటాం..

నిబంధనలకు విరుద్ధంగా, సొంత ప్రయోజనాల కోసం కాలువ పునరుద్ధరణ పేరుతో జరుగుతున్న పనులపై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటాం. ఈ పను ల గురించి టీడీపీ కౌన్సిల్‌ సభ్యులు నా దృష్టికి తీసుకువచ్చారు. వాటిని పరిశీలించాలని అధికారులను ఆదేశించాను. ఈ వ్యవహారంలో అధికారుల తప్పు ఉంటే చర్యలు తీసుకుంటాం. 

- జేసీ ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన 



Read more