సడలుతున్న ధీమా!

ABN , First Publish Date - 2022-07-02T07:36:29+05:30 IST

సడలుతున్న ధీమా!

సడలుతున్న ధీమా!

వైసీపీ నేతల మాటల్లో ఏదో తేడా

‘తాడేపల్లి’ వరకే పరిమితమైన భరోసా.. క్షేత్రస్థాయిలో అంతా భిన్నమైన దృశ్యాలు

పార్టీ పరిస్థితి బాగోలేదనే అభిప్రాయాలు

ప్లీనరీల్లో అలకలు, అసంతృప్తులు, ఆగ్రహాలు

సొంత పార్టీ నేతల కుట్రలపై భగభగలు

‘పక్క చూపుల’పై నేతల్లో ఇప్పుడే ఆందోళన

అగ్రనేతల ముందే ఎమ్మెల్యేల నిష్టూరాలు

కార్యకర్తలకు బిల్లుల పెండింగ్‌పై నిస్సహాయత

పేలవంగా సాగుతున్న నియోజకవర్గ ప్లీనరీలు


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

కిందిస్థాయి నుంచి పైదాకా అసంతృప్తులు ఒకవైపు!

‘పక్క చూపులు’ చూస్తున్నారనే ఆందోళన మరోవైపు!

ప్రభుత్వంలో, పార్టీలో పెద్దలుగా ఉన్న వారి నోటి 

నుంచే నర్మగర్భ వ్యాఖ్యలు ఇంకోవైపు! 

ఇవన్నీ చూస్తుంటే అధికార పార్టీ పరిస్థితి ‘ఆల్‌ ఈజ్‌ నాట్‌ వెల్‌’ అన్నట్లుగా ఉందని వైసీపీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. జిల్లాల్లో జరుగుతున్న ప్లీనరీల సాక్షిగా... ఎక్కడికక్కడ లుకలుకలు బయటపడుతున్నాయి. వెరసి... వైసీపీలో ఏదో తేడా కొడుతోందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. నిన్న మొన్నటిదాకా గెలుపు ధీమాను ప్రదర్శిస్తూ వచ్చిన ముఖ్యనేతలు... ‘మనం సర్దుకోకపోతే కష్టమే’ అని ప్లీనరీ వేదికల్లో బాహాటంగానే చెబుతున్నారు. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన వైసీపీఎల్పీ సమావేశంలో, ఆ తర్వాత జరిగిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ వర్క్‌షాపులో సీఎం జగన్‌ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. అందులోనూ... మొత్తం 175 సీట్లూ గెలిచేస్తామని చెప్పేశారు. ఈ ధీమా తాడేపల్లి క్యాంప్‌ ఆఫీసుకే పరిమితమైంది. క్షేత్రస్థాయిలోకి వచ్చేసరికి అంతా తలకిందులే! రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ,  జిల్లా, నియోజకవర్గస్థాయిలో జరుగుతున్న ప్లీనరీల్లో నిరాశా స్వరాలు, భిన్న గళాలూ వినిపిస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నేతల నుంచి ఎమ్మెల్యేలు, కొందరు ముఖ్య నేతల మాటల్లోనూ తేడా కనిపిస్తోంది. ఈనెల 8వ తేదీన గుంటూరు జిల్లా కాజ వద్ద వైసీపీ ప్లీనరీ జరగనుంది. దీనికి సన్నాహకంగా జిల్లాల్లో ‘మినీ ప్లీనరీలు’ నిర్వహిస్తున్నారు. ఇవి పేలవంగా సాగుతున్నప్పటికీ... ఇక్కడే ‘అసలు’ విషయాలు, అనేక సమస్యలు  బయటపడుతున్నాయి. సంక్షేమ పథకాలే తమను మళ్లీ గెలిపిస్తాయని సీఎం జగన్‌, ఇతర ముఖ్య నేతలు గట్టిగా చెబుతున్నారు. కానీ.. అంత సీన్‌ లేదని ప్లీనరీల్లో పలువురు ఎమ్మెల్యేలే చెబుతున్నారు. అభివృద్ధి జరగడంలేదని, కార్యకర్తలు అప్పులు తెచ్చి చేసిన పనులకు బిల్లులు చెల్లించలేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని పేర్కొంటున్నారు. కార్యకర్తల బాగు చూసుకోకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. 


పెద్దల మాటల్లోనూ...

వైసీపీ నాయకుల మాటల్లోనూ గెలుపుపై ధీమా సడలినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ‘అంత ఈజీకాదు. పోలింగ్‌ రోజు యుద్ధం చేయాలి’ అని ఒక నాయకుడు వ్యాఖ్యానించారు. తాజాగా విజయనగరం జిల్లా ప్లీనరీలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... ‘‘మేం ఒక స్థాయికి చేరుకున్నాం. పదవులు ఉన్నా, లేకున్నా ఒకటే. కానీ... పార్టీ అధికారంలో లేకుంటే సర్పంచులు, ఇతర నేతలకు ఇబ్బందులుంటాయి’’ అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న పథకాలు తమ పార్టీ ద్వారానే అందుతున్నాయని ప్రజలకు వివరించలేకపోతే కష్టమవుతుందన్నారు. ప్రతి మూడు నెలలకోసారి సమావేశాలు నిర్వహించి నేతల కడుపులో ఉన్న కోపాన్ని బయటకు వెళ్లగక్కుతూ, సరిదిద్దుకుంటేనే ఎన్నికల్లో విజయం సాధించే వీలుందని బొత్స సూచించడం గమనార్హం. గురువారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రజలు విశ్వసించే వీలుంది’ అని పలుమార్లు చెప్పారు. దాదాపు 45 నిమిషాలపాటు సాగిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన ఆత్మరక్షణలో పడిపోయినట్లుగా మాట్లాడారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. మద్యంలో విషపదార్థాలున్నాయంటూ టీడీపీ చేసిన సూటి ఆరోపణలకు తగిన సమాధానం ఇవ్వకుండా దాటవేశారు.


లుకలుకలు...

పదవుల పంపకంపై అసంతృప్తులు, కుట్రలు పన్నుతున్నారంటూ ఆగ్రహాలూ భారీగా బయటపడుతున్నాయి. ‘లాగే గుర్రాలను కాదని, తన్నే గుర్రాలకు పదవులు ఇచ్చారు’ అంటూ ఓ ఎమ్మెల్యే భగ్గుమన్నారు. ‘సొంత పార్టీ నేతలు నాపై కుట్ర పన్నారు. వారి లెక్క తేలుస్తా’ అని సీఎం బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి హెచ్చరించారు. ‘నన్ను కూడా సొంత పార్టీ నేతలు ఇబ్బంది పెడుతున్నారు’ అని  కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మండిపడ్డారు. ఇంతలా లుకలుకలు బయటపడుతున్నా సజ్జల రామకృష్ణారెడ్డి వాటిని తేలిగ్గాతీసుకున్నట్లు మాట్లాడటం విశేషం. పెద్ద పార్టీలో ఒకరిపై మరొకరు ఆధిపత్యం సాధించేందుకు ఇలాంటి వ్యూహాలు పన్నడం సహజమేనని ఆయన తెలిపారు. అభిప్రాయ భేదాలను పరిష్కరించాల్సింది పోయి... అలాంటివి ‘సహజమే’ అని కొట్టిపడేయడంపై పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. పార్టీలో తమకు ప్రాధాన్యం దక్కకపోగా అవమానిస్తున్నారని రగిలిపోతున్న వారూ ఉన్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బీసీ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిని హెలిప్యాడ్‌ వద్దకు రానివ్వలేదు. దీనిపై ఆమె బాహాటంగానే అసంతృప్తి, ఆగ్రహం వెళ్లగక్కారు. ‘‘పార్టీ నేతలు తమ జీవనోపాధి కోసం వేరే మార్గాలను అన్వేషించుకోవాలి. పార్టీనే అవకాశాలు కల్పిస్తుందని భావించొద్దు’’ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచించడంపైనా చర్చ జరుగుతోంది.


ఎవరికి వారే సొంతంగా...

వైసీపీ ప్లీనరీల్లో కిందిస్థాయి నాయకులే టికెట్లను కూడా ప్రకటిస్తున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని... ‘నేను గుడివాడ నుంచి పోటీ చేస్తున్నాను. మచిలీపట్నం నుంచి పేర్ని నాని లేదా ఆయన కుమారుడు కిట్టూ పోటీ చేస్తారు. గన్నవరం టికెట్‌ వల్లభనేని వంశీదే’’ అని ప్రకటించేశారు. నిజానికి... గన్నవరం వైసీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. సీఎం జోక్యం చేసుకున్నా కొలిక్కి రావడంలేదు. బందరులో పేర్ని నాని వారసుడి రంగ ప్రవేశంపై ఇంకా స్పష్టత లేదు. అయినా సరే... కొడాలి నాని అభ్యర్థులను ‘ఖరారు’ చేసేశారు. ముఖ్యమంత్రి జగన్‌  వద్ద ఉన్న చనువుతో ఇలా చెప్పారా? లేక... ఇతర కారణాలున్నాయా? అనే అంశంపై పార్టీలో చర్చ జరుగుతోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ప్లీనరీల్లో అనేక చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.

Updated Date - 2022-07-02T07:36:29+05:30 IST