సర్కారుకు జిల్లాల సెగ!

ABN , First Publish Date - 2022-01-30T08:11:56+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జిల్లాల ఏర్పాటుపై.. ప్రజల నుంచి చాలా చోట్ల నిరసన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అభివృద్ధి చెందిన కొన్ని నియోజకవర్గాలను విడదీసి.. కొత్త జిల్లాల్లో కలిపారని, కొత్త జిల్లాలకు

సర్కారుకు జిల్లాల సెగ!

  • ఆందోళనలు అంతకంతకూ ఉధృతం
  • హిందూపురంలో బంద్‌ సక్సెస్‌
  • జిల్లా కేంద్రం చేయాలంటూ
  • యువకుడి ఆత్మహత్యాయత్నం
  • సీఎం సొంత జిల్లాలోనూ నిరసన
  • జిల్లా కేంద్రంగా రాజంపేటకు పట్టు
  • కర్నూలు, పశ్చిమ, కడప, అనంత,
  • ప్రకాశం జిల్లాల్లో కదం తొక్కిన 
  • టీడీపీ సహా పలు ప్రజాసంఘాలు 
  • డోన్‌ను నంద్యాల జిల్లాలో కలపడంపై అభ్యంతరం
  • ద్వారకా తిరుమలపైనా.. 
  • ప్రకాశం 3 ముక్కలపై అభ్యంతరాలు
  • పలు జిల్లాల్లో సాగిన రిలే దీక్షలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జిల్లాల ఏర్పాటుపై.. ప్రజల నుంచి చాలా చోట్ల నిరసన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అభివృద్ధి చెందిన కొన్ని నియోజకవర్గాలను విడదీసి.. కొత్త జిల్లాల్లో కలిపారని, కొత్త జిల్లాలకు ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాలు అభ్యంతరకరమని పేర్కొంటూ.. ప్రతిపక్ష టీడీపీ నేతలు సహా ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు శనివారం కదం తొక్కాయి. పలు చోట్ల రిలే దీక్షలు కొనసాగాయి. ఇక, అనంతపురం జిల్లాను విడదీసి కొత్తగా ఏర్పాటు చేసిన శ్రీసత్యసాయి జిల్లాకు పుట్టపర్తిని కాకుండా హిందూపురాన్ని కేంద్రంగా నిర్ణయించాలని డిమాం డ్‌ చేస్తూ శనివారం బంద్‌ పాటించారు.


ఈ క్రమంలో ఒక యువకుడు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. అదేవిధంగా సీఎం జగన్‌ సొంత జిల్లా కడపను విడదీసి ఏర్పాటు చేస్తున్న అన్నమయ్య జిల్లాకు రాయచోటి కాకుండా.. రాజంపేటను కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్త జిల్లాల ఏర్పాటు వివాదంగా మారి.. సర్కారు సెగ పెడుతోందనే వాదన వినిపిస్తోంది.  


కర్నూలులో: డోన్‌ నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలోనే కొనసాగించాలని ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రంగనాయకులు డిమాండ్‌ చేశారు. ఐఎ్‌ఫటీయూ ఆధ్వర్యంలో డోన్‌లో రిలే దీక్ష చేపట్టారు. నంద్యాలకు ఆనుకుని ఉన్న పాణ్యంను కర్నూలు జిల్లాలో కలిపి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న డోన్‌ను నంద్యాల జిల్లాలో ఎలా కలుపుతారని ప్రశ్నించారు. 


పశ్చిమాన నిరసనల హోరు

పశ్చిమ గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమలను రాజమహేంద్రవరం జిల్లాలో కలపడంపై శనివారం టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పలువురు కార్యకర్తలు శిరోముండనం చేయించుకుని నిరసన వ్యక్తం చేశారు. ద్వారకా తిరుమలను సమీపాన ఉన్న ఏలూరులో కాకుండా దూరంగా ఉన్న రాజమహేంద్రవరంలో కలపడం ఏమిటని ప్రశ్నించారు. నరసాపురం జిల్లా కేంద్రంగా భీమవరాన్ని ప్రకటించడాన్ని నిరసిస్తూ నరసాపురం కౌన్సిల్‌ సమావేశానికి టీడీపీ, జనసేన కౌన్సిలర్లు నల్ల కండువాలతో హాజరయ్యారు. అఖిలపక్షాన్ని సీఎం వద్దకు తీసుకువెళ్తానని ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ప్రకటించారు. 


ప్రకాశంపై టీడీపీ ఎమ్మెల్యేల లేఖ

ప్రకాశం జిల్లాను మూడు ముక్కలు చేయడం అశాస్త్రీయమని జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. ఒంగోలు కేంద్రంగా తూర్పు ప్రాంతంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఒకటి, మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రాంతంలోని ఐదు సెగ్మెంట్లతో కలిపి మరో జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆమేరకు ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, డీఎ్‌సబీవీ స్వామిలు సంయుక్తంగా సీఎం జగన్‌కు లేఖ రాశారు. 


మార్కాపురం జిల్లా కోరుతూ అఖిలపక్షం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించింది. కందుకూరు డివిజన్‌ రద్దును వ్యతిరేకిస్తూ ఆందోళనకు స్థానికులు పిలుపునిచ్చారు. 


శ్రీకాకుళంలో..: శ్రీకాకుళం జిల్లాకు గౌతు లచ్చన్న పేరు పెట్టాలని, సోంపేటలో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని సోంపేట మండల సమావేశంలో సభ్యులు తీర్మానించారు.


మదనపల్లెలో.. 

చిత్తూరులో మదనపల్లె జిల్లా ఏర్పాటు కోసం శనివారం కూడా ఆందోళనలు కొనసాగాయి. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వేర్వేరుగా ఆందోళనలు కొనసాగించాయి. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద టీడీపీ, బీఎస్పీ, ఎమ్మార్పీఎస్‌, మాలమహానాడు సంఘాల నేతలు, కార్యకర్తలు ధర్నా చేశారు. మదనపల్లె జిల్లా సాధన సమితి కన్వీనర్‌ పీటీఎం శివప్రసాద్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది.  నగరి నియోజకవర్గాన్ని శ్రీబాలాజీ జిల్లాలో కలపాలని టీడీపీ, బీజేపీ మహిళా మోర్చా, సీపీఐ నేతలు డిమాండ్‌ చేశారు. ఈమేరకు పుత్తూరు కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు.

  

పల్నాడు జిల్లాకు వేమన పేరుపెట్టాలి

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును ఏపీ దళిత మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు కత్తి పద్మారావు స్వాగతించారు. కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లాకు మహాకవి వేమన పేరు పెట్టాలని కోరారు.


రగిలిన రాజంపేట!

రాజంపేట, జనవరి 29: సీఎం సొంత జిల్లా కడపలో రాజంపేట పట్టణాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రం చేయాలంటూ రాజంపేట, రైల్వేకోడూరు వాసులు సహా వైసీపీ నేతలు డిమాండ్‌ చేశారు. తాళ్లపాకలో వైసీపీ నాయకులు, జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు నిరసన వ్యక్తం చేశారు. రాజంపేటలో రాజంపేట జిల్లా సాధన సమితి, బార్‌ అసోసియేషన్‌, బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు, అఖిలపక్ష నేతలు, ప్రజా సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి. వైసీపీ నాయకులు, వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఛాయాదేవి ఆధ్వర్యంలో న్యాయవాదులు ర్యాలీ చేశారు. బీసీ సంఘం నాయకులు భిక్షాటన చేశారు. రాజంపేట మున్సిపల్‌ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. ఓబులవారిపల్లె మండల పరిషత్‌ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. పుల్లంపేటలో వైసీపీ, అఖిల పక్ష నేతలు, విద్యార్థి సంఘాలు ర్యాలీ చేశారు. చిట్వేలిలో వైసీపీ నేతలు ఇతర రాజకీయ పక్షాలతో కలిసి రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని నినాదాలు చేశారు. నందలూరులో ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్దారుకు వినితపత్రం ఇచ్చారు. ఒంటిమిట్టలో సైతం ఆందోళన నిర్వహించారు. సిద్దవటంలో అన్ని రాజకీయ పక్షాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి.


హిందూపురం బంద్‌

హిందూపురం, జనవరి 29: శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపురాన్ని ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ శనివారం వైసీపీయేతర పక్షాలు చేపట్టిన పట్టణ బంద్‌ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ బంద్‌కు అధికార వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, విద్యార్థి కుల, కార్మిక, చేనేత సంఘాలు మద్దతు పలికాయి. హిందూపురం పట్టణానికి చెందిన అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. నవీన్‌ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్యహత్యకు యత్నించాడు. విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తూముకుంట పారిశ్రామికవాడలో కార్మిక సంఘాలు, ముద్దిరెడ్డిపల్లి చేనేతలు ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి. హిందూపురం విషయంలో మాట తప్పితే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. జిల్లా కేంద్ర సాధన కోసం జరిగే ఉద్యమంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొనాలని అఖిల పక్షం నాయకులు డిమాండ్‌ చేశారు. బంద్‌ నిర్వహణ, నిరసన కార్యక్రమాలలో టీడీపీ, బీజేపీ, జనసేన, బీసీ సంక్షేమ సంఘం, చేనేత సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-30T08:11:56+05:30 IST