మళ్లీ వారిద్దరికే చాన్స్‌!

ABN , First Publish Date - 2021-11-10T05:01:36+05:30 IST

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి

మళ్లీ వారిద్దరికే చాన్స్‌!

  • స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల
  • అధికార పార్టీ ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌రాజుకు మళ్లీ అవకాశం 
  • డిసెంబర్‌ 10న ఎన్నికలు 
  • అమల్లోకి ఎన్నికల కోడ్‌ 
  • పోటీ విషయంపై ఇంకా ప్రతిపక్షాల తర్జనభర్జన


స్థానిక  సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. నోటిఫికేషన్‌ విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపికలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు నిమగ్నమ య్యాయి. అధికార పార్టీ పాతవారికే చాన్స్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. పోటీ విషయంలో కాంగ్రెస్‌, బీజేపీలు తర్జనభర్జన పడుతున్నాయి. ఓటర్లను కాపాడుకునేందుకు అభ్యర్థులను నిలబెట్టాలని యోచిస్తున్నాయి.


రంగారెడ్డి (ఆంధ్రజ్యోతి) : స్థానిక  సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో ఖాళీకానున్న రెండు స్థానాలకు డిసెంబర్‌ 10వ తేదీన  ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, సుంకరిరాజు(శంభీపూర్‌రాజు) పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 4వ తేదీన ముగి యనుంది. దీంతో ఈ స్థానాల భర్తీ కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్ని కలు అధికార పార్టీకి అనుకూలంగా జరిగే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు టీఆర్‌ఎస్‌ గెలు పొందిన విషయం తెలిసిందే. తరువాత స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ ఉన్నాయి. గత స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన వారిలో ఎక్కువ మంది అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిపోయారు. దీంతో అధికార పార్టీ బలం మరింత పెరిగింది. డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో రెండు స్థానాలు కైవసం చేసుకోవడం టీఆర్‌ఎస్‌కు నల్లేరుపై నడకేనని చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మళ్లీ మహేందర్‌ రెడ్డి, శంభీ పూర్‌ రాజుకే ఛాన్స్‌ ఇవ్వాలని నిర్ణయిం చినట్లు సమాచారం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మాజీ మంత్రి మహేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీగా కొనసాగిం చాలని పార్టీ నిర్ణయిం చినట్లు తెలిసింది. అలాగే శంభీపూర్‌ రాజుకు మరో సారి ఛాన్స్‌ ఇస్తున్నట్లు సమా చారం. అనూహ్య పరిణామాలు జరిగితే మినహా వీరిద్దరి పేర్లలో మార్పు ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు తెలి పాయి.


అయితే ఈ స్థానాల కోసం కొందరు ఆశావహులు పోటీపడుతున్నారు. బహిరంగంగా దీనిపై మాట్లాడక పోయిన ప్పటికీ తమకు అవకాశాలు కల్పించాలని పార్టీ పెద్దలను కోరు తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో పోటీపై ప్రతిపక్షాలు తర్జనభర్జన పడుతున్నాయి. గెలిచే అవకాశాలు లేకపోవడంతో తమ అభ్యర్థులను రంగంలోకి దించాలా? వద్దా? పోటీచేస్తే ఎవరిని అభ్యర్థులుగా నిలబెట్టాలి? అనేదానిపై తేల్చుకోలేక పోతున్నాయి అయితే తమ ఓటర్లను కాపాడుకునేందుకు పోటీ చేస్తామని బీజేపీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌ కూడా తమ అభ్యర్థిని బరిలో దింపే అవకాశం ఉంది. ఇదిలాఉంటే తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదని ఆగ్రహంతో ఉన్న పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ ఫోరం సభ్యులు కూడా నామినేషన్లు వేస్తామని ప్రకటించారు. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అన్నిస్థానాల నుంచి అభ్యర్థులను బరిలో దింపుతామని వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు, ర్యాలీలు, పాదయాత్రలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. 


డిసెంబర్‌ 10న ఎన్నికలు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నవంబర్‌ 16వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల స్వీకరణకు నవంబర్‌ 23వ తేది తుది గడువు కాగా, నవంబర్‌ 24న నామినేషన్ల పరిశీలన జరగనుంది. 26వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. డిసెంబర్‌ 10వ తేదీన పోలింగ్‌ నిర్వహిస్తారు. డిసెంబర్‌ 14న కౌంటింగ్‌ జరగనుంది. 


1,303 మందికి ఓటు హక్కు

స్థానిక శాసన మండలి ఉపపోరులో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మొత్తం 1,303మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 33మంది జడ్పీటీసీలు, 370 మంది ఎంపీటీసీలు, 277మంది కార్పొరేటర్లు, 466మంది కౌన్సిలర్లు, 157మంది కో-ఆప్షన్‌ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు జరగనున్నాయి. 


మొదలైన చర్చ

ఆమనగల్లు: మహ బూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ కసి రెడ్డి నారాయణరెడ్డి పదవీకాలం 2022 జన వరి 4వ తేదీతో ముగు స్తుంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. దీంతో కల్వకుర్తి నియోజకవర్గంలో మళ్లీ రాజకీయ చర్చకు తెరలేసింది. 2016లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తలకొండపల్లి మండలం ఖానాపూర్‌ గ్రామా నికి చెందిన కసిరెడ్డి నారాయణరెడ్డి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఇదిలా ఉండగా డిసెంబర్‌ 10న జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కసిరెడ్డి నారాయణ రెడ్డికి తిరిగి అవకాశం కల్పిస్తారా, లేదా ఎమ్మెల్యేగా ఛాన్స్‌ లభిస్తుందా అన్న రాజకీయ చర్చ మొదలైంది. కసిరెడ్డి కూడా ఎమ్మెల్యే పదవి పైనే ఎక్కువగా ఆశలు పెంచుకున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీగా తిరిగి రెండోసారి టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం కసిరెడ్డి పేరు దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. ఏదిఏమైనా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫి కేషన్‌ నేపథ్యంలో కల్వకుర్తి నియోజకవర్గంలో మళ్లీ రాజకీయ సందడి నెలకొంది. 

Updated Date - 2021-11-10T05:01:36+05:30 IST