బడులు 220 రోజులు.. సెలవులు 80

ABN , First Publish Date - 2022-06-27T16:42:51+05:30 IST

2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి అకెడమిక్‌ క్యాలెండర్‌ను పాఠశాలవిద్యా శాఖ ఆదివారం విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో 220 రోజులు

బడులు 220 రోజులు.. సెలవులు 80

పాఠశాల విద్య క్యాలెండర్‌ విడుదల


అమరావతి, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి అకెడమిక్‌ క్యాలెండర్‌ను పాఠశాలవిద్యా శాఖ ఆదివారం విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో 220 రోజులు పాఠశాలలు పనిచేస్తాయని, 80 రోజులు సెలవులు ఉంటాయని తెలిపింది. ఏటా జూన్‌ 12న ప్రారంభమై ఏప్రిల్‌ 23తో పాఠశాలలు ముగుస్తాయి. కానీ, ఈ ఏడాది జూలై 5న ప్రారంభమయ్యే పాఠశాలలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 30 వరకు జరగనున్నాయి. కాగా, జీవో 117లో పేర్కొన్నట్టు వారానికి 42 పనిదినాలు కాకుండా, ఆ సంఖ్యను 36కు తగ్గించారు. అలాగే, ఉన్నత పాఠశాలల్లో తెలుగుకు 54, హిందీకి 25, ఇంగ్లిష్‌కు 60, గణితం 64, జనరల్‌ సైన్స్‌ 26, ఫిజికల్‌ సైన్స్‌ 18, సోషల్‌ 30 తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. పరీక్షలకు సంబంధించి తాత్కాలిక షెడ్యూలును ప్రకటించారు. ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ 1 పరీక్షలు సెప్టెంబరులో, ఫార్మేటివ్‌ 2 అక్టోబరులో, సమ్మేటివ్‌ 1 నవంబరు, డిసెంబరులో, ఫార్మేటివ్‌ 3 పరీక్షలు జనవరిలో, ఫార్మేటివ్‌ 4 పరీక్షలు ఫిబ్రవరిలో, పది ప్రీ ఫైనల్‌ ఫిబ్రవరి 22 నుంచి, సమ్మేటివ్‌ 2 పరీక్షలు ఏప్రిల్‌లో జరుగుతాయని తెలిపారు. జీవో 117లో పాఠశాలలను 6 రకాలుగా వర్గీకరించిన ప్రభుత్వం, దానికి అనుగుణంగా అకెడమిక్‌ క్యాలెండర్లు విడుదల చేయలేదు. దీంతోపాటు పాఠశాలల పరిపాలన, బోధనా ప్రణాళికపై పాఠశాల విద్యాశాఖ మరో ఉత్తర్వు జారీ చేసింది.  ఇదిలావుంటే, జూలై 5 నుంచి పాఠశాలల నిర్వహణకు అధికారులు, ఉపాధ్యాయు లు సిద్ధంగా ఉండాలని పాఠశాలవిద్యా శాఖ ఆదేశించింది. ఇందుకోసం ఈ నెల 28 నుంచి జూలై 4 వరకు సన్నాహక కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టంచేసింది. స్కూలు భవనాలు, తరగతి గదులు శుభ్రం చేయించాలని, బెంచీలు, కుర్చీలు సరిచూసుకోవాలని సూచించింది. విద్యార్థుల నుంచి పాత పుస్తకాలు తీసుకుని బుక్‌ బ్యాంక్‌ నిర్వహించాలని, విద్యాదీవెన కిట్ల పంపిణీకి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది.  

Updated Date - 2022-06-27T16:42:51+05:30 IST