రిలయన్స్ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ మే 1 నుంచి

ABN , First Publish Date - 2021-04-23T16:40:52+05:30 IST

రిలయన్స్ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు మే 1 నుంచి

రిలయన్స్ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ మే 1 నుంచి

ముంబై : రిలయన్స్ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు మే 1 నుంచి కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఉద్యోగులతోపాటు వారి కుటుంబాల్లోని 18 సంవత్సరాల వయసు పైబడిన అర్హులకు వ్యాక్సిన్ ఇస్తామని, ఆలస్యం చేయకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరింది. ‘ఆర్-సురక్ష’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ ఓ లేఖలో వెల్లడించారు. 


రిలయన్స్ సంస్థల్లోని దాదాపు 3 లక్షల మంది ఉద్యోగులను ఉద్దేశించి ముఖేశ్, నీతా దంపతులు ఈ లేఖ రాశారు. రాబోయే వారాల్లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం మనం మరింత అప్రమత్తంగా వ్యవహరించవలసిన అవసరం ఉందన్నారు. భద్రత, ముందు జాగ్రత్త చర్యలు, పరిశుభ్రత విషయంలో రాజీపడకూడదని తెలిపారు. ఎటువంటి ఆలస్యం చేయకుండా తప్పనిసరిగా కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్‌ను చేయించుకోవాలని కోరారు. ఉద్యోగుల కుటుంబాల్లో 18 సంవత్సరాల వయసు పైబడినవారిని కూడా వ్యాక్సిన్ చేయించుకునే విధంగా ప్రోత్సహించాలని కోరారు. 


సాటి ఉద్యోగి కోవిడ్-19 వ్యాధితో బాధపడుతూ ఉంటే, వారికి టైమ్ ఆఫ్ అవసరమైతే, సహాయపడాలని రిలయన్స్ ఉద్యోగులకు అంబానీలు పిలుపునిచ్చారు. ఉద్యోగుల భద్రతకు, ఆరోగ్యానికే పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. ఈ సూత్రాన్ని అమలు చేయడానికి చేయవలసినదంతా చేయాలని, ఉద్యోగ బృందంలోని సభ్యులను, వారి కుటుంబ సభ్యులను కాపాడటం కోసం సహాయపడాలని కోరారు. 


Updated Date - 2021-04-23T16:40:52+05:30 IST