5G Spectrum : రిలయన్స్ జియో టాప్ బిడ్డింగ్.. తుస్సుమనిపించిన అదానీ గ్రూప్

ABN , First Publish Date - 2022-08-02T02:35:29+05:30 IST

5జీ స్పెక్ట్రమ్ వేలం (5G Spectrum Auction) సోమవారం (నేడు) ముగిసింది.

5G Spectrum : రిలయన్స్ జియో టాప్ బిడ్డింగ్.. తుస్సుమనిపించిన అదానీ గ్రూప్

న్యూఢిల్లీ : 5జీ స్పెక్ట్రమ్ వేలం (5G Spectrum Auction) సోమవారం (నేడు) ముగిసింది. భారతీయ టెలికం స్పెక్ట్రమ్ వేలం చరిత్రలోనే అత్యధికంగా ఈసారి రూ.1.5 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చాయని కేంద్ర టెలికం మంత్రి అశ్వని వైష్ణవ్ (Ashwini Vaishnaw) వివరాలు ప్రకటించారు. ఈ వేలంలో మొత్తం 10 బ్యాండ్‌ల 72,098 మెగాహెర్ట్జ్ (MHz) స్పెక్ట్రాన్ని అందుబాటులో ఉంచగా.. ఇందులో 51,236 ఎంహెచ్‌జెడ్ లేదా 71 శాతం అమ్ముడుపోయిందన్నారు. ఇందుకుగానూ రూ.150,173 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయని తెలిపారు. టెలికం కంపెనీలు తొలి ఏడాది ప్రభుత్వానికి రూ.13,365 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. దేశంలో అక్టోబర్ నాటికల్లా 5జీ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.


రిలయన్స్ జియో టాప్ బిడ్డర్..

బిలియనీయర్ ముకేష్ అంబానీ (Mukesh Ambani) సారధ్యంలోని ‘రిలయన్స్ జియో’ (Reliance Jio) టాప్ బిడ్డర్‌గా నిలిచింది. తాజా రౌండ్‌ వేలంలో విక్రయించిన స్పెక్ట్రమ్‌లో (Spectrum) దాదాపు సగ భాగం కొనుగోలుకు రూ.88,078 కోట్ల బిడ్ వేసింది. అన్ని బ్యాండ్ల స్పెక్ట్రమ్‌ని జియో కొనుగోలు చేసింది. 6-10 కిలోమీటర్ల పరిధిలో సిగ్నల్స్ అందించగలిగే సామర్థ్యమున్న 700 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌ను కూడా కొనుగోలు చేసింది. దీంతో దేశంలో 22 సర్కిల్స్‌లో పటిష్టమైన 5జీ బేస్‌ను ఏర్పాటు చేసుకోనుంది. 700 ఎంహెచ్‌జెడ్‌ స్పెక్ట్రాన్ని వినియోగిస్తే సిగ్నల్ టవర్ కవరేజీ పరిధి పెరుగుతుంది.


ఇక టెలికం రంగంలో ముకేష్ అంబానీకి పోటీ ఇచ్చేందుకు గౌతమ్ అదానీ (Gautam Adani) సన్నద్ధమవుతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో అదానీ గ్రూప్ (Adani Group) తుస్సుమనిపించింది. కేవలం రూ.212 కోట్ల విలువైన స్పెక్ట్రాన్ని మాత్రమే కొనుగోలు చేసింది. 400 ఎంహెచ్‌జెడ్(MHz) స్పెక్ట్రాన్ని కొనుగోలు చేయగా.. ఇది మొత్తం అమ్ముడైన స్పెక్ట్రమ్‌లో 1 శాతం కంటే తక్కువగా ఉంది. 26 జీహెచ్‌జెడ్ బ్యాండ్‌ స్పెక్ట్రాన్ని అదానీ గ్రూప్ కొనుగోలు చేసింది. అయితే ఇది పబ్లిక్ నెట్‌వర్కుల వినియోగం కోసం కాదు. ఇక టెలికం దిగ్గజం సునీల్ మిట్టల్‌కు చెందిన భారతీ ఎయిర్‌టెల్ (Bharati Airtel) వేర్వేరు బ్యాండ్లలో రూ.43,084 కోట్ల విలువైన స్పెక్ట్రాన్ని కొనుగోలు చేసింది. వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) లిమిటెడ్ రూ.18,784 కోట్ల స్పెక్ట్రాన్ని సొంతం చేసుకుంది.

Updated Date - 2022-08-02T02:35:29+05:30 IST