రిలయన్స్‌ క్యాపిటల్‌పై దివాలా చర్యలు

ABN , First Publish Date - 2021-11-30T08:21:08+05:30 IST

ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి గట్టి షాక్‌ తగిలింది. ఆయనకు చెందిన నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ...

రిలయన్స్‌ క్యాపిటల్‌పై దివాలా చర్యలు

కంపెనీ బోర్డును రద్దు చేసిన ఆర్‌బీఐ

 రుణ డిఫాల్ట్‌లు, గవర్నెన్స్‌ లోపాలే కారణం 

 సంస్థ తాత్కాలిక నిర్వహణాధికారిగా

  వై నాగేశ్వర్‌ రావు నియామకం 


ముంబై: ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి గట్టి షాక్‌ తగిలింది. ఆయనకు చెందిన నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఎన్‌బీఎ్‌ఫసీ) రిలయన్స్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌ బోర్డును రద్దు చేసిన భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ).. త్వరలోనే కంపెనీపై దివాలా పరిష్కార చర్యలను ప్రారంభించనుంది. కంపెనీ రుణ చెల్లింపులతో పాటు కార్పొరేట్‌ పాలన ప్రమాణాలను పాటించడంలో విఫలమవడంతో నియంత్రణ మండలి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలో కంపెనీ వ్యాపార కార్యకలాపాల నిర్వహణను పర్యవేక్షించేందుకు గాను బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వై నాగేశ్వర్‌ రావును నియమించినట్లు సోమవారం ఆర్‌బీఐ వెల్లడించింది. కంపెనీకి దివాలా పరిష్కార నిపుణుడిని నియమించాలని జాతీయ కంపెనీల చట్టం ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ముంబై బెంచ్‌కు త్వరలోనే దరఖాస్తు సమర్పించనున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. కాగా, దివాలా స్మృతి చట్టం ప్రకారంగా కంపెనీ రుణాన్ని పరిష్కరించే దిశగా ఆర్‌బీఐ ప్రారంభించిన చర్యలను రిలయన్స్‌ క్యాపిటల్‌ స్వాగతించింది. వాటాదారుల ప్రయోజనార్థం త్వరితగతిన రుణాల పరిష్కారం కోసం ఆర్‌బీఐ నియమిత అడ్మినిస్ట్రేటర్‌కు పూర్తిగా సహకరించనున్నట్లు కంపెనీ పేర్కొంది. 


రూ.40,000 కోట్ల అప్పులు: రిలయన్స్‌ క్యాపిటల్‌ ప్రస్తుత రుణ భారం రూ.40,000 కోట్లు. ఈ ఏడాది సెప్టెంబరులో నిర్వహించిన వాటాదారుల వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది. మొత్తం రుణభారంలో కంపెనీ డిబెంచర్‌ హోల్డర్లకు చెల్లించాల్సిన వాటాయే 95 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి గాను ఈ ఎన్‌బీఎ్‌ఫసీ రూ.1,156 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) మొత్తానికి కంపెనీ నష్టం రూ.9,287 కోట్లుగా నమోదైంది. 


మూడో ఎన్‌బీఎ్‌ఫసీ

ఆర్‌బీఐ దివాలా పరిష్కార చర్యలను ప్రారంభించనున్న మూడో ఎన్‌బీఎ్‌ఫసీ రిలయన్స్‌ క్యాపిటల్‌. ఇంతక్రితం, శ్రేయీ గ్రూప్‌నకు చెందిన ఎన్‌బీఎ్‌ఫసీలతోపాటు దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (డీహెచ్‌ఎ్‌ఫఎల్‌) పైనా ఇదే చర్యలు చేపట్టింది. డీహెచ్‌ఎ్‌ఫఎల్‌పై దివాలా పరిష్కార చర్యల ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఈ ప్రక్రియలో భాగంగా డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ను పిరమాల్‌ గ్రూప్‌ చేజిక్కించుకుంది. శ్రేయీ గ్రూప్‌పై దివాలా చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. 

Updated Date - 2021-11-30T08:21:08+05:30 IST