2021-22 ఆర్థిక సంవత్సరంలో 1.50 లక్షల మంది ఉద్యోగులను చేర్చుకున్న Reliance Retail

ABN , First Publish Date - 2022-05-09T22:47:09+05:30 IST

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ (Reliance Retail) 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1.50

2021-22 ఆర్థిక సంవత్సరంలో 1.50 లక్షల మంది ఉద్యోగులను చేర్చుకున్న Reliance Retail

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ (Reliance Retail) 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1.50 లక్షల మంది ఉద్యోగులను చేర్చుకుంది. గతేడాదితో పోలిస్తే ఇది ఏకంగా 70 శాతం ఎక్కువ కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య రెండింతలు కంటే ఎక్కువని రిలయన్స్ రిటైల్ స్ట్రాటజీ, బిజినెస్ హెడ్ గౌరవ్ జైన్ అన్నారు. కొత్త ఉద్యోగుల్లో 90 శాతం మంది స్టోర్ స్థాయి, డైరెక్టర్ స్టోర్, ఫీల్డ్ ఆపరేషన్లలో పనిచేస్తున్నట్టు చెప్పారు.


ఫ్యాషన్, గ్రోసరీ, ఎలక్ట్రానిక్స్, ఇ-కామర్స్, జువెల్లరీ తదితర రంగాల్లో రిలయన్స్ రిటైల్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఫ్యూచర్ గ్రూప్ టేకోవర్‌లో భాగంగా ఆ సంస్థకు చెందిన 25 వేల మందికిపైగా ఉద్యోగులను బదిలీ చేసింది. కొత్త ఉద్యోగులతో కలుపుకుని రిలయన్స్ రిటైల్ మొత్తం వర్క్ ఫోర్స్ 3,61,000 చేరుకుంది.


గతేడాది మార్చిలో ఈ సంఖ్య 2,08,000గా ఉండేది. ఈ ఏడాది మార్చి నాటికి రిలయన్స్ రిటైల్ అవుట్‌లెట్ల సంఖ్య 15 వేలను దాటేసింది. ఆదాయం రూ. 1,99,704 కోట్లకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో రిలయన్స్ రిటైల్ 793 స్టోర్లను ప్రారంభించినట్టు గౌరవ్ జైన్ తెలిపారు. ఈ లెక్కన రోజుకు కనీసం ఏడు షాపులను ప్రారంభిస్తున్నట్టు వివరించారు.

Read more