కేజీబీవీల్లో కాంట్రాక్ట్‌ టీచర్లకు కనీస వేతనం చెల్లించాల్సిందే

ABN , First Publish Date - 2022-10-02T09:43:46+05:30 IST

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ టీచర్లకు హైకోర్టులో ఊరట లభించింది. సాధారణ టీచర్లతో సమానంగా కాంట్రాక్ట్‌ టీచర్లుకూ కనీస వేతనం చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. సమాన పనికి - సమాన

కేజీబీవీల్లో కాంట్రాక్ట్‌ టీచర్లకు కనీస వేతనం చెల్లించాల్సిందే

సమాన పనికి - సమాన వేతనం: హైకోర్టు


అమరావతి, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ టీచర్లకు హైకోర్టులో ఊరట లభించింది. సాధారణ టీచర్లతో సమానంగా కాంట్రాక్ట్‌ టీచర్లుకూ కనీస వేతనం చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. సమాన పనికి - సమాన వేతనం చెల్లించాల్సిందేనంది. తక్కువ వేతనం చెల్లించడమంటే ఉద్యోగి గౌరవాన్ని తగ్గించడమేనని, దోపిడీని, బానిసత్వాన్ని ప్రోత్సహించడమేనని పేర్కొంది. 2022 రివైజ్డ్‌ పేస్కేల్‌ ప్రకారం పిటిషనర్లకు కనీస వేతనం కింద వచ్చే మొత్తంతో పాటు బకాయిలను కూడా ఆరు నెలల్లోగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు బదిలీలు నిలుపుదల చేయాలని పిటిషనర్లు చేసిన అభ్యర్థనపైనా ధర్మాసనం స్పందించింది. ఉద్యోగుల్లో ఇప్పటికే చాలా మంది బదిలీ అయ్యాయరని, కొద్దిమందే కోర్టుకు వచ్చారని గుర్తు చేసింది.


ఈ దశలో బదిలీలకు సంబంధించి ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ని రివర్ట్‌ చేస్తూ ఎలాంటి ఆదేశాలూ ఇవ్వలేమని స్పష్టం చేసింది. కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల కారణంగా బదిలీ కాని టీచర్లను ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇటీవల తీర్పు ఇచ్చారు. తమకు కనీస వేతనం అమలు చేయడం లేదని, నిబంధనలకు విరుద్ధంగా బదిలీలకు చర్యలు చేపడుతున్నారని పేర్కొంటూ కేజీబీవీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఎన్‌వీ సుమంత్‌, ఏఎ్‌సకేఎస్‌ భార్గవ్‌, గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపించారు. 

Updated Date - 2022-10-02T09:43:46+05:30 IST