కంది రైతుకు ఉపశమనం

ABN , First Publish Date - 2021-02-20T04:37:08+05:30 IST

కందులకు ప్రస్తుతం వస్తున్న రేటుతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.6,000గా నిర్ణయించగా, రూ.1,000 నుంచి రూ.1,500 అధిక ధరకు కొంటుండటంతో దిగుబడి తగ్గినా ఉపశమనం పొందుతున్నారు.

కంది రైతుకు ఉపశమనం
మహబూబ్‌నగర్‌ మార్కెట్‌కు వచ్చిన కందులు(ఫైల్‌)

దిగుబడి తగ్గినా.. పెరిగిన ధర

ఉమ్మడి జిల్లాలో క్వింటాలుకు రూ.7 వేలు

ప్రభుత్వ మద్దతు ధర కంటే అధిక రేట్లకు కొనుగోలు 

కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయని మార్క్‌ఫెడ్‌

ప్రైవేటు వ్యాపారులకు అమ్ముతున్న అన్నదాత


 కందులకు ప్రస్తుతం వస్తున్న రేటుతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.6,000గా నిర్ణయించగా, రూ.1,000 నుంచి రూ.1,500 అధిక ధరకు కొంటుండటంతో దిగుబడి తగ్గినా ఉపశమనం పొందుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కందులు ఎక్కువగా సాగు చేస్తారు. ఈ సారి మొక్కజొన్నకు బదులు కందులు వేయాలని ప్రభుత్వం చెప్పడంతో 3.10 లక్షల ఎకరాల్లో సాగు వేశారు. గతేడాది వరకు కందులను ప్రభుత్వం ఆధ్వర్యంలో మార్క్‌ఫెడ్‌ సంస్థ కొనుగోళ్లు చేసేది. కానీ ఈ ఏడాది కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను తేవడం, రాష్ట్ర ప్రభుత్వం ఇకపై కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయబోమని ప్రకటించడంతో ఇప్పటివరకు ఎక్కడా కేంద్రాలు ప్రారంభించ లేదు.

- ఆంధ్రజ్యోతి, వనపర్తి


ఉమ్మడి జిల్లాలో వానాకాలం సీజన్‌లో కంది పంట ప్రధానంగా సాగు చేస్తారు. సాగునీటి వనరులు లేని నారాయణపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాలో కంది సాగు బాగా జరుగుతుండగా.. వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో కూడా ఈ ఏడాది గణనీయంగా సాగైంది. మొక్కజొన్న స్థానంలో కందులు వేయాలని ప్రభుత్వం సూచించడంతో రైతులు ఆ మేరకు సాగు చేశారు. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది 3,10,942 ఎకరాల్లో కంది సాగవగా, అత్యధికంగా నారాయణపేట జిల్లాలో 1,37,690 ఎకరాల్లో సాగు చేశారు. మహబూబ్‌నగర్‌లో 71,533 ఎకరాల్లో, గద్వాలలో 40,000, నాగర్‌కర్నూల్‌లో 28,734, వనపర్తిలో 32,985 ఎకరాల్లో సాగు చేశారు. ఎకరాకు సగటున ఆరు క్వింటాళ్ల నుంచి 7.4 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో నారాయణపేట జిల్లాలో 71,395 మెట్రిక్‌ టన్నులు దిగుబడి రావాల్సి ఉంది. మహబూబ్‌నగర్‌లో 36,243.86 మెట్రిక్‌ టన్నులు, గద్వాల జిల్లాలో 24,000, వనపర్తిలో 19,790, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 21,915 మెట్రిక్‌ టన్నుల దిగుబడి రావాలి. మొత్తంగా గతేడాది కంటే పంట విస్తీర్ణం, దిగుబడి గణనీయంగా పెరిగింది. 


అధిక వర్షాలతో తగ్గిన దిగుబడి


ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది మూడు దశాబ్దాల కిందట నమోదైన వర్షపాతం నమోదైంది. కంది పంట వేసినప్పటి నుంచి పూతకు వచ్చే వరకు వర్షాలు కురిశాయి. కంది ఆరుతడి పంట కావడంతో నీటి నిల్వలు ఉండి.. ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. ధర ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందారు. ప్రస్తుతం వస్తున్న ధర ఉపశమనం కలిగిస్తోంది.


మొదట్లో కలవరం


కందుల కొనుగోళ్లపై స్పష్టత లేకపోవడంతో రైతులు మొదట్లో కలవరపడ్డారు. ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, గతేడాది కంటే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో కొనుగోలు కేంద్రాల సంఖ్య పెరుగుతుందని ఆశించారు. కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ధర రూ.6,000గా నిర్ణయించడంతో రంది ఉండదని అనుకున్నారు. అయితే సీఎం కేసీఆర్‌ పంటల కొనుగోళ్ల భారం ప్రభుత్వం తీసుకోదని, రైతులు తమకు ఇష్టం వచ్చిన చోట అమ్ముకోవచ్చని ప్రకటించారు. పంట చేతికి వస్తున్న దశలో సీఎం ప్రకటన కంది రైతులను ఆందోళనకు గురిచేసింది. మార్కెట్‌లలో కొనుగోళ్లు యధావిధిగా ఉంటాయని ప్రభుత్వం చెప్పినప్పటికీ, ప్రైవేటు వ్యాపారులదే ఇష్టారాజ్యం అవుతుందని, కనీస మద్దతు ధరకు నోచుకోని పరిస్థితి ఏర్పడుతుందని భావించారు. అయితే ప్రస్తుతం వస్తున్న ధరలు రైతులకు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. మద్దతు ధర కంటే రూ.1,000 నుంచి రూ.1,500 వరకు ధర ఎక్కువగానే వస్తుండటంతో ఈ ఏడు రైతులు నష్టాల నుంచి గట్టెక్కారు. అయితే ప్రతీ ఏడాది ఈ స్థాయిలో ధరలు లేకపోతే 


దిగుబడి తగ్గింది

కందులు ఏటా ఎకరాకు ఐదు నుంచి ఏడు క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. ఏడు క్వింటాళ్లు వస్తే బాగా వచ్చినట్లు అనుకునే వాళ్లం. కానీ ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా దిగుబడులు పడిపోయాయి. ఎకరాకు 3 క్వింటాళ్లే వచ్చాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే మద్దతు ధర వస్తుందని ఆశించాం. ప్రభుత్వం కేంద్రాలు ఏర్పాటు చేయకపోయినా.. ప్రైవేట్‌ వ్యాపారులు మంచి ధరనే పెడుతున్నారు. దిగుబడి తగ్గినా ధర మంచిగా రావడం కలిసి వచ్చింది. 

- గొల్ల బుచ్చన్న, నర్సింగాపురం, మదనాపూర్‌

Updated Date - 2021-02-20T04:37:08+05:30 IST