ఉపశమనం

ABN , First Publish Date - 2022-06-22T06:24:36+05:30 IST

ఉమ్మడి జిల్లాలో ఈ వేసవిలో తాగునీటి గండం నుంచి ఉపశమనం కలగనుంది. సాగర్‌నీరు ఆధారిత ప్రాంతంలోని తాగునీటి వనరులను నింపుకొనేందుకు వీలుగా సాగర్‌ జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు.

ఉపశమనం

తాగునీటి కోసం సాగర్‌ జలాలు విడుదల

ఉమ్మడి జిల్లాకు ఐదు టీఎంసీలు కోరిన యంత్రాంగం

రామతీర్థంకు తొలి ప్రాధాన్యం

ఒకేసారి ఏబీసీ ప్రాంతానికీ సరఫరా

రెండు రోజుల్లో జిల్లాలోకి వచ్చే అవకాశం

ఒంగోలు, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో ఈ వేసవిలో తాగునీటి గండం నుంచి ఉపశమనం కలగనుంది. సాగర్‌నీరు ఆధారిత ప్రాంతంలోని తాగునీటి వనరులను నింపుకొనేందుకు వీలుగా సాగర్‌ జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. కుడి కాలువ పరిధిలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని తాగునీటి వనరుల కోసం 10 టీఎంసీలు వాడుకొనేందుకు వీలుగా సాగర్‌ నుంచి సోమవారం మధ్యాహ్నం తర్వాత నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం డ్యామ్‌ నుంచి కుడి కాలువకు ఐదు వేల క్యూసెక్కులు వస్తుండగా మాచర్ల దిగువ ప్రాంతంలోని బుగ్గవాగులోకి ఆ నీరు చేరింది. ప్రస్తుతం బుగ్గవాగు డెడ్‌స్టోరేజీలో ఉండగా కొంతమేర నీరు వచ్చాక బుధవారం మధ్యాహ్నం అక్కడి నుంచి దిగువకు ఇవ్వనున్నట్లు సమాచారం. అలా బుగ్గవాగు నుంచి వదిలే నీరు రెండురోజుల్లో జిల్లాలోకి రానుంది. తొలి ప్రాధాన్యంగా రామతీర్థంను నింపే యోచనలో అధికారయంత్రాంగం ఉంది.


డెడ్‌స్టోరేజీలో రామతీర్థం

ఉమ్మడి జిల్లా పరిధిలో సాగర్‌ కాలువల ఆధారంగా 1.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న రామతీర్థం రిజర్వాయర్‌తోపాటు పదికిపైగా సీపీడబ్ల్యూ స్కీమ్‌లకు చెందిన ఎస్‌ఎస్‌ ట్యాంకులు, 222 తాగునీటి చెరువులు ఉన్నాయి. అందులో ప్రస్తుతం బాపట్ల జిల్లాలోకి వెళ్ళిన ఏబీసీ ప్రాంతంలో 124 చెరువులు ఉండగా మిగిలినవి కుడి ప్రధాన కాలువ 85/3 నుంచి ఒంగోలు వరకు ఉన్నాయి. కాగా గత నెలాఖరులో తాగునీటి కోసం డ్యామ్‌ నుంచి నీటిని ఇచ్చినట్లే ఇచ్చి నిలిపేశారు. అప్పటికి ఏబీసీ ప్రాంత తాగునీటి వనరులలో 50శాతం వరకు నీరు ఉండగా కుడి ప్రధానకాలువ ప్రాంతంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రత్యేకించి ఒంగోలు కార్పొరేషన్‌లోని ఎస్‌ఎస్‌ ట్యాంకులు అడుగంటిపోగా రామతీర్థం డెడ్‌స్టోరేజీలోకి వెళ్లింది. ఇతర చెరువుల్లోనూ కొద్దిగానే నీళ్లు ఉన్నాయి. దాంతో వేసవి తాగునీటిపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఒంగోలు సమస్యను కొంతమేర అయినా తీర్చేందుకు ఇప్పటికా రామతీర్థంలో డెడ్‌స్టోరేజీకిపైన ఉన్న కొద్దిపాటి నీటిని ఎస్‌ఎస్‌ ట్యాంకులకు వదిలారు. అదేసమయంలో ఉమ్మడి జిల్లాలో తాగునీటి అవసరాలకు ఐదు టీఎంసీలు తక్షణం ఇవ్వాలని జిల్లా యంత్రాంగం ఉన్నతాధికారులను కోరారు. ఈ విషయమై ఈనెల 7న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖ కూడా రాశారు. ఇలాంటి పరిస్థితే ఎగువన ఉన్న పల్నాడు, గుంటూరు జిల్లాలోనూ ఉన్నట్లు సమాచారం. 


10 టీఎంసీలు కేటాయింపు

ఈ నేపథ్యం లో సాగర్‌ నుంచి సోమవారం కుడి కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ విడత తాగునీటి అవసరాల కోసం రెండు ఉమ్మడి జిల్లాలకు కలిపి 10 టీఎంసీలు నీటిని కేటాయించగా అందు లో ప్రకాశం జిల్లాకు సగం ఇచ్చే అవకాశం ఉంది. అందులో రామతీర్థంకు 1.50 టీఎంసీలు అవసరం కాగా కుడి ప్రధానకాలువ 85/3 నుంచి ఒంగోలు వరకు ఉండే ఇతర ఎస్‌ఎస్‌ ట్యాంకులు, 98 చెరువులకు మరొక టీఎంసీ, అలాగే ఏబీసీ ప్రాంతానికి 1.20 టీఎంసీలు అవసరం. మిగిలిన 1.30 టీఎంసీల నీరు వృథా కింద లెక్కిస్తున్నారు. కాగా బుగ్గవాగు నుంచి వచ్చే నీటిని ఒకేసారి కుడి ప్రధాన కాలువ 85/3 తోపాటు ఏబీసీకి కూడా ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. 85/3 వద్దకు వచ్చే నీటిని మధ్యలో ఎక్కడ ఇతర కాలువలకు పోకుండా ఆపి నేరుగా రామతీర్థం ప్రాజెక్టులోకి చేర్చి అది నిండిన తర్వాతే ఇతర వనరు లకు నింపేలా జిల్లా ఇరిగేష న్‌ అధికారులు  కిందిస్థా యి అధికారులను ఆదేశించారు. 


Updated Date - 2022-06-22T06:24:36+05:30 IST