మతమనే క్యాన్సర్‌ మనకొద్దు!

ABN , First Publish Date - 2022-04-27T07:07:29+05:30 IST

మతం, కులం పేరిట కొంతమంది చిల్లరమల్లర రాజకీయాలు

మతమనే క్యాన్సర్‌  మనకొద్దు!

  • తుపాకులు, కర్ఫ్యూలంటే పెట్టుబడులు రావు
  • మతం పేరుతో కొట్లాటలు, కాట్లాటలు వద్దు.. ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టుకోవద్దు
  • మతం పిచ్చి పట్టుకుంటే ప్రమాదంలో పడతాం
  • కులమతాల పేరిట రాజకీయాలు చేస్తున్నారు
  • శాంతి సామరస్యాలుంటేనే పెట్టుబడులు
  • ఇక నుంచి విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి 
  • వాళ్లవి రాజకీయ సభలు.. మనది ఆరోగ్య సభ 
  • అల్వాల్‌ టిమ్స్‌ ప్రాంగణంలో ప్రసూతి ఆస్పత్రి
  • ప్రజల దీవెనలు ఇలాగే కొనసాగాలి: కేసీఆర్‌ 
  • మూడు టిమ్స్‌ ఆస్పత్రులకు శంకుస్థాపన


లా అండ్‌ ఆర్డర్‌ బాగుంటేనే వెల్లువలా పెట్టుబడులు వస్తాయి. జీవనోపాధి దొరుకుతుంది. పొద్దున లేస్తే కులం, మతం పేరుతో కాట్లాటలు, కొట్లాటలు, కర్ప్యూలు, ఫైరింగ్‌లుంటే ఎవరూ పెట్టుబడులు పెట్టరు. అటువంటి క్యాన్సర్‌ను తెచ్చుకోవద్దు. తాత్కాలికంగా గమ్మత్తుగా, మజా ఉంటుంది, కానీ శాశ్వతంగా ప్రయోజనాలు దెబ్బతింటాయి.


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 26 (ఆంఽధ్రజ్యోతి): మతం, కులం పేరిట కొంతమంది చిల్లరమల్లర రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. దీనివల్ల సామరస్య వాతావరణం చెడిపోయి, మతమనే క్యాన్సర్‌ జబ్బు పట్టుకుంటే ప్రమాదంలో పడిపోతామని ఆయన హెచ్చరించారు. అన్ని కులాలను మతాలను హైదరాబాద్‌ ఆదరిస్తోందని, అటువంటి దాన్ని చెడగొడితే ఆగమైపోతామని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ పరిధిలోని మూడు టిమ్స్‌ ఆస్పత్రులకు మంగళవారం సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు.  తొలుత కొత్తపేటలోని గడ్డిఅన్నారంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య భూమి పూజను నిర్వహించారు. తర్వాత ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రి ఆవరణలో, అనంతరం అల్వాల్‌లో వరుసగా భూమి పూజను నిర్వహించారు. ఈ సందర్భంగా అల్వాల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.


‘‘రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. కొందరు మతం, కులం పేరిట రాజకీయాలు చేస్తున్నారు. అన్ని కులాలను, మతాలను సమానంగా ఆదరించే గొప్పదేశం మనది. ఈ సామరస్య వాతారణం చెడిపోతే ఎటూగాకుండా పోతాం. ఒకసారి ఆ క్యాన్సర్‌ జబ్బు మనకు పట్టుకుంటే చాలా ప్రమాదంలో పడిపోతాం’’ అని సీఎం అన్నారు. ‘‘ఫలానా వారి షాపులో పూలు కొనవద్దు, ఫలానా షాపులో ఇది, అది కొనవద్దు అంటున్నారు. ప్రజలు ఆలోచన చేయాలి’’ అని పేర్కొన్నారు. 13 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో పనిజేస్తున్నారని, వారందరినీ అక్కడి ప్రభుత్వాలు పంపించివేస్తే వారికి ఉద్యోగాలు ఎవరివ్వాలని కేసీఆర్‌ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో రూ.2.30 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించగలిగామని. సుమారు 15 లక్షల మందికి ఆ ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు దొరికాయని సీఎం చెప్పారు.


ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 14 వేల ఎకరాల్లో ఫార్మా యూనివర్సిటీ, ఫార్మా సిటీని తీసుకురాబోతున్నామని చెప్పారు. జినోమ్‌వ్యాలీలో టీకాల ఉత్పత్తిలో ప్రపంచానికే రాజధానిగా ఉన్నామని, 33 శాతం వ్యాక్సిన్స్‌ను ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో అన్ని రకాల భాషలు మాట్లాడేవారుంటారని,అందరూ కలిసే బతుకుతారని పేర్కొన్నారు. ఇలా ఉంటేనే పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా ముందుకు వస్తారని వివరించారు.


‘‘ కత్తులు, కర్ప్యూలుంటాయి. తన్నుకుంటారు. అనే వాతావరణం ఉంటే ఎవరైనా మనదగ్గరకు వస్తారా? శాంతి, సామరస్యం, లా అండ్‌ ఆర్డర్‌ బాగుంటేనే వెల్లువలా పెట్టుబడులు వస్తాయి. పరిశ్రమలతోపాటు జీవనోపాధి దొరుకుతుంది. పొద్దున లేస్తే కులం, మతం పేరుతో కాట్లాటలు, కొట్లాటలు, కర్ప్యూలు, ఫైరింగ్‌లుంటే ఎవరూ పెట్టుబడులు పెట్టరు.’’ అని కేసీఆర్‌ హెచ్చరించారు. అటువంటి క్యాన్సర్‌ను తెచ్చుకోవద్దని తెలంగాణ బిడ్డగా, దేశ రాజకీయాల్లో సీనియర్‌ నాయకుడిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం పేర్కొన్నారు. తాత్కాలికంగా గమ్మత్తుగా, మజా ఉంటుందని, కానీ శాశ్వతంగా ప్రయోజనాలు దెబ్బతింటాయని అన్నారు. అటువంటి సంకుచిత అంశాలకు తెలంగాణలో ఆస్కారం ఇవ్వవద్దని ప్రజలకు సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. 



మనది ఆరోగ్య సభ

తెలంగాణ ఏర్పాటైన తర్వాత వైద్యంలో ఊహించని కార్యక్రమాలు చేశామని సీఎం కేసీఆర్‌ వివరించారు. నిలోఫర్‌లో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వారు చనిపోయి, మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు డబ్బులు లేవంటే... ఒక ప్రైవేటు అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి పంపామన్నారు. అటువంటి సమయంలోనే వెంటనే నిర్ణయం తీసుకుని, పరమపద వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సదుపాయం అమెరికా, లండన్‌తో పాటు మనదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నామన్నారు. ఈ రోజు మిగిలిన అన్ని రాజకీయ పార్టీలన్ని రాజకీయ సభలు జరుపుతుంటే, మనం మాత్రం ఆరోగ్య సభను పెట్టుకున్నామని సీఎం చెప్పారు. 30 ఎకరాలుండే స్థలంలో టిమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొవిడ్‌ లాంటి వైర్‌సలు భవిష్యత్‌లో కూడా వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.


హైదరాబాద్‌, దాని చుట్టు పక్కలా 1.64 కోట్లమంది జనాభా ఉందని చెప్పారు. దీంతో హైదరాబాద్‌లో ఉండే ఆస్పత్రులపై భారం పడుతుందన్నారు. అందుకే నాలుగు ఆస్పత్రులతో పాటు, నిమ్స్‌ను 2 వేల పడకలతో విస్తరిస్తున్నట్లు తెలిపారు. ఎయిమ్స్‌ తరహాలో ఇక్కడ టిమ్స్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో 16 స్పెషాలిటీ, 15 సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలందుతాయని సీఎం తెలిపారు. టిమ్స్‌ ఆస్పత్రుల్లో పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ స్థాయిలో వైద్యమందిస్తామని సీఎం వెల్లడించారు. ఆల్వాల్‌ టిమ్స్‌ ప్రాంగణంలోనే ప్రసూతి ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని మంత్రి హరీశ్‌రావును ఆదేశిస్తున్నట్లు తెలిపారు. దక్షిణాన గచ్చిబౌలి, పశ్చిమాన చెస్ట్‌ ఆస్పత్రిలో, తూర్పున గడ్డిఅన్నారంలో టిమ్స్‌లను ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. ఉత్తర భాగంలో ఆల్వాల్‌లో మరో టిమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎక్కడికక్కడ జనాభాకు సేవలందించేందుకే వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు.




రాష్ట్రంలో కరెంటుపోతే వార్త..


తలసరి ఆదాయంలో మహారాష్ట్ర, తమిళనాడు,గుజరాత్‌ను తెలంగాణ మించిపోయిందని కేసీఆర్‌ అన్నారు. ప్రధాని స్వరాష్ట్రమైన గుజరాత్‌లో పెన్షన్‌ రూ. 500 ఇస్తుంటే, తెలంగాణలో రూ. 2 వేలు ఇస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరెంటు పోతే వార్త అని, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కరెంటు ఉంటే వార్త అని అన్నారు. గుజరాత్‌లో రైతులు రోడ్లమీదకు వచ్చి కరెంటు కోసం ఆందోళన చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇస్తున్నామన్నారు. గతంలో వేసవిలో కరెంటు కోతలతో భయంకర పరిస్థితులుండేవన్నారు. నేడు బిందెల ప్రదర్శన బంద్‌ అయిందని, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, ధాన్యం పండించడంలో దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచినట్లు సీఎం తెలిపారు.


ఇక నుంచి ప్రభుత్వం విద్య, వైద్యంపైనే ఎక్కువ దృష్టిపెడతామని చెప్పారు. రాబోయే రోజుల్లో గురుకులాలు పెంచుతామన్నారు. అన్ని జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పెద్దరాష్ట్రాలు కంటే మెరుగ్గా ఇవన్నీ చేస్తున్నామంటే ప్రజల దీవెన వల్లే సాధ్యమైందన్నారు. తెలంగాణ పచ్చబడాలని, ఇంకా ముందుకుపోవాలని ఆకాంక్షించారు. దేశానికే తలమానికంగా తెలంగాణ ఉండాలన్నారు. అందుకోసం ఎంత ఽఽధైర్యంగానైనా ముందుకెళ్తామని, ఎవరితోనైనా పోరాడతామని స్పష్టం చేశారు. ఈ దుష్టశక్తుల బారినుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటామని  చెప్పారు. జాగా దొరకని ప్రాంతంలో టిమ్స్‌ కోసం స్థలాన్ని గుర్తించిన స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రి హరీశ్‌రావుకు సీఎం అభినందనలు తెలిపారు. అంతకుముందు ఉదయం ఎల్బీనగర్‌ వద్ద గడ్డిఅన్నారం, ఎర్రగడ్డ చెస్ట్‌ ఆస్పత్రి ప్రాంగణంలో టిమ్స్‌ ఆస్పత్రులకు సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేశారు. 




లా అండ్‌ ఆర్డర్‌ బాగుంటేనే వెల్లువలా పెట్టుబడులు వస్తాయి. జీవనోపాధి దొరుకుతుంది. పొద్దున లేస్తే కులం, మతం పేరుతో కాట్లాటలు, కొట్లాటలు, కర్ప్యూలు, ఫైరింగ్‌లుంటే ఎవరూ పెట్టుబడులు పెట్టరు. అటువంటి క్యాన్సర్‌ను తెచ్చుకోవద్దు. తాత్కాలికంగా గమ్మత్తుగా, మజా ఉంటుంది, కానీ శాశ్వతంగా ప్రయోజనాలు దెబ్బతింటాయి.



వైద్యంలో యూపీది చివరి స్థానం- మంత్రి హరీశ్‌రావు

‘‘దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య రంగంలో మూడో స్థానంలో ఉంది. ఈ విషయాన్ని కేంద్రమే పార్లమెంట్‌లో తెలిపింది. డబులు ఇంజన్‌ ప్రభుత్వం, డబులు ఇంజన్‌ గ్రోత్‌ అని బీజేపీ గొప్పగా చెబుతోంది. డబులు ఇంజన్‌ ప్రభుత్వం ఉన్న ఉత్తర ప్రదేశ్‌ ఆరోగ్య రంగంలో చిట్టచివరి స్థానంలో ఉంది. ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం ఆరోగ్య ేసవలు అందించడంలో చిట్టచివరి స్థానం ఉంది’’ అని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం అల్వాల్‌లో టిమ్స్‌ ఆస్పత్రి భూమి పూజ కార్యక్రమం అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సమైక్య పాలనలో కార్పొరేట్‌ ఆసుపత్రులు మాత్రమే పుట్టగొడుగుల్లా వెలిశాయన్నారు. రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌ నలుదిక్కులా నాలుగు ఆసుపత్రులను సీఎం ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.


కాంగ్రె్‌సనేతలు, ఆంధ్రా పాలకులు ఉంటే ఎక్కడ ఏం దొరుకుతుందని చూేసవారు తప్ప. భవిష్యత్తు అవసరాల కోసం ఆలోచించేవారు కాదని మంత్రి విమర్శించారు. పేదలు కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకునే పరిస్థితి లేదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే సీఎం కేసీఆర్‌ కొత్తగా ఆరువేల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 7500 పడకలు అందుబాటులోకి తీసుకువస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కొత్తగా మూడువేల ఐసీయూ పడకలను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.


ప్రస్తుతం అన్ని జిల్లాల్లో మెడికల్‌ కాలేజీలు, నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేసీఆర్‌ జిల్లాకు ఓ మెడికల్‌ కాలేజి అంటే.. ప్రధాని కూడా అదే కాపీ కొట్టి జిల్లాకు ఓ మెడికల్‌ కాలేజి పెడతామంటున్నారన్నారు. వైౖద్య ఆరోగ్య రంగంలో తమిళనాడు అగ్రస్థానంలో ఉండేదని, కానీ నేడు ఆ రాష్ర్టాన్ని వెనక్కు నెట్టి తెలంగాణ ముందుకు వెళ్లిందన్నారు. నాలుగు టిమ్స్‌ ఆసుపత్రులు వచ్చాక రాబోయే రోజుల్లో పేదలు ఒక్క రూపాయి అవసరం లేకుండా వైద్య ేసవలు పొందవచ్చన్నారు. 


Updated Date - 2022-04-27T07:07:29+05:30 IST