Prophet row: భారత్ అంతర్గత వ్యవహారమన్న Dhaka

ABN , First Publish Date - 2022-06-13T01:21:21+05:30 IST

మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల వ్యవహారం పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారమని బంగ్లాదేశ్..

Prophet row: భారత్ అంతర్గత వ్యవహారమన్న Dhaka

ఢాకా: మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల వ్యవహారం పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారమని బంగ్లాదేశ్ సమాచార, ప్రసార శాఖ మంత్రి ముంత్రి డాక్టర్ హసన్ మహమూద్ అన్నారు. విజిటింగ్ ఇండియన్ జర్నలిస్టులతో శనివారం ఢాకాలో జరిగిన ముఖాముఖీలో ఆయన మాట్లాడుతూ, ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన వారిపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని అభినందించారు. ఈ విషయాన్ని పెద్దది చేయాలని తాము అనుకోవడం లేదని చెప్పారు.


ప్రవక్తపై వ్యాఖ్యల అంశంపై డజనుకు పైగా ముస్లిం దేశాలు, 57 దేశాల సభ్యత్వం కలిగిన ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) భారత్‌ను తప్పుపట్టిన నేపథ్యంలో బంగ్లా మౌనంగా ఉండటంపై అడిగిన ప్రశ్నకు మహమూద్ సమాధానమిస్తూ,  ప్రవక్తను ఎప్పుడు, ఎవరు అమానించినా తాము ఖండిస్తూనే ఉంటామని, ఆ విషయంలో తాము రాజీ పడేది లేదని అన్నారు. అయితే భారత ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకుందని, అందుకు భారత్‌ను అభినందిస్తున్నామని, ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని చెప్పారు.


మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలకు నిరసనగా ఢాకాలో కొన్ని ముస్లిం సంస్థలు శుక్రవారంనాడు ప్రదర్శనలు నిర్వహించాయి. మహమ్మద్ ప్రవక్తను వివాదంలోకి లాగినప్పటికీ నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని విమర్శించడంలో బంగ్లా ప్రభుత్వం విఫలమైందని విపక్ష పార్టీలు, ఇస్లామిక్ సంస్థలు ఆరోపించాయి. అయితే, బంగ్లా ప్రభుత్వం మాత్రం ఎలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేయకుండా సంయమనంతో వ్యవహరించింది. అనవసరమైన గందరగోళం సృష్టిస్తూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికార అవామీ లీగ్ ఆఫీస్ బేరర్‌గా కూడా ఉన్న మహమూద్ హెచ్చరించినట్టు బంగ్లా మీడియా తెలిపింది. ''దేశంలోని (భారత్) రాజకీయాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ నేతలు మాట్లాడుతుంటారు. దానిపై మనం వివరణలు అడక్కూడదు. అర్ధం చేసుకోవాలి. వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం మనకు లేదు'' అని మహమూద్ అన్నారు.


బంగ్లా ప్రధాని హసీనా, భారత్ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు సరికొత్త పుంతలు తొక్కాయనీ, 1971లో బంగ్లా విముక్తి పోరాటంలో భారత ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచినందుకు తాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. బంగ్లా ప్రజల కోసం భారత సైనికులు రక్తం చిందించారని, నిజానికి ఇరుదేశాల ప్రజలు రక్తసంబంధీకులమని చెప్పారు. రెండు దేశాల మధ్య వర్తక, కమ్యూనికేషన్ సంబంధాలు బలంగా ఉన్నాయని, అన్ని విధాలుగా మోదీ ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు వెన్నుదన్నుగా నిలుస్తోందని ప్రశంసలు కురిపించారు.

Updated Date - 2022-06-13T01:21:21+05:30 IST