రెమ్‌డెసివిర్‌ బ్లాక్‌మార్కెట్‌

ABN , First Publish Date - 2021-05-07T06:47:28+05:30 IST

రెమ్‌డెసివిర్‌ బ్లాక్‌మార్కెట్‌

రెమ్‌డెసివిర్‌ బ్లాక్‌మార్కెట్‌

ముఠాలుగా ఏర్పడి దందా

చేతులు మారుతున్న లక్షల రూపాయలు

ప్రైవేటు ఆస్పత్రుల హస్తం

ఎంజీఎం కేంద్రంగా చీకటి వ్యాపారం

ఉన్నతాధికారి అండతో విక్రయం

రోగులకు ఇవ్వకుండా తప్పుడు రికార్డులు

బయట వాడిన తర్వాత ఖాళీ సీసాలు తిరిగి ఆస్పత్రికి..


హన్మకొండ, మే 6 (ఆంధ్రజ్యోతి) : వరంగల్‌ నగరంలో  రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల బ్లాక్‌ మార్కెట్‌ దందా జోరుగా సాగుతోంది. కరోనా ఉధృతి వల్ల రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ అవసరం పెరిగింది. ఇదే అవకాశంగా తీసుకొని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది వీటిని బ్లాక్‌మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. గురువారం ఒక్క రోజే ఎమినిమిది మందిని పోలీసులు పట్టుకున్నారు. ఇదే దందాకు పాల్పడుతున్న ఒక మహిళను బుధవారం పట్టుకున్నారు. పట్టుపడకుండా తెలివిగా ఈ దందాను సాగిస్తున్నవారు ఇంకా ఎంతోమంది ఉన్నారు. పట్టుబడ్డ వాళ్ళంతా వివిధ హాస్పిటల్స్‌, మందుల షాపుల్లో పని చేస్తున్నవారే. ఎంజీఎం ఆస్పత్రితో సంబంధం ఉన్నవారు.. ఫార్మసీ రంగంలో ఉండడంతో పాటు పలు మందుల కంపెనీలతో ఉన్న పరిచయాలను ఆసరా చేసుకొని ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారు. 

ఈ దందా వెనుక ప్రభుత్వ ఆస్పత్రుల్లో కీలక పదవుల్లో ఉన్న అధికారులు, కార్పొరేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాల హస్తం ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి. వీరి సహకారం లేకుండానే రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లు బ్లాక్‌ మార్కెట్‌లోకి రావన్న వాదన వినిపిస్తోంది. గురువారం పోలీసులు వేరు వేరుగా రెండు ముఠాలను పట్టుకున్నారు. వీరి వద్ద ఉన్న రెమ్‌డిసివర్‌ ఇంజక్షన్లతో పాటు నదును స్వాదీనం చేసుకున్నాయి. ఒక ముఠాలోని ముగ్గురు సభ్యుల్లో ఒకరు హన్మకొండలోని ఓ పేరున్న కార్పొరేట్‌ ఆస్పత్రిలో పనిచేసే ఫార్మసిస్టు. దందాలో కీలక వ్యక్తి. ఆయనకు ఈ ఇంజక్షన్లు లభించడం వెనుక ఆ ఆస్పత్రి యాజమాన్యం హస్తం ఉండవచ్చునన్న ప్రచారం జరుగుతోంది. హన్మకొండ బస్‌స్టేషన్‌లో పట్టుబడ్డ అయిదుగురు సభ్యుల బ్లాక్‌ మార్కెట్‌ ముఠాకు ఏకంగా ఎంజీఎం ఆస్పత్రిలోని కొందరు ఉన్నతాధికారుల సహకారం ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసుల విచారణంలో సభ్యులు ఈ విషయాన్ని వెల్లడించినట్టు సమాచారం. ఎంజీఎం ఆస్పత్రిలో కీలక పదవిలో ఉన్న ఒక ఉన్నతాధికారి ప్రోత్సాహంతోనే వారు ఈ దందాను కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఎంజీఎం కొవిడ్‌వార్డులో రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లను రోగులకు ఇవ్వకుండానే ఇచ్చినట్టు రికార్డుల్లో  రాస్తున్నారు. వీటిని ఆస్పత్రి ఉన్నతాధికారి పోత్సాహంతోనే దొడ్డిదారిన ఈ మూఠా సభ్యులకు చేరవేస్తున్నారు. రూ.2400లకు దొరికే ఈ ఇంక్షన్లను డిమాండ్‌ను బట్టి రూ.35వేల నుంచి రూ.40వేల వరకు విక్రయిస్తున్నారు. ఇలా వచ్చిన సొమ్ములో సింహభాగం ఆ అధికారికి పోగా.. మిగతాది సభ్యులు వాటాలు వేసి పంచుకుంటున్నారు. 

రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్ల వినియోగంలో అక్రమాలు జరగకుండా నిరోధించేందుకు వాడిన ప్రతీ ఇంజక్షన్‌ బాటిల్‌ను తనకు చూపించాలని వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు ఆదేశించారు. దీంతో బయట ఈ ఇంజక్షన్‌ను వినియోగించిన తర్వాత ఖాళీ సీసాలను తీసుకువచ్చి తిరిగి ఎంజీఎం కొవిడ్‌ వార్డులో అప్పగిస్తున్నారు. దీనితో ఎంజీఎంలోని కొవిడ్‌ రోగులకు ఇవ్వకపోయినా ఇచ్చినట్టు   లెక్కసరిపెడుతున్నారు. బ్లాక్‌ మార్కెట్‌ ముఠాలోని సభ్యులు ఇంజక్షన్‌ను వాడిన తర్వాత ఖాళీ  సీసాలు తిరిగి ఇచ్చే షరతుతోనే విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ముఠాలోని సభ్యులను లోతుగా విచారిస్తే విస్తుపోయే నిజాలు ఇంకా అనేకం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎంజీఎంలోని వైద్యాధికారులు, డాక్టర్లు, పారామెడికల్‌ సిబ్బంది ఆడింది ఆట పాడింది పాటగా సాగుతుండడంతో ఇలాంటి చీకటి వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. కొవిడ్‌ వార్డులో ఏం జరుగుతుందో, ఏ మందులు ఎంత మందికి ఇస్తున్నారో లెక్కలు చూసేవారు లేక విలువైన ప్రాణాధార మందులు, ఆక్సిజన్‌ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇటీవల ఎంజీఎం ఆస్పత్రికి కలెక్టర్‌ నోడల్‌ ఆఫీజర్లను నిమించారు. ఇందులో భాగంగా కొవిడ్‌ వార్డు పర్యవేక్షణ బాధ్యతను ఇద్దరు నోడల్‌ అధికారులకు అప్పగించారు. అయినా బ్లాక్‌ మార్కెట్‌ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.

Updated Date - 2021-05-07T06:47:28+05:30 IST