రెమ్‌డెసివర్‌ పక్కదారి!

May 8 2021 @ 23:38PM

కార్పొరేట్‌/ప్రైవేటు ఆస్పత్రుల అరాచకం

ప్రభుత్వం సరఫరా చేసిన ఇంజక్షన్లు బ్లాక్‌ మార్కెట్‌కు...

ఆస్పత్రుల్లో రోగులకు అందించని యాజమాన్యాలు

భారీ ధరకు కుటుంబ సభ్యులతో కొనిపించేందుకు యత్నం

ఉన్నతాధికారులు దృష్టిపెట్టకపోతే కష్టమే

ఫిర్యాదు చేసేందుకు నంబర్‌ కేటాయించాలని బాధితుల డిమాండ్‌


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 


‘రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ బయట తెచ్చుకోవాలని ప్రైవేటు/కార్పొరేట్‌ ఆస్పత్రులు వైరస్‌ బాధిత కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకూడదు. ఆస్పత్రులు ఈ ఇంజక్షన్‌ అవసరమయ్యే వారి వివరాలతో ఇండెంట్‌ పెడితే..సరఫరా చేస్తాం. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ జాబితాలో వున్న ఏ ఆస్పత్రి అయినా...రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ బయట నుంచి తెచ్చుకోమంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చు’ 

- జిల్లా అడిషనల్‌ డ్రగ్‌ కంట్రోలర్‌ రజిత


‘మీ పేషెంట్‌ పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంది. అర్జంట్‌గా రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ ఇవ్వాలి. ఆస్పత్రిలో లేవు. బయట నుంచి తెచ్చుకోండి. ఆలస్యమైతే కష్టం. ఎంత వేగంగా ఏర్పాటు చేసుకోగలిగితే అంత మంచిది’ 

- జాతీయ రహదారికి ఆనుకుని వున్న ఒక కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్‌ బాధితుడి కుటుంబ సభ్యుడితో ఆస్పత్రి సిబ్బంది.   


....అధికారుల ప్రకటనలకు, నగరంలో ఆస్పత్రులు వ్యవహరిస్తున్న తీరుకు పొంతన వుండడం లేదు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ పరిధిలో ఉన్నప్పటికీ..అనేక ఆస్పత్రులు రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ బయటినుంచి తెచ్చుకోవాలంటూ బాధిత కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సెకండ్‌వేవ్‌ ప్రారంభమైన తరువాత ఈ ఇంజక్షన్‌కు డిమాండ్‌ పెరిగింది. దీనిని క్యాష్‌ చేసుకునేందుకు కొంతమంది బ్లాక్‌ మార్కెట్‌కు తెరలేపారు. దీనివల్ల కొవిడ్‌ బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బంది పడుతుండడాన్ని గుర్తించిన ప్రభుత్వం..మార్కెట్‌కు వీటి సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రులకు సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ ద్వారా, ప్రైవేటు ఆస్పత్రులకు ఔషధ నియంత్రణ అధికారుల ద్వారా సరఫరా చేస్తోంది. ఇందుకోసం జిల్లాకు సుమారు మూడు వేల  ఇంజక్షన్లు వచ్చాయి. వాటిని ఆరోగ్యశ్రీ పరిధిలో గల ఆస్పత్రులకు సరఫరా చేశారు. అయితే, నగర పరిధిలోని అనేక ఆస్పత్రులు ఇప్పటికీ రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ బయటి నుంచి తెచ్చుకోవాలంటూ బాధిత కుటుంబ సభ్యులను ఇబ్బందిపెడుతున్నాయి. 


సరఫరా చేసినా.. 


ద్వారకానగర్‌ సమీపంలోని ఓ ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రికి అధికారులు సుమారు వందకుపైగా రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లను ఇచ్చారు. అయితే ఆ ఆస్పత్రి సిబ్బంది అక్కడ చికిత్స పొందుతున్న వైరస్‌ బాధిత కుటుంబ సభ్యులను ఇంజక్షన్లు బయటి నుంచి తెచ్చుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. వీలైనంత వేగంగా తెచ్చుకుంటేనే ప్రాణాలు నిలుస్తాయని, లేకపోతే కష్టమని ఆందోళనకు గురిచేస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారు ఒక్కో ఇంజక్షన్‌ రూ.30 వేల చొప్పున కొనుగోలు చేసి సిబ్బందికి అందించారు. జిల్లా అధికారులు ఆస్పత్రికి ఇంజక్షన్లు సరఫరా చేస్తున్నారు గదా?...బయటి నుంచి ఎందుకు తీసుకురమ్మంటున్నారని బాధితుల కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే...జిల్లా ఉన్నతాధికారులు తీసుకున్నారని సిబ్బంది సమాధానమిస్తున్నారు. నగర పరిధిలోనే పలు ఆస్పత్రులకు ఇండెంట్‌ మేరకు ఇంజక్షన్‌లను అధికారులు సరఫరా చేశారు. అయినా రోగులకు వినియోగించకుండా బయట కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. 


ఆస్పత్రుల మైండ్‌గేమ్‌ 


రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ బయటనుంచి తెచ్చుకోమనడం ద్వారా ఆయా ఆస్పత్రులు పెద్దగేమ్‌ ఆడుతున్నాయి. బాధిత వ్యక్తి కండిషన్‌ సీరియస్‌గా వున్నట్టు క్రియేట్‌ చేస్తున్నాయి. రోగి కుటుంబసభ్యులు బయట ఇంజక్షన్‌ దొరక్క తిరిగి ఆస్పత్రికి వస్తే..అక్కడి సిబ్బందే ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. ఫలానా దగ్గర దొరుకుతాయని, ఎక్కువ ధర వుంటుందని చెబుతున్నారు. ఏ బ్లాక్‌ మార్కెట్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం ఆస్పత్రులకు ఇంజక్షన్‌లను సరఫరా చేయాలని నిర్ణయించిందో, అవే ఆస్పత్రులు బ్లాక్‌ మార్కెట్‌ను సృష్టించి మరీ సొమ్ము చేసుకుంటున్నాయి. 


దృష్టి సారించాలి


ప్రైవేటు ఆస్పత్రులకు సరఫరా చేస్తున్న వయల్స్‌ వినియోగంపై జిల్లా అధికారులు దృష్టిసారించాలని కొవిడ్‌ బాధితులు, వారి కుటుంబసభ్యులు కోరుతున్నారు. ఎవరెవరికి  రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ ఇచ్చారో ఆస్పత్రుల నుంచి వివరాలు తెలుసుకోవడంతో పాటు...వారి కుటుంబ సభ్యులతోనూ డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు మాట్లాడి ఖరారు చేసుకోవాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. ఒకపక్క ప్రైవేటుగా కొనుగోలు చేసి తీసుకురమ్మని చెబుతూనే...మరోపక్క ప్రభుత్వం సరఫరా చేసిన వాటిని అదే రోగికి ఇచ్చినట్టు కొన్ని ఆస్పత్రులు లెక్కల్లో చూపిస్తున్నట్టు తెలిసింది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే.. చాలా ఆస్పత్రుల బాగోతం బయటపడుతుందంటున్నారు. అదే సమయంలో రెమ్‌డెసివర్‌ బయట తెచ్చుకోమంటే ఫిర్యాదు చేయాల్సిందిగా చెప్పిన అధికారులు.. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక నంబరు కేటాయించాలని కోరుతున్నారు. ఫిర్యాదు చేయడానికి కలెక్టరేట్‌కు వెళితే..డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులకు చెప్పాలని, అక్కడకు వెళితే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారని వాపోతున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.