భూమి లాక్కున్నారు

ABN , First Publish Date - 2020-07-05T11:13:55+05:30 IST

దశాబ్దాల క్రితం పేదలకు అప్పటి ప్రభుత్వాలు చారెడు భూమి ఇచ్చాయి. ఇళ్ల పట్టాల పేరుతో వాటిని సాగు చేసుకుంటున్నవారి పొట్ట కొట్టడానికి

భూమి లాక్కున్నారు

ఇళ్ల పట్టాలివ్వడానికి సీలింగ్‌ రైతుల పొట్టకొట్టారు

ఆన్‌లైన్‌ నుంచి వివరాల తొలగింపు

పట్టాలున్నా స్వాధీనం చేసుకున్న అధికారులు

మళ్లీ ఇప్పిస్తామని కొందరు నాయకుల వసూళ్లు


నంద్యాల టౌన్‌, జూలై 4: దశాబ్దాల క్రితం పేదలకు అప్పటి ప్రభుత్వాలు చారెడు భూమి ఇచ్చాయి. ఇళ్ల పట్టాల పేరుతో వాటిని సాగు చేసుకుంటున్నవారి పొట్ట కొట్టడానికి ప్రస్తుత ప్రభుత్వం సిద్ధమైంది. 45 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న రైతుల వివరాలు ఆన్‌లైన్‌ నుంచి మాయం చేశారు. పేదలకు ఇంటి స్థలాలంటూ పేదల భూమినే స్వాధీనం చేసుకున్నారు. పట్టాలు ఉన్న భూమినే అక్రమంగా లాక్కొంటున్నారు. వైసీపీ ఇండ్ల పట్టాల పథకం పేదలకు గూడు ఏమోగాని అదే పేదలకు కూడు లేకుండా చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 1972లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత ్వం సీలింగ్‌ విధానాన్ని అమలు చేసింది.


భూస్వాముల నుంచి భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు పంపిణీ చేసింది. భూమి లేని కుటుంబాలకు అర్ధ ఎకరా, ఎకరా పంచి పెట్టింది. లబ్ధిదారులలో అధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారు. కానాలలో 20 ఎకరాలు, భీమవరంలో 120 ఎకరాలు సీలింగ్‌ భూమిని అప్పట్లో పేదలకు పంపిణీ చేశారు. ప్రభుత్వం పంచిన బంజరు భూములను లబ్ధిదారులు చెమట చిందించి సాగు భూములుగా మార్చేశారు. అవే దశాబ్దాలుగా ఆ కుటుంబాలకు బతుకుతెరువు అయ్యాయి. పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వడం అనే పేరుతో అధికారులు అలాంటి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇట్లా 50 మంది రైతులను పొలాల నుంచి బైటికి పంపించేశారు. 


సీలింగ్‌ పొలంలో ఇంటి స్థలాలు

నంద్యాల మండలంలోని కానాల, భీమవరం గ్రామాల్లో పేదలకు ఇంటి స్థలాల కోసం సీలింగ్‌ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కానాల గ్రామ పంచాయతీ పరిధిలో 11 ఎకరాలు, భీమవరం గ్రామ పరిధిలో 26 ఎకరాల సీలింగ్‌ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కానాల పరిధిలో కంపెనీ కొట్టాల, కానాల పేదలకు 300 మందికి కేటాయించారు. భీమవరం వద్ద నంద్యాల పట్టణానికి చెందిన 1000 మంది లబ్ధిదారులకు కేటాయించారు. నంద్యాల మండలంలో 37 ఎకరాలు సీలింగ్‌ భూమిలో లే అవుట్‌ వేశారు.


ఆన్‌లైన్‌ నుంచి సాగు రైతుల వివరాల తొలగింపు

దశాబ్దాలుగా సీలింగ్‌ పొలం సాగు చేసుకుంటున్న రైతుల వివరాలు ఆన్‌లైన్‌ జాబితా నుంచి రెవిన్యూ అధికారులు నాలుగు రోజుల క్రితం తొలగించినట్లు విమర్శలు ఉన్నాయి. ఈ పొలాల మీద పలువురు రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. ఆన్‌లైన్‌లో తమ వివరాలను తొలగించడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.


పట్టా పొలాలనూ స్వాధీనం చేసుకున్నారు

సీలింగ్‌ భూమికి పట్టాలు ఉన్నప్పటికీ, వారు ఏటా సాగు చేసుకుంటున్నప్పటికీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదేం అన్యాయం అని రైతులు ప్రశ్నిస్తున్నారు. 


పొలం ఇప్పిస్తామని నేతల వసూళ్లు

అధికారులు స్వాధీనం చేసుకున్న సీలింగ్‌ పొలం తిరిగి ఇప్పిస్తామని స్థానిక నేతలు దళారులుగా మారారనే విమర్శలు ఉన్నాయి. కొంత భూమికి తిరిగి అన్‌లైన్‌ చేయిస్తామని బాధిత రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కానాలలో సీలింగ్‌ భూమి సాగు చేసుకుంటున్న రైతులకు 40 శాతం తిరిగి ఇప్పిస్తామని అధిక మొత్తంలో వసూలు చేసినట్లు సమాచారం.


45 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నా 

మేము 45 సంవత్సరాలుగా ఈ పొలాలు సాగు చేసుకుంటున్నాం. సీలింగ్‌ భూమి మా అనుభవంలో ఉన్నట్లు ఆన్‌లైన్‌ అడంగల్‌లో వివరాలు ఉన్నాయి. మాకు వేరే ప్రాంతంలో పొలం ఇస్తామని అధికారులు అంటున్నారు. ఉన్న పొలం లాక్కొని ఇంకో చోట ఇవ్వడం ఏమిటి? భూమి స్వాధీనం చేసుకున్నారుగాని మళ్లీ ఇంతవరకు ఇవ్వలేదు.

- భాస్కర్‌, భీమవరం


పట్టా పొలం తీసుకోలేదు

పట్టా ఉన్న సీలింగ్‌ భూమిని తీసుకోలేదు. సాగు చేసుకుంటున్న రైతులకు మరొక ప్రాంతంలో ఇస్తామని చెప్పాం. సీలింగ్‌ రైతులకు నష్టం జరుగకుండా చూస్తాం.

- రవి కుమార్‌, తహసీల్దార్‌, నంద్యాల

Updated Date - 2020-07-05T11:13:55+05:30 IST